Chandrababu on Mega Parent Teacher Meeting :దేశ చరిత్రలోనే మొదటిసారిగా రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఒకేరోజు 44,000ల పైచిలుకు పాఠశాలల్లో మెగా పేరెంట్స్- టీచర్స్ సమావేశాలు నిర్వహించారు. బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో జరిగిన పేరెంట్స్- టీచర్స్ సమావేశానికి సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కీలకోపన్యాసం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థికి ఉజ్వల భవిష్యత్త్ అందించేలా 20 ఏళ్ల ప్రణాళికను రూపొందించాలని చంద్రబాబు నిర్దేశించారు. బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మంత్రి లోకేశ్‌తో కలిసి ఆయన ముఖాముఖి మాట్లాడారు. పిల్లలూ బాగున్నారా అని ఆప్యాయంగా పలకరించారు. సమావేశానికి తండ్రుల కన్నా తల్లులే ఎక్కువ మంది వచ్చారని నవ్వుతూ చెప్పారు. పదో తరగతి చదువుతున్న మీనాక్షి అనే విద్యార్థిని, ఆమె తండ్రితో ముఖ్యమంత్రి మాట్లాడారు.
ముఖ్యమంత్రి: ఏమ్మా నీ పేరేంటి? పాఠశాలకు ఆగస్టులో సరిగా రాలేదు. అక్టోబర్‌లో ఎందుకు హాజరు కాలేదు?
- విద్యార్థిని : సార్ నా పేరు మీనాక్షి. పదో తరగతి చదువుతున్నా. టైఫాయిడ్ రావటంతో హాజరు కాలేదు.
ముఖ్యమంత్రి : (విద్యార్థిని తండ్రిని ఉద్దేశించి) నీ పేరేంటి? ఎంత మంది పిల్లలు?
- తండ్రి : సార్ నా పేరు శివకిషోర్. లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాను. మాకు ఇద్దరు పిల్లలు. అబ్బాయి సురేష్, అమ్మాయి మీనాక్షి.
ముఖ్యమంత్రి : అబ్బాయి ఏం చేస్తున్నాడు?
- తండ్రి : మా అబ్బాయి ఐదో తరగతితో చదువు మానేశాడు. డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.
ముఖ్యమంత్రి : మధ్యలో చదువు ఎందుకు మానేశాడు? కౌన్సెలింగ్ చేయలేదా? ఇప్పుడు వయస్సు ఎంత?
- తండ్రి : చెడు స్నేహాల వల్ల చదువు మధ్యలో ఆపేశాడు. చదువుకోమని ఎంత చెప్పినా మా మాట వినలేదు. ప్రస్తుతం 21 సంవత్సరాల వయస్సు. అమ్మాయిని బాగా చదివిస్తాను సార్.