CM Chandrababu at World Tourism Day: పరిశ్రమలకు ఇచ్చే అన్ని ప్రోత్సాహకాలను పర్యాటక రంగానికి అందిస్తామని, ఈ రంగానికి త్వరలో ఇండస్ట్రీ స్టేటస్ ఇస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. టూరిజం హోటల్స్‌ను రాత్రి 12 వరకు తెరిచి ఉంచే అవకాశం కల్పిస్తామన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకులకు సీఎం చంద్రబాబు హాజరయ్యారు. పర్యాటకరంగ అభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డులు ఇచ్చారు. మొత్తంగా 38 విభాగాల్లో అవార్డులను ప్రదానం చేశారు.
పర్యాటక ప్రాంతాల్లో వసతుల కల్పనకు ఐఆర్‌సీటీసీ, ఏపీటీడీసీ మధ్య ఒప్పందం కుదిరింది. సీఎం సమక్షంలో ఆయా విభాగాల ఉన్నతాధికారులు ఒప్పందం చేసుకున్నారు. రాష్ట్రంలో ఎక్కడా గంజాయి, డ్రగ్స్, అసాంఘిక కార్యకలాపాలు లేకుండా చర్యలు తీసుకుంటామని, రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి పీపీపీ మోడల్ అమలుచేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. వచ్చే నెలలో టూరిజం ఇండస్ట్రియల్ పాలసీ ప్రకటించి ప్రోత్సహిస్తామన్న సీఎం, పర్యాటక రంగంలో పెట్టుబడికి ముందుకు రావాలని కోరారు.
పర్యాటక రంగంలో తక్కువ పెట్టుబడులతో ఎక్కువ ఆదాయం వస్తుందని, పెట్టుబడులతో రాష్ట్రం స్వర్ణాంధ్రగా, స్వర్గసీమగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విభిన్న టూరిజం ప్రాజెక్టులు అభివృద్ధి చేస్తామన్న చంద్రబాబు, తీరప్రాంతం వల్ల పర్యాటక అభివృద్ధికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్నారు. బీచ్ టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని, రాష్ట్రంలో ఉన్న 283 బీచ్‌లను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.
జగన్‌ను తిరుమలకు వెళ్లవద్దని ఎవరన్నారు? : సీఎం చంద్రబాబు - CM Chandrababu on YS Jagan
టూరిజంను బతికిస్తామనే నమ్మకం వచ్చింది: ఐదేళ్లతర్వాత ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. ఇవాళ స్పందన చూస్తుంటే రాష్ట్రంలో టూరిజంను బతికిస్తామనే నమ్మకం వచ్చిందని ధీమా వ్యక్తం చేశారు. పర్యాటకం అనేది శాంతిని ఇవ్వగలుగుతుందన్న సీఎం, పర్యాటక ప్రాంతం వల్ల మానసిక ఆనందం, ఆహ్లాదం వస్తుందని పేర్కొన్నారు. పర్యాటక ప్రాంతాల అభివృద్దికి భారత్‌లో ఎక్కువ అవకాశాలున్నాయని, భవిష్యత్తులో అభివృద్దికి ఉన్న ఇజం టూరిజం మాత్రమే అని స్పష్టం చేశారు.