Child Hanging Cloth on Mother Dead Body Back:అమ్మ ఒడిలో హాయిగా ఆడుకోవాల్సిన ఆ రెండేళ్ల చిన్నారి పొదల్లో తల్లి మృతదేహం పైనే రెండు రోజులు ఉంది. ఆకలితో ఏడుస్తున్నా అమ్మ పట్టించుకోవడం లేదు. చుట్టూ ఎవరూ కనిపించడం లేదు. దీంతో చిన్నారి రెండు రోజులపాటు నరకయాతన అనుభవించింది. ఇక ఆకలికి ఓర్చుకోలేక ఎలాగోలా కష్టపడి కిందకు దిగి రోడ్డు మీదకు రావడంతో ఆమె తల్లి మృతి చెందిన విషయం బయటకు తెలిసింది. ఈ దారుణమైన ఘటన అల్లూరి జిల్లా అరకులోయ మండలం పానిరంగిని సమీపంలో జరిగింది.
అనంతగిరి మండలం కోనాపురం పంచాయతీ బొండ్యగుడ గ్రామానికి చెందిన పాంగి పద్మ, పద్మాపురానికి చెందిన కొండకు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు. రెండేళ్ల వయసున్న చిన్న కుమార్తె పుష్పను వెంటబెట్టుకొని పద్మ ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా పానిరంగినిలో నివసిస్తున్న పెదనాన్న కుమార్తె ఇంటికి బుధవారం వెళ్లింది. అక్కడ అందరితో కలిసి భోజనం కూడా చేసింది. అయితే వాళ్లంతా పనికి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేసరికి పద్మ, ఆమె కుమార్తె కనిపించలేదు.
దీంతో పద్మ తన ఇంటికి వెళ్లిపోయిందేమోనని బంధువులు భావించారు. చివరకు శుక్రవారం ఉదయం రెండేళ్ల చిన్నారి ఏడ్చుకుంటూ రోడ్డు మీదకు వచ్చింది. దీంతో స్థానికులు ఆ పాప తల్లిదండ్రులు ఎవరు ? పాప ఒక్కతే ఎలా వచ్చిందని చుట్టుపక్కల వెతికారు. సమీపంలోని పొదల్లో ఉన్న ఓ చెట్టుకు తాడుతో వేలాడుతూ పద్మ మృతదేహం కనిపించింది. ఆమె బంధువుల ఇంటి నుండి బయటకు వచ్చి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.