ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సంపద సృష్టిస్తాం - ప్రజల ఆదాయం పెంచుతాం: చంద్రబాబు - CHANDRABABU ON AP INCOME

గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం - స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ 2047 ద్వారా రాష్ట్ర ప్రగతికి ప్రణాళికలు

CM Chandrababu
CM Chandrababu (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 16, 2025, 4:45 PM IST

Updated : Jan 16, 2025, 5:54 PM IST

CM Chandrababu About AP Income : గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. అమరావతిని భ్రష్టు పట్టించారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌కు పోలవరం జీవనాడి అని చెప్పారు. కానీ వైఎస్సార్సీపీ పాలనలో పోలవరాన్ని గోదావరిలో కలిపారని ఆక్షేపించారు. స్థానికులు రాష్ట్రంలో పెట్టుబడులకు వెనకాడే పరిస్థితి నెలకొందని వాపోయారు. తెలంగాణకు హైదరాబాద్‌ ద్వారా అత్యధిక తలసరి ఆదాయం వస్తోందని వివరించారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర వృద్ధిరేటుపై చంద్రబాబు ప్రజంటేషన్ ఇచ్చారు.

ఇంటిని జియో ట్యాగ్‌ చేసి కుటుంబసభ్యులను అనుసంధానం చేస్తున్నాం (ETV Bharat)

సంపద సృష్టిస్తాం ఆదాయం పెంచుతామని చంద్రబాబు చెప్పారు. అభివృద్ధి వల్ల సంపద వచ్చి ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందన్నారు. ఆదాయం పెరిగితే పథకాల ద్వారా పేదరికం నిర్మూలించవచ్చని తెలిపారు. రెండో తరం సంస్కరణలను తాను మొదలుపెట్టినట్లు వివరించారు. మౌలిక సౌకర్యాల కల్పనలో సంస్కరణలు తీసుకువచ్చానని గుర్తుచేశారు. పవర్‌ సెక్టార్‌లో సంస్కరణల ద్వారా రాష్ట్రానికి వెలుగులు తెచ్చామని సీఎం వెల్లడించారు.

'ఓపెన్‌ స్కై పాలసీ ద్వారా దుబాయ్‌-హైదరాబాద్‌ విమాన సర్వీసు ప్రవేశపెట్టాం. హైదరాబాద్‌లో తొలి గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయానికి శ్రీకారం చుట్టాం. హైదరాబాద్‌లో 163 కి.మీ మేర ఔటర్‌ రింగ్‌రోడ్డు నిర్మాణం చేపట్టాం. స్వర్ణాంధ్రప్రదేశ్‌, విజన్‌ 2047 లక్ష్యంగా పనిచేస్తున్నాం. భారత్‌లో అన్ని సంస్కృతుల కంటే మనది చాలా గొప్పది. కుటుంబ వ్యవస్థ వల్ల భద్రత చాలా బాగుంటుంది. ఆధార్‌ ద్వారా ప్రతి వ్యక్తికి గుర్తింపు లభించింది' అని చంద్రబాబు పేర్కొన్నారు.

ఇంటిని జియో ట్యాగ్‌ :ఇంటిని జియో ట్యాగ్‌ చేసి కుటుంబ సభ్యులను అనుసంధానం చేస్తున్నట్లు చంద్రబాబు వివరించారు. నేషనల్‌ పేమెంట్‌ గేట్‌వే ద్వారా ఎన్‌పీ ఖాతా తీసుకుంటున్నామని చెప్పారు. విపత్తు సమయాల్లో బాధితుల ఇళ్లు, ఖాతాల విషయంలో ఇబ్బందులను ఇంటికి జియో ట్యాగ్, ఎన్‌పీ ఖాతాతోలు అధిగమించవచ్చని తెలిపారు. ప్రతి వ్యక్తి, కుటుంబం, సమాజం ఆనందంగా ఉండాలన్నారు. వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఫ్యామిలీ ధ్యేయంతో ముందుకెళ్తున్నట్లు ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.

"ఆర్థిక అసమానతలు తగ్గించడానికి నిరంతరం శ్రమించాలి. పేదలను ఆర్థికంగా పైకి తీసుకురావడానికి కార్యక్రమం చేపట్టాలి. ధనికుల తమ శక్తి సామర్థ్యాల మేరకు కార్యక్రమాలు చేపట్టాలి. ప్రజలను ఆర్థికంగా పైకి తేవడానికి పీ4 గేమ్‌ఛేంజర్‌ కానుంది. సంపద సృష్టిలో పీ3 గేమ్‌ఛేంజర్‌గా నిలుస్తుంది. గతంలో నేను చెప్పింది ఇప్పుడు జరిగేది ప్రజలకు వివరించాం. ప్రజలను భాగస్వాములను చేసుకుని ముందుకెళ్తున్నాం." - చంద్రబాబు, ముఖ్యమంత్రి

'విజన్‌ డాక్యుమెంట్‌పై దేశంలో తొలిసారి 16 లక్షల మంది స్పందించారు. వికసిత్‌ భారత్‌కు కూడా ఈ స్థాయిలో స్పందన రాలేదు. ఆన్‌లైన్‌లో వచ్చిన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నాం. పది సూత్రాలతో మళ్లీ విజన్‌ను రూపొందించాం. పొరుగు రాష్ట్రాల జీఎస్‌డీపీని వివరించా. 2047 నాటికి 2.4 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారడం లక్ష్యం. 2047 నాటికి 42,000ల డాలర్ల తలసరి ఆదాయం లక్ష్యం' అని చంద్రబాబు తెలిపారు.

"గడిచిన కొన్నేళ్లుగా 10 శాతం మాత్రమే వృద్ధిరేటు. 2047 నాటికి 15 శాతం వృద్ధితో 58.14 లక్షల తలసరి ఆదాయం. ప్రస్తుత తలసరి ఆదాయం 2.68 లక్షల నుంచి 58.14 లక్షలు అవుతుంది. ప్రస్తుత జీఎస్‌డీపీ రూ.16,06,109 కోట్లుగా ఉంది.15 శాతం వృద్ధితో వచ్చే ఏడాదికి జీఎస్‌డీపీ 18.47 లక్షల కోట్లుగా ఉంటుంది. జాతీయ వృద్ధిరేటుతో పోలిస్తే ఏపీలో 2.8 శాతం ఎక్కువగా నమోదు. రూ.64,600 కోట్ల ఎఫ్‌ఆర్‌బీఎంకు అవకాశం వస్తుంది. దీని వల్ల రాష్ట్రానికి రూ.1,20,056 కోట్ల ఆదాయం వస్తుంది. ఇదే విధంగా వృద్ధి సాధిస్తే ఏడాదికి అదనంగా రూ.20,645 కోట్లు వస్తుంది." - చంద్రబాబు, ముఖ్యమంత్రి

Chandrababu on AP growth Rate : గతేడాదితో పోలిస్తే ఈసారి 4.03 శాతం వృద్ధి సాధించామని చంద్రబాబు పేర్కొన్నారు. ఈసారి వృద్ధిరేటు 12.94 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర వనరులు, ఎఫ్‌ఆర్‌బీఎం ద్వారా రూ.3.23 లక్షల కోట్లు ఖర్చు పెట్టవచ్చని తెలిపారు. జీఎస్‌డీపీ, తలసరి ఆదాయం ప్రకారం అభివృద్ధిని సాధిస్తామని అన్నారు. ఆదాయం పెరిగితే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయని ముఖ్యమంత్రి వివరించారు.

'వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాలను పరిగణలోకి తీసుకోవాలి. ఏపీ జీఎస్‌డీపీ ఫస్ట్‌ అడ్వాన్స్‌ ఎస్టిమేట్స్‌ ఆధారంగా సోషియో ఎకనమిక్‌ సర్వే. సోషియో ఎకనమిక్‌ సర్వే ప్రకారం వచ్చే ఏడాది బడ్జెట్‌ తయారీ. టీడీపీ అధికారంలో ఉంటే వ్యవసాయం, రైతులకు పండగ. వ్యవసాయ రంగంలో 15.8 శాతం వృద్ధి సాధించాం. పరిశ్రమల రంగంలో 6.7, సేవల రంగంలో 11.7 శాతం వృద్ధి. పర్యాటక రంగంలో 20 శాతం వృద్ధి సాధించే అవకాశం. లక్ష్య సాధనకు పరిపాలన రంగం మొత్తానికి తర్ఫీదు ఇస్తాం' అని చంద్రబాబు తెలిపారు.

2026 నాటికి ఏపీ జనాభా 5.38 కోట్లు అని 2047 నాటికి 5.41 కోట్లకు చేరవచ్చని అంచనా వేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. 2031 నుంచి ఏపీలో జనాభా పెరుగుదల రేటు తగ్గే అవకాశం ఉందన్నారు. భవిష్యత్​ను ఊహించి అభివృద్ధి ప్రణాళికలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అమరావతి, పోలవరం నిర్మాణ పనులు వేగవంతం చేశామని, పోలవరం నుంచి బనకచర్లకు నీళ్లు తీసుకెళ్తే రాష్ట్రం సస్యశ్యామలం అవుతందని వెల్లడించారు. నీరు, జనాభాను సమతుల్యం చేస్తే అద్భుతాలు సృష్టించవచ్చని ముఖ్యమంత్రి వివరించారు.

కోడిపందేలపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు - ఏమన్నారంటే !

పీ-4 ద్వారా పేదల జీవన ప్రమాణాలు పెంచుతాం: సీఎం చంద్రబాబు

Last Updated : Jan 16, 2025, 5:54 PM IST

ABOUT THE AUTHOR

...view details