Cheetah Wandering at Mudigallu Hills in Anantapur District: ఇటీవల రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చిరుత, పులుల సంచారం ఎక్కువైంది. అవి అడవుల నుంచి నివాస ప్రాంతాల్లోకి రావటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఒకప్పుడు అడవుల్లోనే ఉండే ఈ జీవులు ఇప్పుడు జనావాసాల్లోకి రావడం కలకలం రేపుతోంది. ఇటీవలే శ్రీశైలంలోని పాతాళ గంగ సమీపంలో నేరుగా ఓ ఇంట్లోకి చిరుత చొరబడిన ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి.
తాజాగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ముదిగల్లు కొండపై చిరుత సంచారం కలకలం రేపింది. చిరుత సంచరిస్తుండటంతో గ్రామ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. చిరుత సంచరించడపై అటవీ శాఖ అధికారులకు స్థానికులు సమాచారం అందించారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా చిరుత గ్రామంలోకి ప్రవేశించి పెంపుడు జీవాలపై దాడులు చేస్తోందని స్థానిక ప్రజలు చెబుతున్నారు. కొండ పరిసర ప్రాంతాల్లోకి బిక్కుబిక్కుమంటూ వెళ్లాల్సిన దుస్థితి ఏర్పండిందని వాపోతున్నారు. అటవీ అధికారులకు అనేకసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.