ICICI Bank Response on Cheating: చిలకలూరిపేట ఐసీఐసీఐ బ్యాంక్‌లో జరిగిన గోల్‌మాల్‌పై బ్యాంక్ ప్రతినిధులు స్పందించారు. తాము ఎల్లప్పుడూ తమ కార్యకలాపాలలో కస్టమర్ ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుంటామని తెలిపారు. చిలకలూరిపేటలోని శాఖలో అవకతవకలు జరిగినట్లు తమ దృష్టికి రావటంతో సంబంధిత ఉద్యోగులను వెంటనే సస్పెండ్ చేశామని పేర్కొన్నారు. బ్యాంకులో జరిగే మోసాల పట్ల తమకు జీరో టాలరెన్స్ పాలసీ ఉందని ప్రకటించారు. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు చేస్తామని, నిజమైన క్లెయిమ్‌లు కలిగి ఉన్న కస్టమర్ల ఆర్థిక ప్రయోజనాలకు పూర్తిగా రక్షణ కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
Chilakaluripet ICICI Bank Cheating: పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని విజయ బ్యాంక్ సమీపంలో ఉన్న ఐసీఐసీఐ బ్యాంకులో భారీ కుంభకోణం చోటు చేసుకుందని ఖాతాదారులు గురువారం ఆరోపించారు. గతంలో మేనేజర్‌గా పని చేసిన నరేశ్, గోల్డ్ అప్రైజర్ హరీశ్‌ల ఆధ్వర్యంలో కోట్ల రూపాయల నగదు ఖాతాదారుల అకౌంట్ల నుంచి వివిధ రకాల మోసాలతో తస్కరించినట్టు బాధితులు పెద్ద ఎత్తున బ్యాంకు వద్దకు వచ్చి వాపోయారు. నగదు డిపాజిట్లు, తాకట్టు బంగారం విషయంలో ఎక్కువగా మోసం జరిగినట్లు బాధితులు బ్యాంకు వద్దకు వచ్చి గగ్గోలు పెట్టారు.
ఉదాహరణకు పట్టణంలోని పొత్తూరి కోటేశ్వరమ్మ పేరుతో 45 లక్షల రూపాయలు డిపాజిట్ చేశారు. ఏడాది తర్వాత మేనేజర్ నరేశ్ రెన్యువల్ చేస్తున్నానని చెప్పి తన సొంత ఖాతాకు బదిలీ చేసుకున్నాడు. మరో నలుగురికి సంబంధించిన 79 లక్షల రూపాయలను డిపాజిట్ చేశారు. అయితే వాటి నుంచి ఓడీ రూపంలో 90 శాతం నగదు నరేశ్ తన ఖాతాకి బదిలీ చేసుకున్నారు. ఇలా డిపాజిట్లు, తాకట్టు పెట్టిన బంగారానికి సంబంధించి పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడ్డారు. కోట్ల రూపాయల నగదు ఖాతాదారుల నుంచి గత మేనేజర్ నరేశ్, గోల్డ్ అప్రైజర్ హరీశ్‌లు దోచుకున్నట్లు బాధితులు బ్యాంకు వద్దకు వచ్చి వాపోయారు.