CHANDRABABU SRIKAKULAM TOUR :ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభమైంది. దీపం 2.0లో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం ఈదుపురంలో సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభించారు. మహిళా లబ్ధిదారు ఇంటికి వెళ్లి ఉచిత గ్యాస్ సిలిండర్ అందజేసిన చంద్రబాబు స్వయంగా స్టవ్ వెలిగించి టీ చేసి తయారు చేశారు. తర్వాత మంత్రులతో కలిసి తాగారు. చంద్రబాబు వెంట రామ్మోహన్‌నాయుడు, నాదెండ్ల మనోహర్ తదితరులు ఉన్నారు.
అనంతరం బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో సభలకు ప్రజలను బలవంతంగా తరలించారని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. వైఎస్సార్సీపీ నేతలు ప్రజాస్వామ్య హద్దులు దాటి ఇబ్బంది పెట్టారని, బాధ్యత గల ప్రజాప్రతినిధినని, తప్పు చేసిన వారిని వదిలిపెట్టనని అన్నారు. రాజకీయ కక్షసాధింపులకు పోనని తెలిపారు. నాయకుడు అంటే ప్రజల మనసుల్లో అభిమానం ఉండాలని, తనను అరెస్టు చేశాక తెలుగు ప్రజలంతా స్పందించారని, మొన్నటి ఎన్నికల్లో తెలుగు తమ్ముళ్లు, జనసైనికులు రాజీలేని పోరాటం చేశారని, అందరం కలిసి రాష్ట్రాన్ని కాపాడుకున్నామని అన్నారు.