CHANDRABABU PRAJA GALAM MEETING: ముఖ్యమంత్రి జగన్ అహంకారి అని, ఆయనకు విధ్వంసం, వినాశనం తప్ప అభివృద్ధి చేయడం చేతకాదని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో బందిపోటు దొంగ పడ్డాడని, కాపాడుకోవడానికి వైసీపీను తరిమికొట్టాలన్నారు. ప్రజాగళం కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు విజయనగరం జిల్లాలో పర్యటించారు. శృంగవరపుకోటలో నిర్వహించిన బహిరంగసభలో ఆయన పాల్గొన్నారు. కూటమి పార్టీల శ్రేణులు పెద్దఎత్తున తరలివచ్చారు.
జగన్ హామీ జాబ్ క్యాలెండర్, డీఎస్సీ ఏమయ్యాయని నిలదీశారు. ఎస్ కోటను స్థానిక ఎమ్మెల్యే అవినీతి కోటగా మార్చారని చంద్రబాబు ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వంలో ఎవరికీ రక్షణ లేదని, మహిళలకు అస్సలు రక్షణ లేదని అన్నారు. ఇందుకు నిదర్శనం, గుంటూరుజిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన కొవ్వురు లక్ష్మి అని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ అన్యాయాలు, అక్రమాలపై ఆమె పోరాడిందని, దిల్లీకి వెళ్లి ఎంతో మంది ప్రముఖులను కలవడానికి ప్రయత్నం చేసిందని చెప్పారు.
ఎవరి అనుమతి లభించక పోవడంతో బొటన వేలు కొసుకుందని పేర్కొన్నారు. వైసీపీ అరాచక పాలన పోవాలని ఈ సాహసం చేసిందన్న చంద్రబాబు, అదేవిధంగా కర్నూలులో అబ్దుల్ కుటుంబం వైసీపీ ప్రభుత్వం పెట్టే బాధలు తట్టుకోలేక రైలు కింద పడి చనిపోయారని తెలిపారు. ఒక అరాచక శక్తి, ఒక దుర్మార్గుడు ఈ రాష్ట్రాన్ని ఏలుతున్నాడని, జగన్ ఒక అహంకారి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా అన్యాయం జరిగింది అంటే వారిని బాధపెట్టడం, చివరికి హత్య చేస్తున్నారని, మండిపడ్డారు.
జగన్ ఒక బందిపోటు:అధికారంలోకి రాక ముందు, జగన్ అనేక హామీలు ఇచ్చాడని, అందులో ఒకటైన చేశాడా అని ప్రశ్నించారు. హామీలు సంగతి పక్కన పెడితే, వ్యవసాయం చచ్చిపోయిందని, రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ప్రజలకు ఒక సెంట్ భూమిచ్చాడని, ఆయన మాత్రం 500 కోట్లు ఖర్చుపెట్టి ఇళ్లను కట్టుకున్నాడని అన్నారు. పులివెందుల, హైదారాబాద్, బెంగుళూరు ఇలా అనేక చోట్ల ప్యాలెస్లు ఉన్నాయని ఆరోపంచారు. అవి సరిపోలేదని విశాఖలో కూడా ప్యాలెస్ కట్టాడని, జగన్ ఒక బచ్చా కాదు, ఒక బందిపోటు అని మండిపడ్డారు. రాష్ట్రాన్ని దోచుకోవడానికి వచ్చిన ఒక బందిపోటని విమర్శించారు.