CHANDRABABU PAWAN KALYAN PRAJAGALAM: రోజుకో సింపతీ డ్రామాతో ప్రజలను మభ్యపెట్టేందుకు జగన్ యత్నిస్తున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శించారు. అన్నమయ్య జిల్లా రాజంపేట, రైల్వేకోడూరులో జనసేనాని పవన్ కల్యాణ్‌తో కలిసి బహిరంగసభల్లో పాల్గొన్న చంద్రబాబు, ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే ఏం జరుగుతుందో ప్రజలంతా గమనించారన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నమయ్య ప్రాజెక్టును పునర్నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ప్రాజెక్టు బాధితులను ఆదుకుంటామన్నారు. పేదలకు మూడు సెంట్ల చొప్పున స్థలమిచ్చి, ఇళ్లు కట్టిస్తామని వాగ్దానం చేశారు. గాలేరు- నగరి కాలువను పూర్తి చేసి, కృష్జా జలాలను తీసుకొస్తామన్నారు. సీమను పెద్దిరెడ్డి కుటుంబం దోచుకుంటుందన్న చంద్రబాబు, కూటమి వచ్చాక అక్రమార్కులకు సంకెళ్లేస్తామని హెచ్చరించారు.
ఎర్ర స్మగ్లర్లకు బేడీలేస్తా: కూటమి అధికారంలోకి రాగానే ఎర్ర స్మగ్లర్లకు బేడీలేస్తానని, చిత్తూరులో ఎర్రచందనం స్మగ్లర్‌కి సీటిచ్చారంటే వీరి నిబద్దత ఏంటో అర్ధం చేసుకోవాలని అన్నారు. ఒక అహంకారి, ఒక విధ్వంసకారి, రాష్ట్రాన్ని దోచేసిన వ్యక్తిని ఇంటికి పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు. ఐదేళ్లు పరదాలు కట్టుకుని తిరిగాడని విమర్శించారు. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడానికి కారణం ఈ జగన్ రెడ్డి అని దుయ్యబట్టారు. పేదల జీవితాల్లో మార్పు రావాలన్నా, వెలుగు రావాలన్నా సైకోని తరిమికొట్టాలని అన్నారు.
జగన్ రెడ్డి గత ఎన్నికల్లో చెల్లిని, తల్లిని వాడుకుని గెంటేసి దాన్ని తమపైకి నెట్టాలని చూస్తున్నాడని మండిపడ్డారు. వాళ్ల ఇంట్లో జరిగే గొడవల్ని తమపైకి నెట్టి సానుభూతి పొందాలని ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. వివేకాను ఎమ్మెల్సీగా ఓడించింది జగన్ రెడ్డి, అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి కాదా అని ప్రశ్నించారు. అవినాశ్ రెడ్డికి ఎంపీ సీటు ఇవ్వొద్దని, అవసరమైతే షర్మిలకు ఇవ్వమంటే వివేకాపై దాడి చేసి చంపేశారని విమర్శించారు. సమాధానం చెప్పమని సునీత రెడ్డి ప్రశ్నిస్తుంటే తమపై నింద నెట్టేస్తారా అని నిలదీశారు. భార్య మాట విని తల్లిని గెంటేసినోడు ప్రజలకు ఏం చేస్తాడని చంద్రబాబు ప్రశ్నించారు. అమాయకుడిగా మొహం పెట్టి, నేరాలు చేసే ఘరానా ముఠా నాయకుడు జగన్ రెడ్డి అని చంద్రబాబు దుయ్యబట్టారు.