Mild Earthquakes in Prakasam District : ప్రకాశం జిల్లాలో వరుసగా మూడో రోజు కూడా స్వల్ప భూప్రకంపనలు వచ్చాయి. ముండ్లమూరు, సింగనపాలెం, శంకరాపురం, మారెళ్ల పరిసర ప్రాంత్లాల్లో భూమి కంపించినట్లు ప్రజలు తెలిపారు. మూడో రోజూ భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. గత రెండు రోజుల నుంచి ప్రకాశం జిల్లాలోని ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లోని పలు గ్రామాల్లో స్వల్పంగా భూప్రకంపనలు వచ్చిన విషయం తెలిసిందే.
ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భూప్రకంపనలు చోటుచేసుకోవడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా నేడు మరోసారి ప్రకాశం జిల్లాలో భూకంపం సంభవించింది. వరుసగా మూడో రోజు కూడా జిల్లాలో భూమి కంపించడంతో స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు ఆదివారం ముండ్లమూరు మండలంలో ఒక సెకను పాటు భూమి కంపించింది. ముండ్లమూరు, సింగన్నపాలెం, మారెళ్లలో భూప్రకంపనలు రావడంతో ప్రజలు ఆందోళన చెందారు.
శనివారం సైతం ఇదే మండలాల్లో రెండు సెకన్ల పాటు భూమి కంపించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఏం జరిగిందో తెలియక ఇళ్లలోని ప్రజలు నుంచి బయటకు వచ్చారు. ముండ్లమూరు, వేంపాడు, మారెళ్ల, తూర్పుకంభంపాడు, తాళ్లూరు, శంకరాపురం, పోలవరం, గంగవరం, రామభద్రాపురం, శంకరాపురంలో భూకంపం సంభవించింది. ఆ సమయంలో ముండ్లమూరు స్కూల్ నుంచి విద్యార్థులు బయటకు పరుగులు తీశారు. ప్రభుత్వ ఆఫీసుల నుంచి ఉద్యోగులు బయటకు వచ్చారు. పలు గ్రామాల్లో భూకంపం సంభవించడంతో ఇళ్లలోని వస్తువులన్నీ కదిలాయని ప్రజలు తెలిపారు.
భూప్రకంపనలపై ప్రభుత్వం దృష్టి: ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాల్లో వరుస భూప్రకంపనలపై ప్రభుత్వం దృష్టిసారించింది. దర్శి నియోజకవర్గంలో భూ ప్రకంపనలపై మంత్రులు గొట్టిపాటి రవి కుమార్, డోలా బాలవీరాంజనేయస్వామి జిల్లా కలెక్టర్‌తో మాట్లాడారు. తరచుగా పలు మండలాల్లో భూ ప్రకంపనలు ఎందుకు వస్తున్నాయో డిజాస్టర్ మేనేజ్మెంట్తో (Disaster Management) మాట్లాడి తెలుసుకోవాలని ఆదేశించారు. అవసరమైతే ఎన్జీఆర్ఐ (National Geophysical Research Institute) శాస్త్రవేత్తలతో కూడా చర్చించాలని సూచించారు. భూ ప్రకంపనలపై పూర్తి రిపోర్టు ఇవ్వాలని ఆదేశించారు. భూప్రకంపనలపై ప్రజలు ధైర్యంగా ఉండాలని, భయభ్రాంతులకు గురికావద్దని మంత్రులు విజ్ఞప్తి చేశారు.
ప్రకాశం జిల్లాలో మరోసారి భూకంపం - 24 గంటల్లో 2 సార్లు కంపించడంపై స్థానికుల్లో ఆందోళన