Chandrababu Naidu on Voter Turnout: వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని, సీఎం జగన్‌ను గద్దె దించాలనే కసి ఓటరులో కనిపించిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. ఓటింగ్ సరళిపై హర్షం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ వాళ్లు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్‌లో భాగస్వాములయ్యారని తెలిపారు. పుంగనూరులో టీడీపీ ఎజెంట్లను అపహరించడంతో మొదలు పెట్టి, మాచర్ల, తాడిపత్రి, నరసరావుపేటల్లో వైఎస్సార్సీపీ వాళ్లు ప్రణాళిక ప్రకారమే దాడులు, దౌర్జన్యాలకు పాల్పడ్డారన్నారు.
పోలింగ్ అనంతరం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో విలేకరులతో అధినేత చంద్రబాబు చిట్‌చాట్ నిర్వహించారు. వైఎస్సార్సీపీ కుట్రల్ని ప్రజల సహకారంతో టీడీపీ శ్రేణులు ఎక్కడిక్కడ భగ్నం చేశాయన్నారు. యువత, మహిళలు, ఉద్యోగులు ఇలా అన్ని వర్గాల్లోనూ ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత పెల్లుబికిందన్నారు. ఓటుతో వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పారని వెల్లడించారు. పక్క రాష్ట్రాల నుంచి కొందరైతే ఇతర దేశాల నుంచి కూడా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవడం పట్ల హర్షం వ్యక్తంచేశారు. ఈ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు చూడబోతున్నామని తెలిపారు.
భారీగా నమోదైన ఓటింగ్ శాతం - అర్ధరాత్రి వరకూ క్యూలైన్లలో జనం - andhra pradesh elections 2024
ప్రతి ఓటరుకు ధన్యవాదాలు:రాష్ట్ర ఎన్నికల చరిత్రలో ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు అని ఓటు వేయడానికి ప్రజలు చూపించిన ఉత్సాహం, వారిలో వెల్లివిరిసిన చైతన్యం చూసాక కొత్త చరిత్రకు ఇది శ్రీకారం అనిపించిందని కొనియడారు. అరాచకానికి ముగింపు పలికి ప్రజాస్వామ్య పాలన సాధించుకోవాలనే కసి పోలింగ్ కేంద్రాలకు వచ్చిన ప్రతి ఓటరు లోనూ స్పష్టంగా కనిపించిందన్నారు. ఒకే రకమైన సంకల్పంతో ఓటు వేయడానికి వందల, వేల కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చారని, ఆర్థిక భారాన్ని, ఎండ వేడిమిని, ప్రయాణ కష్టాన్ని ఓర్చుకుని రాష్ట్రం కోసం పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చిన ప్రతి ఓటరుకు అధినేత హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు.
వెనక్కి తగ్గని ఓటరు ధైర్యానికి వందనం: ఓటమి భయంతో భయోత్పాతం సృష్టించి పోలింగ్ ను తగ్గించడానికి వైఎస్సార్సీపీ నేతలు హింసకు పాల్పడినా ఎక్కడా వెనక్కి తగ్గని ఓటరు ధైర్యానికి వందనమన్నారు. ఇప్పటి వరకు ఉన్న పరిస్థితి రాష్ట్ర ఎన్నికల చరిత్రలో ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు అని అభిప్రాయపడ్డారు. ఇప్పటి వరకు ఉన్న పరిస్థితులు చూస్తే 80 శాతానికి పైగా పోలింగ్ నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని ఇది శుభసూచకమన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కూటమిగా కలిసివచ్చిన మూడు పార్టీలను అర్థం చేసుకుని ఆదరించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రానికి ఇకపై అన్నీ మంచి రోజులేనన్నారు. చంద్రబాబు పార్టీ కార్యాలయం నుంచి ఇంటికి వెళ్లే సమయంలో సీఎం, సీఎం అంటూ పార్టీ శ్రేణులు నినాదించారు.
గెలుపు ఖాయం - టీడీపీ శ్రేణుల్లో వెల్లివిరుస్తున్న ఆనందోత్సాహాలు - tdp confidence on victory