Chandrababu Launched TDP Donation Website: తెలుగుదేశం పార్టీ విరాళాల వెబ్‌సైట్‌ను అధినేత చంద్రబాబు ఎన్టీఆర్ భవన్లో లాంఛనంగా ప్రారంభించారు. https://tdpforandhra.com వెబ్‌సైట్‌ని ఈ మేరకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ వెబ్‌సైట్ ద్వారా తెలుగుదేశం పార్టీకి మద్దతుదారులు విరాళాలు ఇవ్వాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. పార్టీకి ప్రకటించిన అభ్యర్ధులకు సంబంధించి ఎక్కడైనా ఒకట్రెండు చోట్ల తప్పదనుకుంటే పరస్పర అంగీకరంతో మార్పు ఉండొచ్చని తెలిపారు. పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరుల దగ్గర్నుంచే తాము విరాళాలు సేకరిస్తుంటే, వైసీపీ గ్యాంబ్లర్ల నుంచి విరాళాలు సేకరిస్తోందని మండిపడ్డారు. ఆన్లైన్ గ్యాంబ్లింగ్‌కు అనుమతించే దిశగా వైసీపీ చర్యలున్నాయని ఆరోపించారు.
ఎన్ఆర్ఐలు పార్టీకి విరాళాలు ఇవ్వటంతో పాటు, ఏపీకి వచ్చి పార్టీ కోసం, రాష్ట్రం కోసం పని చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. 10 రూపాయలు మొదలుకుని ఎంత మొత్తంలోనైనా విరాళాలు ఇవ్వొచ్చని స్పష్టంచేశారు. ప్రజల్లో తెలుగుదేశం ఓ భాగమని వెల్లడించారు. ఎలక్ట్రోరల్ బాండ్లు ఉండొచ్చు కానీ పారదర్శకంగా ఉండాలని చంద్రబాబు కోరారు. ఏదైనా డిజిటల్ పేమెంట్ల ద్వారా చట్టబద్దంగా చేయొచ్చని అన్నారు. డిజిటల్ చెల్లింపుల విధానం అందుబాటులోకి వస్తే రాజకీయ అవినీతి తగ్గుతుందని అభిప్రాయపడ్డారు.
దేశం సరైన దిశలో వెళ్తోంటే, ఏపీ రివర్సులో వెళ్తోందని ధ్వజమెత్తారు. జనంలో ఇప్పటి వరకు చూడని అసహనం కన్పిస్తోందన్నారు. వైసీపీ ప్రభుత్వం రంగులు కొట్టడానికి ఇచ్చిన ప్రాధాన్యత, నాణ్యమైన విద్యకు ఇవ్వలేదని దుయ్యబట్టారు. సోలార్ లాంటి వ్యవస్థలు అందుబాటులోకి వచ్చినా విద్యుత్ కోతలు ఉన్నాయని మండిపడ్డారు. రాష్ట్రాన్ని ఇంత దారుణంగా చేసిన వైసీపీకి ఒక్క సీటు కూడా రాకూడదని పిలుపునిచ్చారు.