Chandrababu Sensational Allegations on CM Jagan :వైఎస్సార్సీపీ నరక పాలన నుంచి విముక్తి పొందడానికి తిరగబడతారో లేక బానిసలుగా మిగిలిపోతారో ప్రజలే తేల్చుకోవాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఎన్నికలకు మరో 54 రోజులే సమయం ఉన్నందున తాను, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తమ బాధ్యతగా పోరాడతామనీ రాష్ట్ర భవిష్యత్తు ఆకాంక్షించే ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు. ప్రజల జీవితాలు చిన్నాభిన్నం చేసిన జగన్‌కు ఎన్నికల్లో సమాధానం చెప్పి తీరుతామని పవన్ కల్యాణ్ తేల్చి చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో జరిగిన విధ్వంసం పుస్తకావిష్కరణ సభలో చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్‌లు ఒకే వేదికను పంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై సీనియర్ జర్నలిస్టు ఆలపాటి సురేశ్ కుమార్ రాసిన 'విధ్వంసం' పుస్తకాన్ని చంద్రాబాబు ఆవిష్కరింంచి తొలి ప్రతిని పవన్ కల్యాణ్‌కు అందచేశారు.
వైఎస్సార్సీపీ పాలనలో రాష్ట్రంలో సభలు కూడా నిర్వహించే పరిస్థితి లేదని చంద్రబాబు ధ్వజమెత్తారు. పవన్ కల్యాణ్ భీమవరం వెళ్తానంటే హెలికాప్టర్‌కు అనుమతి ఇవ్వలేదని తాను పర్చూరులో సభ పెట్టుకుంటే అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో జరిగిన విధ్వంసం సహా మొత్తం 185 అంశాల వివరాలతో ఈ పుస్తకాన్ని రూపొందించారు. ఐదేళ్ల నరకంపై రాసిన 'విధ్వంసం' పుస్తకంపై వచ్చే 54 రోజులూ ఇంటింటా చర్చ జరిగి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు. 2 లక్షల కోట్ల ఆదాయాన్నిచ్చే ప్రజా రాజధాని అమరావతిని విధ్వంసం చేసి ఇప్పుడు నాలుగో రాజధాని హైదరాబాద్ అంటున్న వైఎస్సార్సీపీ నేతలు కొత్త నాటకానికి తెరలేపారన్నారు. జగన్ చొక్క మడతపెట్టి యుద్ధానికి సిద్ధమంటూ సవాల్ విసురుతున్నారని జనం ఆయన కుర్చీ మడతపెట్టడానికి సిద్ధంగా ఉన్నారని ఎద్దేవా చేశారు.
దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఏపీలో మీడియాపై ఆంక్షలు: చంద్రబాబు