Chandrababu Fires on CM Jagan :పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లిలో నిర్వహించిన రా కదలిరా సభలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. సభకు పల్నాడు ప్రాంతం నుంచి జనం పోటెత్తారు. జనప్రభంజనంతో సభాప్రాంగణం కిక్కిరిసిపోయింది. రా కదలిరా సభలో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు (Lavu Sri Krishna Devarayalu) టీడీపీలో చేరారు. ఆయనకు చంద్రబాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రజలని చూసి రెట్టించిన ఉత్సాహంతో మాట్లాడిన చంద్రబాబు, అధికార పార్టీ దౌర్జన్యాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని కాపాడుకొనేందుకు ప్రజలంతా సిద్ధం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. టీడీపీ, జనసేన పార్టీల్లో కోవర్టులను పెట్టారని, పవన్ తన ఆలోచనలు ఒక్కటే అని విభేదాలు సృష్టించలేరని చంద్రబాబు స్పష్టం చేశారు.
వైసీపీ నేతలను వదిలేది లేదు :పల్నాడులో చెలరేగిపోతున్న నరహంతక ముఠాని తుదముట్టిస్తానని, తెలుగుదేశం అధినేత చంద్రబాబు శపథం చేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన అనేక మందిని అధికార పార్టీ మూకలు దాడులు చేసి చంపేశారని చంద్రబాబుఆవేదన వ్యక్తం చేశారు. మరో 40 రోజుల్లో వైసీపీ ఇంటికి పోవడం ఖాయమని తేల్చి చెప్పారు. పోలీసుల అండతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన వైసీపీ నేతలను వదిలేది లేదని స్పష్టం చేశారు.
'సేవ్ ఆంధ్రప్రదేశ్- క్విట్ జగన్'! 'ఓడిపోవడానికే సిద్ధం అంటున్నారు': చంద్రబాబు
పల్నాడు సమగ్రాభివృద్ధి కోసం కృషి చేస్తా :దళిత ఎమ్మెల్యేలను ఇష్టారీతిన మారుస్తున్న జగన్ మాచర్లలో ఆటవిక రాజ్యాన్ని సాగిస్తున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మార్చే దమ్ముందా అని సవాల్ విసిరారు. వైఎస్సార్సీపీ మునిగిపోయే పార్టీ అన్న చంద్రబాబు, తెలుగుదేశం - జనసేన అధికారంలోకి రాగానే పల్నాడు సమగ్రాభివృద్ధి కోసం కృషి చేస్తామని చెప్పారు.