Chadalavada Kranti Save Snakes in Eluru district :ఒక్కొక్కరికీ ఒక్కో వ్యాపకం ఉంటుంది. అందుకోసం ఏం చేయడానికైనా వెనుకాడరు కొందరు. ఏలూరి జిల్లాకు చెందిన క్రాంతి అనే యువకుడూ అంతే. తాను నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాలు పణంగా పెట్టి పాముల మనుగడ కోసం పోరాడుతున్నాడు. ఆర్థికంగా ఎలాంటి భరోసా లేకపోయినా 13 ఏళ్లుగా ఇదే వృత్తిలో కొనసాగుతున్నాడు. స్నేక్ సేవియర్ సొసైటీ ద్వారా వేలాది పాములను సురక్షితంగా అడవుల్లో విడిచిపెట్టాడు.
పాములు పట్టడంలో ప్రత్యేక శిక్షణ : చదలవాడ క్రాంతి స్వస్థలం ఏలూరు జిల్లాలోని జంగారెడ్డిగూడెం. తమ ప్రాంతంలో తరచూ రైతులు పాముకాటుకు గురవటం ఆ భయంతో స్థానికులు అకారణంగా పాములను కొట్టి చంపటం చూసి చలించిపోయాడు. దీనికి ఏదైనా పరిష్కారం ిశగా ఆలోచించాడు. డిగ్రీ తర్వాత పైచదువులకు స్వస్తి చెప్పేసి కేరళ వెళ్లి పాములు పట్టడంలో ప్రత్యేక శిక్షణ పొందాడు. శిక్షణ తర్వాత విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాల్లో దాదాపు ఏడేళ్ల పాటు పనిచేశాడు క్రాంతి. జనావాసాల్లోకి వచ్చిన ఎలాంటి విషపూరిత సర్పాన్ని అయినా చాకచక్యంగా పట్టేయగలడనే పేరు తెచ్చుకున్నాడు. పాముల సంరక్షణ వాటివల్ల మనుషులకూ ఎలాంటి హాని జరగకుండా చూడాలనే లక్ష్యంతో 2016లో స్నేక్ సేవియర్ సొసైటీని స్థాపించాడు.
లాభాపేక్ష లేకుండా ఉచితంగా సేవలు : సొసైటీ హెల్ప్‌లైన్ నంబర్‌కు ఏ సమయంలో ఫోన్ చేసినా స్పందిస్తూ ఇప్పటివరకూ 19వేలకు పైగా పాములను సంరక్షించాడు క్రాంతి. తెలుగురాష్ట్రాల్లో 50వేలకు పైగా అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాడు. లాభాపేక్ష లేకుండా ఉచితంగా సేవలు అందిస్తూ జీవవైవిధ్యాన్ని కాపాడటంలో తనవంతు పాత్ర పోషిస్తున్నాడు ఈ స్నేక్ క్యాచర్. ఎవరి నుంచి డబ్బు ఆశించకుండా 13 ఏళ్లుగా ప్రాణాలకు తెగించి స్నేక్ క్యాచర్‌గా పనిచేస్తున్నాడు క్రాంతి. కుటుంబపోషణకు ఇబ్బందులు ఎదురవుతున్నా స్నేక్ సేవియర్ సొసైటీ ద్వారా సేవలు అందిస్తూనే ఉన్నాడు. ప్రభుత్వం తమ సొసైటీకి తగినన్ని నిధులిచ్చి సహకరిస్తే ఎవరూ పాముకాటుకు బలైపోకుండా కాపాడేందుకు ప్రయత్నిస్తానని అంటున్నాడు.