TS CEO Vikas Raj Video Conference :పోలింగ్‌కు సమయం దగ్గర పడుతున్న వేళ మరింత అప్రమత్తంగా ఉండాలని, ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా తగిన పర్యవేక్షణ చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ అధికారులను ఆదేశించారు. జిల్లా ఎన్నికల అధికారులు, ఆర్వోలతో దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో, కంటోన్మెంట్ ఉపఎన్నిక పోలింగ్ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు.
జిల్లా కలెక్టర్లకు కీలక సూచనలు :106 శాసనసభ నియోజకవర్గాల్లో రేపు సాయంత్రం 6 గంటలతో ప్రచారం ముగియనుంది. మిగిలిన 13 అసెంబ్లీ నియోజకవర్గాలైన సిర్పూర్, ఆసిఫాబాద్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, భద్రాచలం, కొత్తగూడెం, అశ్వారావుపేటలో రేపు సాయంత్రం 4 గంటలకు ప్రచారం ముగియనుంది. చివరి దశలో తీసుకోవాల్సిన చర్యలపై పోలీసు అధికారులు, పరిశీలకులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్లను వికాస్‌రాజ్ ఆదేశించారు.
ప్రలోభాలకు తావు లేకుండా :ప్రలోభాలకు ఆస్కారం ఉండే బస్తీలు, తదితర ప్రాంతాల్లో రాత్రి పూట ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని, కమ్యూనిటీ హాళ్లు, మ్యారేజీ హాళ్లపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని తెలిపారు. ఫ్లయింగ్ స్క్వాడ్స్, స్టాటిక్ సర్వైలైన్స్ టీమ్స్, పూర్తి అప్రమత్తంగా ఉండాలని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, క్లిష్టమైన ప్రాంతాల్లో వెబ్‌కాస్టింగ్ కోసం ఏర్పాట్లు చేయాలని వికాస్‌రాజ్ స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాలను పక్కాగా పర్యవేక్షించాలని జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు.
Measures To prevent The Spread Of Misinformation :తప్పుడు సమాచారం వెళ్లకుండా సందేహాలు నివృత్తి చేయాలని చెప్పారు. మద్యం, లైసైన్స్‌లు లేని ఆయుధాలు, నగదు, డ్రగ్స్ తదితరాల అక్రమ రవాణాకు ఆస్కారం లేకుండా చెక్ పోస్టుల వద్ద పటిష్ట తనిఖీలు చేపట్టాలని వికాస్‌రాజ్ తెలిపారు. డబ్బు, మద్యం, కానుకల పంపిణీ విషయమై నిఘా మరింత పటిష్టం చేయాలని ఆదేశించారు. పోలింగ్ రోజు ఈవీఎంలకు సంబంధించి ఎలాంటి సమస్యలు తలెత్తినా వెంటనే స్పందించేలా ఈసీఐఎల్ ఇంజినీర్లను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు.