Central Team AP Tour 2024 :ఏపీలో భారీ వర్షాలు, వరదల కారణంగా ఊహించని విపత్తు అపార నష్టాన్ని, కష్టాన్ని కలిగించిందని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజలను ఆదుకునేందుకు ఉదారత చూపాలని ఆయన కేంద్ర బృందాన్ని కోరారు. వరద నష్టాలపై అంచనాల కోసం ఏర్పాటైన కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటించింది. అనంతరం సచివాలయంలో సీఎంతో సమావేశమైంది.
జాతీయ విపత్తుగా ప్రకటించాలి : వరద నష్టంపై చేపడుతున్న ఎన్యూమరేషన్ గురించి కేంద్ర బృదం చంద్రబాబుకు వివరించింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో వచ్చిన ఈ విపత్తును సాధారణ విపత్తులా, గతంలో వచ్చిన వరదల్లా చూడవద్దని వారికి చంద్రబాబు తెలిపారు. రికార్డు స్థాయి వర్షాలు, ఆకస్మిక వరదలు ప్రజల జీవితాలను అతలాకుతలం చేశాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఉదారంగా ఆదుకునే విధంగా చూడాలని ఆయన కోరారు. రాష్ట్రంలో వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలన్నారు. పంట నష్టంతో పాటు భారీగా ఆస్తి నష్టం జరిగిందనే విషయాన్ని కేంద్ర బృందానికి చంద్రబాబు తెలియజేశారు.
రెండు రోజుల పాటు కేంద్ర బృందాలు ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల జల్లాల్లో పర్యటించారు. ఈ క్రమంలోనే గురువారం గుంటూరు జిల్లా వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. తొలుత కలెక్టరేట్‌లో పంట నష్టంపై ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను వారు తిలకించారు. వరదకు దెబ్బతిన్న పంట వివరాలను కలెక్టర్ నాగలక్ష్మి కేంద్ర బృందానికి వివరించారు. అనంతరం వ్యవసాయ, రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
అనంతరం వరద తాకిడికి నీట మునిగిన పెదకాకాని, వెంకటకృష్ణాపురం, దేవరాయబోట్లపాలెం గ్రామాల్లో పొలాలను కేంద్ర బృందం సభ్యులు స్వయంగా పరిశీలించారు. కాలువలకు గండి పడటానికి గల కారణాలను అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత మంగళగిరిలో భారీ వర్షానికి నీట మునిగిన చేనేత మగ్గాలను పరిశీలించి అక్కడి కార్మికులతో వారు మాట్లాడారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి పరిహారం ఆశిస్తున్నారని బాధితులను అడిగి తెలుసుకున్నారు. వారి నుంచి వినతులు స్వీకరించారు. అక్కడి నుంచి తాడేపల్లిలోని మహానాడు ప్రాంతాన్ని వెళ్లిన బృందానికి కృష్ణానది వరదతో సుమారు 800 ఇళ్లు నీట మునిగాయని అధికారులు తెలియజేశారు.
Central Team Visit NTR District : అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజవర్గం కొండపల్లిలో కేంద్ర బృందం పర్యటించింది. గతంలో ఎన్నడూ లేనతంగా కృష్ణానదికి వరద వచ్చిందని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వారికి తెలిపారు. ముఖ్యంగా బుడమేరు వరదల వల్ల నియోజవర్గానికి అపార నష్టం కలిగిందని తెలియజేశారు. పంటలు, రోడ్లు, విద్యుత్, ఇరిగేషన్ వ్యవస్థలు దారుణంగా దెబ్బతిన్నాయని, నష్టం మదింపు ప్రక్రియ కొనసాగుతుందని కేంద్ర బృందానికి ఎమ్మెల్యే వివరించారు.
ఆపరేషన్ బుడమేరు :మరోవైపు బుడమేరు డైవర్షన్ కెనాల్‌ను కేంద్ర బృందం క్షేత్ర స్థాయిలో పరిశీలించింది. గట్టు బలోపేత పనులకు తీసుకున్న చర్యల గురించి వారికి మంత్రి నిమ్మల రామానాయుడు వివరించారు. బుడమేరుకు పడిన గండ్లు, జరిగిన నష్టాన్ని కేంద్ర బృందానికి ఆయన తెలియజేశారు. భవిష్యత్‌లో వరద, పట్టిసీమ నీళ్లు వెళ్లేలా, సీపేజ్ను అరికట్టేలా బండ్‌ను బలోపేతం చేస్తున్నామని రామానాయుడు తెలిపారు. రాబోయే రోజుల్లో రిటైనింగ్ వాల్ కట్టి 35,000ల క్యూసెక్కుల నీరు వెళ్లేలా గట్లను బలపేతం చేస్తామన్నారు. ఆపరేషన్ బుడమేరు చేపట్టి బెజవాడ దుఃఖదాయని అనే పేరు లేకండా చేస్తామని స్పష్టం చేశారు.
ప్రకాశం బ్యారేజీని పరిశీలించిన కేంద్ర బృందం :అంతకుముందు కేంద్ర బృందం ప్రకాశం బ్యారేజీని సందర్శించింది. బ్యారేజీకి వచ్చిన నీటి ప్రవాహ వివరాలను జలవనరుల శాఖ ఈఎన్సీ వెంకటేశ్వరరావు వారికి తెలియజేశారు. ఈ నెల 1న రికార్డుస్థాయిలో 11.43 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందని చెప్పారు. ఇరిగేటెడ్ కమాండ్ ఏరియా మ్యాప్ ద్వారా కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లోని పరిస్థితిని వివరించారు. బ్యారేజీ ఎగువ, దిగువన కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ముంపునకు గురైన ప్రాంతాల్లో భారీ నష్టం వాటిల్లిందని చెప్పారు.
వరద ప్రవాహంతో దిగువకు కొట్టుకువచ్చిన పడవలను కేంద్ర బృందానికి చూపించారు. ప్రకాశం బ్యారేజీని బోట్లు బలంగా ఢీకొట్టడంతో జరిగిన నష్టాన్ని నివేదించారు. కృష్ణా, గుంటూరు జిల్లాలోని రైతులకు జరిగిన అపార నష్టాన్ని వివరించి ఆదుకోవాలని రైతుసంఘాల నేతలు కేంద్ర బృందాన్ని కోరారు.
వరద ముంపు ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన - ఆర్థిక సాయంపై కేంద్రానికి నివేదిక - Central Team Visit in Flood Areas