తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలంగాణలో 389 కి.మీ. రైలు మార్గంలో 'కవచ్' - ఎక్కువ దూరం ఆమార్గంలోనే!

రాష్ట్రంలో 389 కి.మీ. రైలు మార్గంలో కవచ్ - రైళ్లు నిరీక్షించకుండా ఆటోమేటిక్‌ బ్లాక్‌ సిగ్నలింగ్‌ - 18 నెలల్లో పూర్తి చేయాలని రైల్వేశాఖ యోచన

KAVACH WORKS IN INDIA RAIL TRACKS
Kavach System Works in Telangana (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 13, 2024, 10:11 AM IST

Kavach System Works in Telangana : రాష్ట్రంలో ఉత్తరాదిని దక్షిణాదితో అనుసంధానం చేసే కీలక రైల్వే మార్గాలు ఉన్నాయి. ఈ మార్గంలో రైల్వే ప్రమాదాలను నివారించడానికి కవచ్​ వ్యవస్థను రైల్వే శాఖ ఏర్పాటు చేయనుంది. దీంతో పాటు స్టేషన్ల మధ్య రైళ్లు నిరీక్షించకుండా ఆటోమేటిక్‌ బ్లాక్‌ సిగ్నలింగ్‌ విధానం కూడా అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో రాష్టంలో 389 కి.మీ. మేర రైలు మార్గంలో కవచ్​, ఆటోమేటిక్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థ ఏర్పాటుకు దక్షిణ మధ్య రైల్వే శ్రీకారం చుట్టింది. ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు ఎదురెదురుగా రావడం, ఆగి ఉన్న రైలును వెనుక నుంచి మరో రైలు ఢీకొనడంతో గత రెండు, మూడేళ్లలో దేశంలో పలుచోట్ల ప్రమాదాలు జరిగిన విషయాలు తెలిసిందే.

ఈ తరహాలో ప్రమాదాలు జరగకుండా వాటిని నివారణకు కవచ్​ దోహదం చేస్తుంది. ఈ మేరకు బల్లార్షా-కాజీపేట- విజయవాడ వరకు 514 కి.మీ కవచ్‌ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు. ఈ దూరంలో రాష్ట్ర పరిధి 378 కి.మీ. ఉంది. మరోవైపు, వాడి-గుంతకల్లు- రేణిగుంట వరకు 537 కి.మీ. కవచ్‌ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు. ఇందులోనూ రాష్ట్రంలో 11 కి.మీ మార్గం ఉంది. హైదరాబాద్‌ నుంచి దిల్లీ వెళ్లే రాజధాని, తెలంగాణ, దక్షిణ్‌ ఎక్స్‌ప్రెస్‌ వంటి రైళ్లు కాజీపేట-బల్లార్షా మార్గంలో ప్రయాణిస్తాయి. సికింద్రాబాద్‌-విశాఖపట్నం వందేభారత్‌తో పాటు ఈస్ట్‌కోస్ట్, గరీబ్‌రథ్, గోదావరి, చార్మినార్, సింహపురి, శాతవాహన, పద్మావతి, గౌతమి, గోల్కొండ, కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ వంటి రైళ్లు కాజీపేట-విజయవాడ మార్గంలో రాకపోకలు సాగిస్తాయి.

18 నెలల్లోనే పూర్తి చేయాలని : బల్లార్షా-కాజీపేట-విజయవాడ మార్గంలో కవచ్‌ ఏర్పాటు చేసి ఆ రూట్లో తిరిగే రైళ్ల ఇంజిన్లకు ప్రత్యేక పరికరాలు బిగిస్తారు. దీంతో ఒకే ట్రాక్‌పై జరిగే రైలు ప్రమాదాలను నివారించవచ్చు. కవచ్‌ వ్యవస్థ ఏర్పాటుకు ద.మ. రైల్వే టెండర్లు చేపట్టింది. ఈ నెల 15న బిడ్లను తెరిచి గుత్తేదారు సంస్థను ఎంపిక చేస్తారు. బల్లార్షా-కాజీపేట-విజయవాడ మార్గానికి సుమారు రూ.84.9 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. దీనిని 18 నెలల్లోనే ఏర్పాటు చేయాలని దక్షిణ మధ్య రైల్వే స్పష్టం చేసింది. ఈ ప్రకారం 2026 మే వరకు పూర్తయ్యేందుకు అవకాశం ఉంది. కవచ్‌తో పాటు ఆటోమేటిక్‌ బ్లాక్‌ సిగ్నలింగ్‌ 2026లోనే పూర్తయ్యే అవకాశం ఉంది.

తాజాగా సికింద్రాబాద్‌-రఘునాథ్‌పల్లి మధ్య 86 కి.మీ. మేర కవచ్‌ పనులు పూర్తయ్యాయి. రఘునాథ్‌పల్లి-కాజీపేట వరకు మరో 60 కి.మీ. మేర పురోగతిలో ఉన్నాయి. ఆటోమేటిక్‌ బ్లాక్‌ సిగ్నలింగ్‌తో ప్రయాణ సమయం కూడా తగ్గతుంది. ప్రస్తుతం ఒక ట్రైన్​ మొదటి స్టేషన్‌ దాటి రెండో స్టేషన్‌ను చేరుకుని, దాన్ని దాటేవరకు మరో రైలును పంపంచరు. ఫలితంగా అనేక రైళ్లు సిగ్నల్‌ కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి. ఆటోమేటిక్‌ బ్లాక్‌ సిగ్నలింగ్‌ విధానంలో అయితే రెండు రైల్వేస్టేషన్‌ మధ్య దూరాన్ని బ్లాక్‌లుగా విభజించి మొదటి ట్రైన్​ ఒక బ్లాక్​ దాటగానే వెనక రెండో రైలు బయల్దేరేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ వస్తుంది. తెలంగాణలో ఇప్పటికే సనత్‌నగర్‌-వికారాబాద్‌- కుర్‌గుంట, వికారాబాద్‌-మటల్‌కుంట మార్గాల్లో కవచ్‌ వ్యవస్థ ఉంది.

కవచ్‌ పనిచేస్తుందిలా :అత్యున్నత భద్రతా ప్రమాణాలతో కవచ్‌ వ్యవస్థ పనిచేస్తుంది. రైలును లోకోపైలట్​ ఏ కారణంతోనైనా బ్రేకులు వేయడం మరిచిపోయినా కవచ్​ ఆటోమేటిక్‌ ట్రైన్‌ ప్రొటెక్షన్‌ (ఏటీపీ) సిస్టమ్‌ పనిచేస్తుంది. దీని ద్వారా ఆటోమేటిగ్గా బ్రేక్‌లు పడతాయి. అందుకు రైలు పట్టాల పొడవునా ఆర్‌ఎఫ్‌ఐడీ (రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌) ట్యాగ్‌ ఏర్పాటు చేస్తారు. ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ వేసి, టెలికాం టవర్లు, డేటా సెంటర్లు ఏర్పాటు చేసి సిగ్నల్‌ వ్యవస్థతో అనుసంధానం చేస్తారు. ఇంజిన్లకూ పరికరాల్ని బిగిస్తారు.

"అన్ని రైళ్లలో 'కవచ్​ వ్యవస్థ' ఏర్పాటు చేస్తాం" - అశ్వినీ వైష్ణవ్​

ABOUT THE AUTHOR

...view details