Green Crab Hatchery in Konaseema : మాంసాహార ప్రియులు పీతల కూరంటే చెవి కోసుకుంటారు. సముద్రాలు, నదీ తీర ప్రాంతాల్లో లభించే పీతల రుచికి దాసోహం అనాల్సిందే. చేపలు, రొయ్యల మాదిరిగానే పీతల పెంపకమూ కొన్నాళ్లుగా నడుస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో వీటికి ఉన్న గిరాకీ అన్నదాతలను ఈ సాగు దిశగా ప్రోత్సహిస్తోంది. అయితే పీతల సాగులో ఉన్న ఇబ్బందులను తొలగించి, ఎగుమతిని ప్రోత్సహించేలా ఏపీ సర్కార్ చేస్తున్న కృషి ఫలితాలనిస్తోంది.
విదేశాల్లో ఎక్కువగా పచ్చ పీతలను వినియోగిస్తారు. ఈ క్రమంలోనే పచ్చ పీతల హేచరీని డా. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం చిరయానం వద్ద 5 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నారు. సాగుకు అవసరమైన వాతావరణ పరిస్థితులు ఇక్కడ అనుకూలంగా ఉన్నాయి. దీంతో కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని గ్రీన్ క్లైమేట్ ఫండ్ (జీసీఎఫ్) నుంచి రూ.2.75 కోట్లు మంజూరు చేసింది. కోస్టల్ ఆక్వా కల్చర్ అథారిటీ (సీఏఏ) అనుమతుల కోసం ప్రతిపాదనలు పంపించింది. దేశంలో ఇప్పటి వరకు ఇటువంటి హేచరీ చెన్నైలో (రాజీవ్‌గాంధీ ఆక్వా సెంటర్ ఫర్ ఆక్వా కల్చర్) మాత్రమే ఉంది. ఏడాదికి 10 లక్షల పిల్ల పీతల ఉత్పత్తి లక్ష్యం. తద్వారా ఇతర జిల్లాల అన్నదాలకూ సరఫరా చేసి ఎగుమతులతో విదేశీ మారకద్రవ్యం పెంచుకునే వీలుంది.
సీడ్ కావాలంటే 1300 కిలోమీటర్లు :కోనసీమ జిల్లాలోని తాళ్లరేవు, ఐ.పోలవరం, కాట్రేనికోన, ఉప్పలగుప్తం మండలాల పరిధిలోని సముద్రతీరం, మడ అడవులు పీతల సాగుకు అనుకూలం. గతంలో పల్లం, భైరవపాలెం, చిర్రయానాం, గచ్చికాయలపొర, చినబొడ్డు వెంకటాయపాలెం, పెదబొడ్డు వెంకటాయపాలెం, గాడిమొగ ప్రాంతాల్లోని 3 వేల ఎకరాల్లో సాగు ఉండేది. ప్రస్తుతం ఉప్పలగుప్తం, కాట్రేనికోన మండలాల పరిధిలో 100 ఎకరాల్లో 273 మంది సాగు చేస్తున్నారు. సీడ్ కావాలంటే రైతులంతా 1300 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెన్నై వెళ్లి ఒక్కో పీత పిల్లకు రూ.12, రవాణాకు రూ.3 వెచ్చించి తెచ్చుకుంటున్నారు. వాహన అద్దెకు సుమారు రూ.60 వేల వ్యయమవుతుండడం, రవాణాలో దాదాపు 50 శాతం చనిపోతుండటంతో క్రమేపీ సాగుకు చాలా మంది దూరమయ్యారు. పీతల హేచరీ వస్తే గరిష్ఠంగా 5 కిలోమీటర్ల దూరంలోనే వీరికి సీడ్ లభిస్తుంది.
విదేశాల్లో ఎంతో గిరాకీ : ఔషధ గుణాలున్న ఈ పీతలకు జపాన్, సింగపూర్, చైనా, ఇండోనేషియా, వియత్నాం, మలేసియా తదితర దేశాల్లో మంచి గిరాకీ ఉంది. సాగు పూర్తయిన తరువాత పీతలను సాయంత్రం 6 గంటలకు రాజమహేంద్రవరం నుంచి రైలులో చెన్నై తీసుకెళ్తారు. మర్నాడు సాయంత్రం ఎయిర్‌కార్గోలో విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు.