Hyderabad RRR Tenders :తెలంగాణలోని ప్రాంతీయ వలయ రహదారి (రీజినల్ రింగ్ రోడ్డు- ఆర్‌ఆర్‌ఆర్) ఉత్తర భాగం పనులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఈ పనులను ఐదు ప్యాకేజీల్లో చేపట్టాలని నిర్ణయించి తాజాగా టెండర్లను ఆహ్వానించింది. గ్రీన్‌ఫీల్డ్ రీజినల్ ఎక్స్‌ప్రెస్‌వేగా వ్యవహరించే ఈ రోడ్డును నాలుగు వరుసలుగా నిర్మించనున్నారు. దీనిని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) నిర్మించనుంది.
ఉత్తర భాగం పనులను సంగారెడ్డి జిల్లాలోని గిర్మాపూర్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాలోని తంగడ్‌పల్లి వరకు చేపట్టనున్నారు. మొత్తం 161.518 కిలోమీటర్లు. మొత్తం వ్యయం అంచనాను రూ. 7104.06 కోట్లుగా నిర్ధారించారు. టెండర్లు పొందిన సంస్థలు ఈ పనులను మొత్తం రెండు సంవత్సరాల్లో పూర్తి చేయాలి. ఐదు సంవత్సరాల పాటు రహదారి నిర్వహణ బాధ్యత కూడా ఆయా సంస్థలదే. ఈ పనులను ఈపీసీ (ఇంజినీరింగ్ ప్రొక్యూర్‌మెంట్ కన్‌స్ట్రక్షన్) పద్ధతిలో చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
గత నెలలోనే ఉత్తరభాగానికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను ఎన్‌హెచ్‌ఏఐకి కన్సల్టెన్సీ సంస్థ అందించింది. అందులో పేర్కొన్న సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకొని ఎన్‌హెచ్‌ఏఐ టెండర్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2025 ఫిబ్రవరి 14 వరకు బిడ్‌లను దాఖలు చేయవచ్చు. ఫిబ్రవరి 17న వాటిని తెరుస్తారు. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ)కు సంబంధించిన వెబ్‌సైట్‌లో టెండర్ దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. ఆర్థిక, సాంకేతిక విభాగాల్లో ఈ బిడ్‌లను దాఖలు చేయాల్సి ఉంటుంది.
ఉత్తరభాగం ప్రత్యేకతలు (డీపీఆర్ ప్రకారం)
- రహదారి నిర్మాణంలో ఇంజినీరింగ్ పనులు, సామగ్రి సేకరణ, వ్యయం, నిర్మాణం అన్నీ గుత్తేదారు సంస్థే చూసుకోవాలి.
- ఈపీసీ విధానంలో పనులకు ప్రభుత్వం కొంత గ్రాంట్ల రూపంలో నిధులు ఇచ్చే అవకాశం ఉంది.
- నిర్మాణానికి వెచ్చించిన నిధులు 17 సంవత్సరాల్లోనే టోల్ వసూలు రూపంలో తిరిగి వచ్చే అవకాశాలున్నాయి.
- ఈ రోడ్డు నిర్మాణానికి మొత్తం 1940 హెక్టార్ల భూమి అవసరం. ఇప్పటికే 94 శాతం భూసేకరణ పూర్తయ్యింది.
- గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వాహనాలు ప్రయాణించేలా ఈ రోడ్డును నిర్మించనున్నారు.
- మొత్తం రహదారి విస్తీర్ణంలో 11 ఇంటర్ ఛేంజ్‌లు ఉంటాయి. ఆరు చోట్ల రెస్ట్ రూంలు ఏర్పాటు చేస్తారు.
- 187 అండర్‌పాస్‌లు, నాలుగు ఆర్వోబీలు, 26 పెద్ద వంతెనలు, 81 చిన్న వంతెనలు, 400 వరకు కల్వర్టులను నిర్మించాల్సి ఉంటుంది.