PM Surya Ghar Solar Power Plant Scheme : కరెంటు బిల్లు నెలకు వెయ్యి రూపాయలు దాటుతోందా ? భవిష్యత్తులో కూడా కరెంట్ బిల్లు ఛార్జీల భారం మరింతగా పెరుగుతుందని అనుకుంటున్నారా ? అయితే మీ సొంత ఇంటిపైకప్పుపై సోలార్ ప్లాంట్లు పెట్టి ఆ లబ్ధిదారులుగా మారండి. ప్రస్తుతం మీరు వాడుతున్న కరెంట్ కన్నా ఎక్కువగానే తయారు చేసి తిరిగి ట్రాన్స్‌కో డిస్కమ్‌కే అమ్మి సొమ్ము చేసుకోండి. ప్రస్తుతం ఇది కేంద్ర ప్రభుత్వం సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు చేస్తున్న ప్రచారం. ఈ నేపథ్యంలో కరెంటు బిల్లు ఎక్కువగా వచ్చే వినియోగదారులు సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు మొగ్గు చూపుతున్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో సుమారు 600కిపైగా ఇళ్లపై సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకున్నారు. హైదరాబాద్, వరంగల్ నగరాల్లో ఎక్కువ సంఖ్యలో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు కాగా ఇప్పుడిప్పుడే జిల్లా కేంద్రాలు, మున్సిపాలిటీల్లో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకు వస్తున్నారు. గతంలో సోలార్ ద్వారా తయారైన కరెంటును బ్యాటరీల్లో స్టోర్ చేసి రాత్రివేళ ఇంటి అవసరాలకు వాడుకునేవారు. కానీ ప్రస్తుతం బ్యాటరీలు లేకుండానే డీసీ కరెంట్‌ను ఏసీ కరెంట్‌గా మార్చే ఇన్వర్టర్‌ను బిగించి డైరెక్ట్‌గా గ్రిడ్‌కు అనుసంధానం చేస్తున్నారు.
ఆరునెలలకోసారి యూనిట్ల లెక్కింపు
లబ్ధిదారులు డిస్కమ్‌తో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం ప్రతి ఆరునెలలకోసారి ఇంట్లో ఏర్పాటు చేసిన నెట్‌మీటరు సాయంతో ఎన్ని యూనిట్ల కరెంట్ వాడిందని, ఇంకా ఎంత ఉందని లెక్క వేసి మనం ఖర్చు చేయగా మిగతా యూనిట్లకు లెక్క వేసి రూ.4.50 చొప్పున లెక్కించి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుందని ఓమ్ సోలార్ ఎనర్జీ సర్వీసెస్ ఎండీ గుండా వెంకటేశ్వర గుప్తా వెల్లడించారు.
పెట్టుబడి, రాయితీ వివరాలు
మూడు కిలోవాట్లు అంతకంటే ఎక్కువ కిలోవాట్ల ప్లాంటు ఏర్పాటు చేసుకుంటే సుమారు రూ.80 వేల నుంచి రూ. 2 లక్షల వరకూ ఖర్చవుతుంది. అదనంగా ఎన్ని కిలోవాట్లు ఏర్పాటు చేసుకుంటే అదే స్థాయిలో పెట్టుబడి కూడా పెరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం సూర్యఘర్ పథకం కింద ప్రతి కుటుంబానికి మూడు కిలోవాట్లు అంతకన్నా ఎక్కువ కిలోవాట్ల సోలార్‌ప్లాంటు ఏర్పాటు చేసుకున్నా రాయితీ కింద రూ.78 వేలు ఇస్తోంది. ఈ మొత్తం పెట్టుబడికి సైతం బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. గతంలో అయితే ఖాతాలో రాయితీ జమ కావడానికి కనీసం ఆరు నెలల సమయం తీసుకునేది. కానీ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నెల నుంచి రెండు నెలల్లోనే సూర్యఘర్ యోజన నుంచి రాయితీ సొమ్ము జమ అవుతోందని ఓ బ్యాంకు మేనేజర్ తెలిపారు.