Central Funds Released for AP Tourism :రాష్ట్ర పర్యాటకాన్ని కొత్త మలుపు తిప్పే అఖండ గోదావరి, గండికోట ప్రాజెక్టుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 172.34 కోట్ల రూపాయలు కేటాయించింది. పర్యాటక రంగ అభివృద్ధి కోసం మూల ధన పెట్టుబడికి ప్రత్యేక తోడ్పాటు-సాస్కి పథకం (Saski Scheme)లో భాగంగా ఈ నిధులు ఇస్తోంది. ఒక రాష్ట్రానికి 2 ప్రాజెక్టులు చొప్పున నిధులు మంజూరు చేసిన తొమ్మిది రాష్ట్రాల్లో ఏపీ కూడా ఉంది. తొలి విడతగా 113.75 కోట్లను కేంద్రం విడుదల చేసింది. వీటిలో 75 శాతం ఖర్చు చేసి వినియోగ ధ్రువీకరణ పత్రం ఇచ్చాక మిగిలిన నిధులు కేటాయించనుంది.
కేంద్రం పచ్చజెండా :సాస్కి పథకంలో కేంద్రం ఇచ్చే నిధుల కోసం దేశ వ్యాప్తంగా 28 రాష్ట్రాలు మొదట పోటీ పడ్డాయి. ఎనిమిది రాష్ట్రాలు మధ్యలోనే వెనక్కి వెళ్లాయి. మిగిలిన వాటిలో 11 రాష్ట్రాలకు ఒకటి చొప్పున, 9 రాష్ట్రాలకు 2 చొప్పున ప్రాజెక్టులకు కేంద్రం నిధులు కేటాయించింది. సాస్కి పథకం కోసం అఖండ గోదావరి, గండికోటతో పాటు సూర్యలంక బీచ్‌నూ ఎన్డీయే కూటమి ప్రభుత్వం ప్రతిపాదించింది. సూర్యలంక మినహా మిగిలిన వాటికి కేంద్రం పచ్చజెండా ఊపింది.
ఏపీలో పర్యాటకం పరుగులు - తొలివిడతగా రూ.113 కోట్లు మంజూరు చేసిన కేంద్రం
చారిత్రక ప్రదేశాలకు పూర్వ వైభవం :రాజమహేంద్రవరంలో 127 ఏళ్ల చరిత్ర కలిగిన హేవలాక్ వంతెన (Havelock Bridge) పునర్నిర్మాణంతో పాటు పుష్కర ఘాట్‌ను అభివృద్ధి చేస్తారు. ఈ రెండింటినీ అనుసంధానించి 'డైనమిక్ టూరిస్ట్ డెస్టినేషన్ (Dynamic Tourist Destination)'గా తీర్చిదిద్దుతారు. చారిత్రక, సాంస్కృతిక, వినోద కార్యక్రమాలకు ఇది వేదిక కానుంది. హేవలాక్ వంతెనను పునర్నిర్మించి ఆ ప్రాంతంలో గ్లాస్ వంతెనలు, జలపాతాలు, అక్వేరియం టన్నెల్‌లను అభివృద్ధి చేయనున్నారు. పుష్కర ఘాట్‌ను ఆధ్యాత్మిక గమ్యస్థానంగా మార్చనున్నారు. అలాగే చుట్టూ ఉన్న పలు ఆలయాలను అభివృద్ధి చేస్తారు. కడియం నర్సరీ, గోదావరి కాలువ వంటి సాంస్కృతిక, చారిత్రక ప్రదేశాలకు పూర్వ వైభవం తీసుకురానున్నారు.