ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హైదరాబాద్‌-బెంగళూరు మధ్య సరికొత్త హైస్పీడ్ హైవే - మూడు రాష్ట్రాలను కలుపుతూ కేంద్రం కీలక నిర్ణయం - hyderabad bengaluru new highway

Hyderabad Bengaluru New High Speed Highway: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలను కలుపుతూ కొత్త హైవే నిర్మాణానికి కేంద్ర నిర్ణయించింది. హైదరాబాద్‌-బెంగళూరు మధ్య కొత్త హైస్పీడ్‌, గ్రీన్​ఫీల్డ్ జాతీయ రహదారిని నిర్మించాలని ప్రతిపాదించారు. 508 కి.మీ. మేర ఆరు వరుసల్లో 120 కి.మీ. వేగంతో ప్రయాణాలు సాగేలా ప్రణాళికలు రచించారు.

Hyderabad Bengaluru New High Speed Highway
Hyderabad Bengaluru New High Speed Highway (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 27, 2024, 7:22 AM IST

Hyderabad Bengaluru New High Speed Highway: ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలను కలుపుతూ కొత్తగా జాతీయ రహదారి నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్‌ - బెంగళూరు మధ్య ప్రస్తుతం ఉన్న 4 వరుసల హైవేకు అదనంగా నూతన రహదారిని నిర్మించాలని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ నిర్ణయించింది. ‘మాస్టర్‌ ప్లాన్‌ ఫర్‌ నేషనల్‌ హైవేస్‌ విజన్‌-2047’లో ఈ రహదారిని నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించింది. భవిష్యత్తులో ట్రాఫిక్‌ అవసరాల కోసం ఈ జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది.

నాగ్‌పుర్‌ - హైదరాబాద్‌ - బెంగళూరు సిటీల మధ్య రాకపోకలను మరింతగా పెంచాలని కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల కిందట నిర్ణయించింది. ప్రయాణ సమయాన్ని మరింతగా తగ్గించే లక్ష్యంతో నూతన రహదారిని అందుబాటులోకి తీసుకురావాలని భావించింది. నాగ్‌పుర్‌ నుంచి బెంగళూరు వరకు జాతీయ రహదారి నిర్మాణానికి ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి చేశారు. హైదరాబాద్‌ నుంచి బెంగళూరునూ అనుసంధానించాలని నిర్ణయించారు. ఇందుకోసం డీపీఆర్‌ రూపొందించేందుకు కసరత్తు చేపట్టారు. డీపీఆర్‌ తయారీకి గుత్తేదారును ఎంపిక చేసేందుకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ టెండర్లు ఆహ్వానించింది. టెండర్ల దాఖలుకు ఈ ఏడాది సెప్టెంబరు 12వ తేదీ తుది గడువుగా నిర్ణయించారు.

గంటకు 120కిలో మీటర్ల వేగం-బ్రేక్‌ పై కాలు వేయకుండా చెన్నై బెంగళూరులకు రయ్‌..రయ్ - Bangalore Chennai Expressway

6 వరుసల్లో నిర్మించాలని ప్రతిపాదన: ట్రాఫిక్‌ రద్దీని దృష్టిలో పెట్టుకుని నూతన మార్గాన్ని 6 వరుసల్లో నిర్మించాలని ప్రతిపాదించారు. తొలుత 12 వరుసల రహదారి నిర్మాణం చేపట్టాలన్న ప్రతిపాదన వచ్చినప్పటికీ ఆరు వరుసలకే పరిమితమైనట్లు అధికారులు తెలిపారు. ఒకేసారి ఆరు వరుసలుగా నిర్మిస్తారా? తొలుత 4 వరుసలు నిర్మించి, తర్వాత మరో 2 వరుసలను విస్తరిస్తారా? అన్నది ప్రస్తుతానికి స్పష్టత లేదు. డీపీఆర్‌ ఆమోదం పొందిన తర్వాత కేంద్రం తుది నిర్ణయం తీసుకుంటుందని సమాచారం.

120 కిలో మీటర్ల వేగంతో రాకపోకలు: హైదరాబాద్‌ - బెంగళూరు నూతన మార్గాన్ని హైస్పీడ్, గ్రీన్‌ఫీల్డ్‌ జాతీయ రహదారిగా నిర్మించాలని నిర్ణయించారు. 120 కిలో మీటర్ల వేగంతో వాహనాలు రాకపోకలు సాగించేందుకు వీలుగా ప్రతిపాదించారు. తాత్కాలిక అంచనాల ప్రకారం 508.461 కిలోమీటర్ల మేర కారిడార్‌ను రూపొందించాలన్నది నిర్ణయం. 44వ నంబరు జాతీయ రహదారిగా హైదరాబాద్‌ నుంచి బెంగళూరు మధ్య 556 కిలోమీటర్ల నాలుగు వరుసల మార్గం అందుబాటులో ఉంది.

తెలంగాణలో 190, ఆంధ్రప్రదేశ్‌లో 260, కర్ణాటకలో 106 కిలో మీటర్ల వరకు ఈ జాతీయ రహదారి విస్తరించింది. ట్రాఫిక్‌ రద్దీ పెరుగుతున్నందున ప్రస్తుతం ఉన్న 4 వరుసల రహదారిని ఆరు వరుసలకు విస్తరించాలని తొలుత నిర్ణయించింది. అందుకోసం 2022లోనే డీపీఆర్‌ను సిద్ధం చేసింది. అయితే వివిధ కారణాలతో ఆ ప్రతిపాదన అటకెక్కింది. హైస్పీడ్‌ కారిడార్‌ను నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడంతో, ప్రస్తుత నేషనల్ హైవే తీరుతెన్నులను అధ్యయనం చేశారు. దీంతో హైస్పీడ్‌కు తగిన విధంగా ఆ రహదారిని విస్తరించడం సాధ్యం కాదని అధికారులు నిర్ణయానికి వచ్చారు. అందుకే హైస్పీడ్, గ్రీన్‌ఫీల్డ్‌ కారిడార్‌ను నిర్మించాలని నిర్ణయించి మంత్రిత్వ శాఖ మాస్టర్‌ప్లాన్‌లో ప్రతిపాదించింది.

పట్టాలెక్కుతున్న పురోగతి- ఎన్డీయే ప్రభుత్వంతో రహదారులకు మోక్షం - Widening of National Highway 44

ABOUT THE AUTHOR

...view details