తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏపీపై కేంద్రం వరాల పద్దు - ఇది కదా ఆనాడు చంద్రబాబు చెప్పిన సీక్రెట్ - SPECIAL FUNDS TO AP IN BUDGET 2024 - SPECIAL FUNDS TO AP IN BUDGET 2024

Special Funds To AP in Union Budget 2024 : ఏపీలో ఎన్డీఏ కూటమి భాగస్వామిగా ఉన్న చంద్రబాబు కేంద్రంలో చక్రం తిప్పారు. కేంద్ర నిధులు, సహకారంపై వ్యూహాత్మకంగా వ్యవహరించి అనుకున్నది సాధించారు. "రాష్ట్రానికి చాలా అవసరాలు ఉన్నాయ్ అందుకే మరోసారి దిల్లీకి వెళ్తున్నా పర్యటనకు సంబంధించి కొన్ని విషయాలు రహస్యంగా ఉంటేనే ప్రజలకు, రాష్ట్రానికి మేలు జరుగుతుంది" అని చెప్పడం విదితమే.

SPECIAL FUNDS TO AP
CENTRAL SPECIAL FUNDS TO AP Govt (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jul 23, 2024, 1:51 PM IST

Special Funds To AP Development in Union Budget :ఏపీ రాష్ట్రానికి చాలా అవసరాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రయోజనాలే నాకు ముఖ్యం అంటూ సీఎం హోదాలో రెండు సార్లు దిల్లీ వెళ్లిన చంద్రబాబు తాను అనుకున్నది సాధించారు. రాష్ట్రానికి రెండు కళ్ల లాంటి అమరావతి రాజధాని నిర్మాణంతో పాటు పోలవరం ప్రాజెక్టు పూర్తికి కేంద్రాన్ని ఒప్పించారు. వీటికి తోడు విభజన చట్టంలోని హామీలపైనా కేంద్రం స్పష్టత ఇచ్చింది. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించింది. పారిశ్రామిక అభివృద్ధికి తోడు నైపుణ్య గణన ఫలితంగా యువతకు ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి.

ఎన్డీఏ కూటమికి ఊహించని భారీ మెజార్టీతో విజయాన్నందించిన రాష్ట్రానికి కేంద్రం అదే స్థాయిలో వరాలు ప్రకటించింది. ఏపీ విభజన చట్టానికి అనుగుణంగా రాష్ట్ర జీవనాడి పోలవరం సత్వర నిర్మాణానికి సంపూర్ణ సాయం అందిస్తామని ప్రకటించింది. ఐదున్నర కోట్ల ప్రజల ఆకాంక్షలు ఫలించేలా రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్లు ప్రత్యేక సాయంతో పాటు అవసరాన్ని బట్టి భవిష్యత్తులో మరిన్ని అదనపు నిధులు సమకూరుస్తామని స్పష్టం చేసింది. కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్​ 2024 గణాంకాలు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి బాటలు వేసేలా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేక సహకారం అందిస్తామని ప్రకటించింది. విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌లోని నోడ్‌లకు ప్రత్యేక సాయం, హైదరాబాద్‌-బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌ అభివృద్ధికి ప్రత్యేక నిధులు, కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాలకు నీళ్లు, విద్యుత్‌, రోడ్లు, హైవేల అభివృద్ధికి నిధులు విశాఖ-చెన్నై కారిడార్‌లో కొప్పర్తికి, హైదరాబాద్‌-బెంగళూరు కారిడార్‌లో ఓర్వకల్లుకు నిధులు, ఏపీలోని వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ, రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు అందిస్తామని స్పష్టం చేసింది.

బడ్జెట్​ -2024 నేపథ్యంలో ముందస్తుగా రెండుసార్లు దిల్లీ పర్యటన చేపట్టిన చంద్రబాబు కేంద్ర పెద్దలను కలిశారు. ప్రధాని మోదీ సహా పలువురు కీలక మంత్రులను కలిసి రాష్ట్రానికి అందిచాల్సిన సహకారంపై ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. అమరావతికి నిధులు, పెండింగ్​ ప్రాజెక్టులు, రాష్ట్రంలో అత్యవసరంగా చేపట్టాల్సిన రోడ్లు, ఆర్థిక ప్రోత్సాహకాలు, పారిశ్రామిక రాయితీలు, వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రోత్సాహం, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్రంలో గ్రేహౌండ్స్ శిక్షణా కేంద్రం, ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్, వైజాగ్‌- చెన్నై, చెన్నై- బెంగళూరు పారిశ్రామిక వాడ, ఆక్వాపార్క్, కర్నూలు నుంచి వైజాగ్ వరకు హెచ్​వీడీసీ ఐస్​టీఎస్ లైన్ కోసం ఆమోద ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయా శాఖల మంత్రులను కలిసి విజ్ఞప్తి చేశారు.

పార్లమెంటరీ సమావేశంలో ఎంపీలతో మాట్లాడిన చంద్రబాబు.. కేంద్ర నిధులపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని వారికి సూచించారు. రాష్ట్ర మంత్రులతోనూ ఇదే విషయంలో పలు సూచనలు చేశారు. అధికారుల సమావేశాల్లోనూ కేంద్రం నుంచి రావల్సిన నిధులు, పరిశ్రమలు, పెట్టుబడులే లక్ష్యంగా నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇటీవల జరిగిన కేబినెట్​ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ "రాష్ట్రానికి చాలా అవసరాలు ఉన్నాయ్.. అందుకే మరోసారి దిల్లీకి వెళ్తున్నానని చెప్పారు. పర్యటనకు సంబంధించి కొన్ని విషయాలు రహస్యంగా ఉంటేనే ప్రజలకు, రాష్ట్రానికి మేలు జరుగుతుంది" అని వ్యాఖ్యానించారు. అన్ని విషయాలు బయటకు చెప్పలేనని మంత్రులు, ఎమ్మెల్యేలకు చంద్రబాబు స్పష్టం చేశారు.

కేంద్ర బడ్జెట్​లో తెలంగాణకు ఈసారీ గుండు సున్నాయే : కేటీఆర్

నేటి నుంచే రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు - ఆరుగ్యారంటీల అమలుపై నిలదీసేందుకు విపక్షాలు రెడీ - Telangana Assembly Sessions 2024

ABOUT THE AUTHOR

...view details