ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కేంద్ర ఎన్నికల సంఘం కొరడా - ప్రతిపక్షాల అణచివేత, నిబంధనల పాతరకు ఫలితం! - IAS And IPS Officers Transfers - IAS AND IPS OFFICERS TRANSFERS

Central Election Commission Transferred IAS and IPS Officers: అధికార వైఎస్సార్సీపీకు, సీఎం జగన్‌కు భజన చేస్తున్న అఖిల భారత సర్వీసు అధికారులను ఈసీ ఈడ్చికొట్టింది. వైఎస్సార్సీపీ నాయకులే చెప్పిందే చట్టంగా సాగిస్తున్న 9 మంది అధికారులపై బదిలీ వేటు వేసింది. ఎన్నికల కోడ్‌ని సైతం లెక్కచేయకుండా వైఎస్సార్సీపీకు వంతపాడుతున్న ముగ్గురు కలెక్టర్లు, అయిదుగురు ఎస్పీలతో పాటు ఐజీని బదిలీ చేసింది. ప్రతిపక్షాల ఫిర్యాదులు, సీఈవో నివేదికలతో వైఎస్సార్సీపీకు బంటుల్లా పని చేస్తున్న వారిని పక్కకు పెట్టింది. కొంత ఆలస్యంగానైనా సరే కేంద్ర ఎన్నికల సంఘం ఎట్టకేలకు వారిపై వేటు వేసింది.

Election_Commission_Transferred_IAS_and_IPS_Officer
Election_Commission_Transferred_IAS_and_IPS_Officer

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 3, 2024, 7:47 AM IST

జగన్‌ భక్త ఉన్నతాధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా - ప్రతిపక్షాల అణచివేత, నిబంధనల పాతరకు ఫలితం!

Central Election Commission Transferred IAS and IPS Officers : ప్రతిపక్షాలను అణచివేస్తూ, నిబంధనలకు పాతరేసి అధికార పార్టీ అరాచకాలకు కొమ్ము కాసినందుకు 9 మంది అఖిల భారత సర్వీసు అధికారులపై వేటు వేసింది. కృష్ణా, అనంతపురం, తిరుపతి జిల్లాల కలెక్టర్లు పి.రాజాబాబు, ఎం.గౌతమి, డా.లక్ష్మీశ, ప్రకాశం, పల్నాడు, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాల ఎస్పీలు పరమేశ్వర్‌రెడ్డి, వై.రవిశంకర్‌రెడ్డి, పల్లె జాషువా, కేకేఎన్‌ అన్బురాజన్, కె.తిరుమలేశ్వర్‌రెడ్డి, గుంటూరు ఐజీ జి.పాలరాజును బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చింది.

తిరుపతి జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ : జనవరి 31న తిరుపతి జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన లక్ష్మీశ కలెక్టర్‌గాకంటే అధికార వైఎస్సార్సీపీ కార్యకర్తగానే ఎక్కువగా పని చేశారు. కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన వెంటనే తితిదే ఛైర్మన్, తిరుపతి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఇంటికెళ్లి దర్శించుకున్నారు. శాలువా కప్పి సత్కరించారు. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల సమయంలో ఈఆర్వో లాగిన్‌ నుంచి 35 వేలకుపైగా ఎపిక్‌ కార్డులు అక్రమంగా డౌన్‌లోడ్‌ చేసి వాటితో పెద్దఎత్తున దొంగ ఓట్లు వేయించిన వ్యవహారంలో కరుణాకరరెడ్డి, ఆయన కుమారుడు ప్రస్తుత వైఎస్సార్సీపీ అభ్యర్థి అభినయ్‌రెడ్డి ప్రమేయంపై ఫిర్యాదులు, అభియోగాలు ఉన్నాయి.

లక్ష్మీశ కంటే ముందు ఆ జిల్లాలో పనిచేసిన గిరీషా ఈ దొంగ ఓట్ల వ్యవహారంలోనే సస్పెండయ్యారు. ఆయన స్థానంలో అక్కడికి వెళ్లిన లక్ష్మీశ బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉండగా వైఎస్సార్సీపీ నాయకులతో మరింత అంటకాగారు. చంద్రగిరి ఎమ్మెల్యే, ఒంగోలు లోక్‌సభ వైఎస్సార్సీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఓటర్లకు పంపిణీ చేసేందుకు రేణిగుంట సమీపంలోని ఓ గోదాములో నిల్వ చేసిన తాయిలాలను ప్రతిపక్షాలు పట్టించాయి. ఈ వ్యవహారంలో లక్ష్మీశ పూర్తిగా అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారు. కిందిస్థాయి అధికారులను అక్కడికి పంపించి మొక్కుబడిగా తేల్చేశారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి నివేదికా ఇవ్వలేదు. చెవిరెడ్డిపై కేసు నమోదు చేయించలేదు. అధికార పార్టీ నాయకుల ఎన్నికల అక్రమాలపై ప్రతిపక్షాలు ఎన్ని ఫిర్యాదులిస్తున్నా పట్టించుకోలేదు. అధికార పార్టీ పట్ల విపరీతమైన స్వామి భక్తిని ప్రదర్శించిన ఆయనపై ఎట్టకేలకు ఎన్నికల సంఘం వేటు వేసింది.

ఎన్నికల సంఘం సీరియస్​ - ఆరుగురు ఐపీఎస్‌, ముగ్గురు ఐఏఎస్‌ అధికారులు బదిలీ - IAS and IPS Officers Transfers

అనంతపురం జిల్లా కలెక్టర్‌ గౌతమి : అనంతపురం జిల్లా కలెక్టర్‌గా గతేడాది ఏప్రిల్‌లో బాధ్యతలు చేపట్టిన గౌతమి అప్పటి నుంచి పూర్తిగా వైఎస్సార్సీపీ నాయకులు చెప్పినట్లే నడుచుకున్నారు. తహసీల్దార్లు, ఎంపీడీవోల బదిలీల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేల సిఫారసులకే పెద్దపీట వేశారు. ఓటర్ల జాబితాల రూపకల్పనలో అక్రమాలకు పాల్పడుతూ వైఎస్సార్సీపీకు అనుకూలంగా వ్యవహరించిన అధికారులపై ఎన్ని ఫిర్యాదులందినా చర్యలు తీసుకోలేదు. అనంతపురం, రాప్తాడు నియోజకవర్గాల్లో కొంతమంది రెవెన్యూ అధికారులు దొంగ ఓట్ల నమోదుకు సహకరిస్తున్నారన్న ఫిర్యాదులపై విచారించి నివేదిక ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించగా ఎలాంటి అక్రమాలు జరగలేదంటూ తప్పుడు నివేదిక పంపించారు. జిల్లా పరిధిలో దొంగ ఓట్లపై ప్రతిపక్షాలు ఎన్నిసార్లు ఫిర్యాదుచేసినా పట్టించుకోలేదు.

ఉరవకొండ నియోజకవర్గంలో తెలుగుదేశం సానుభూతిపరుల ఓట్ల తొలగింపు వ్యవహారంలో బాధ్యులందరిపైనా చర్యలు తీసుకోవాలని సీఈసీ ఆదేశించినప్పటికీ బీఎల్‌వోలకు షోకాజ్‌ నోటీసులిచ్చి మమ అనిపించేశారు. గత నెల 30న అనంతపురం జిల్లాలో నిర్వహించిన సీఎం జగన్‌ బస్సు యాత్ర నిబంధనల ప్రకారం రాత్రి పదింటి వరకే యాత్రకు అనుమతి ఉన్నా 11.30 వరకూ కొనసాగింది. వైఎస్సార్సీపీ నాయకులు ముఖ్యమంత్రి బస్సు వెంటే ఉంటూ జెండాలు పట్టుకుని డీజే పాటలకు నృత్యాలు చేసుకుంటూ చెలరేగారు. ఇది కోడ్‌ ఉల్లంఘన అని తెలిసినప్పటికీ జిల్లా ఉన్నతాధికారిణిగా గౌతమి ఈ యాత్రపై కనీస పర్యవేక్షణ చేయలేదు. వైఎస్సార్సీపీ నాయకులు కొన్ని రోజులుగా యథేచ్ఛగా ఎన్నికల కోడ్‌ ఉల్లంఘిస్తున్నా చర్యలు తీసుకోలేదు.

ఆ ముగ్గురూ పూర్తి వివరాలతో రావాలి - రాజకీయ హత్యలు, హింసాత్మక ఘటనలపై ఈసీ ఆదేశాలు

కృష్ణా జిల్లా కలెక్టర్‌గా రాజాబాబు :ఏడాదిగా కృష్ణా జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న రాజాబాబు మచిలీపట్నం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పేర్ని నాని ఏది చెబితే అదే చట్టమన్నట్టు పని చేశారు. మచిలీపట్నంలో బోగస్‌ ఓటర్లపై ప్రతిపక్షం ఎన్ని ఫిర్యాదులిచ్చినా చర్యలు తీసుకోలేదు. నకిలీ ఓట్లకు బాధ్యుడైన ఆర్డీవోపై చర్యలు తీసుకోవాలంటూ ఎన్నికల సంఘం ఆదేశాలను బేఖాతరు చేశారు. మచిలీపట్నం వైఎస్సార్సీపీ అభ్యర్థి పేర్ని కిట్టు నకిలీ ఇళ్ల పట్టాలు ఇచ్చిన సంఘటనపై తెలుగుదేశం ఫిర్యాదునూ పట్టించుకోలేదు. వైఎస్సార్సీపీ నాయకులు పెద్ద ఎత్తున ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలకు పాల్పడినా ఎక్కడికక్కడ భూములు ఆక్రమించినా, అనధికారికంగా చేపల చెరువులు ఏర్పాటుచేసినా అడ్డుకోలేదు. ఎన్నికల వేళ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ వారికి మరింత మద్దతుగా నిలిచారు.

పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్‌రెడ్డి : వైఎస్సార్సీపీ అరాచకాలకు వత్తాసు పలికిన ఎస్పీల్లో రవిశంకర్‌రెడ్డి ప్రధానమైన అధికారి. పల్నాడు జిల్లాలో వరసుగా జరుగుతున్న హింసాత్మక సంఘటనలను అరికట్టలేకపోయారు. ఈయన హయాంలో మాచర్ల నియోజకవర్గం మరో చంబల్‌లోయగా మారింది. అక్కడ వైఎస్సార్సీపీ శ్రేణులు ప్రతిపక్ష పార్టీ కార్యాలయం, ప్రతిపక్ష పార్టీ నాయకులు, సానుభూతిపరుల ఇళ్లలోకి చొరబడి అరాచకం సృష్టిస్తే అవన్నీ చాలా చిన్న సంఘటనలేనని తేల్చేశారు. ప్రతిపక్ష పార్టీ నాయకులు, శ్రేణులే లక్ష్యంగా అధికార పార్టీ నాయకులు దాడులకు తెగబడితే అవి పాత ఫ్యాక్షన్‌ గొడవల వల్లే జరిగాయంటూ తేలిగ్గా మాట్లాడారు. తెలుగుదేశం వారిపై అక్రమంగా కేసులు పెట్టి విపరీతంగా వేధించారు. ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలను బైండోవర్‌ చేయించి వారిని కట్టడి చేశారు. ఈయన హయాంలో పల్నాడు జిల్లాలో తెలుగుదేశం నేతల హత్యల పరంపర కొనసాగింది. మాచర్ల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చెప్పిందే చట్టమన్నట్లుగా ఎస్పీ పనిచేశారు.

ప్రధాని నరేంద్రమోదీ ముఖ్యఅతిథిగా హాజరైన ‘ప్రజాగళం’ సభ భద్రతను గాలికొదిలేశారు. ప్రధాని పాల్గొనే సభ అని తెలిసినా భద్రతాపరంగా తగిన చర్యలు తీసుకోలేదు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినా సరే వైఎస్సార్సీపీ, ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు నడుచుకున్నారు. పోలీసుల నిర్లక్ష్యం ఫలితంగా కొందరు ఆకతాయిలు ప్రధాన వేదికకు సమీపంలోని గ్యాలరీలోకి నీళ్ల సీసాలు విసిరారు. వేదిక ముందే తోపులాట చోటుచేసుకుంది. వీవీఐపీ గ్యాలరీల్లోకి జనాలు చొచ్చుకొచ్చేశారు. సభాప్రాంగణంలో మైకు, లైట్ల కోసం ఏర్పాటుచేసిన టవర్లపైకి కొంతమంది ఎక్కటంతో వారిని కిందికి దించాలని ప్రధాని స్వయంగా వేదికపై నుంచి పోలీసులను కోరాల్సి వచ్చింది.

ప్రజలు వచ్చి మైక్‌ సిస్టమ్‌పై పడిపోవటంతో ప్రధాని ప్రసంగిస్తున్నప్పుడు పలుమార్లు మైక్‌ పనిచేయక అంతరాయమేర్పడింది. మోదీ రాకకంటే ముందే సభాప్రాంగణానికి చేరుకున్న ఎన్‌ఎస్‌జీ, ఎస్పీజీ బృందాలు సభాప్రాంగణంలో బందోబస్తుపరంగా లోపాలున్నాయని గుర్తించి రాష్ట్ర పోలీసులను అప్రమత్తం చేసినా వారు సరిగ్గా స్పందించలేదు. ప్రధాన వేదిక పైకి మోదీ చేరుకున్నాక కూడా ముందు భాగంలో భద్రతా చర్యలు చేపట్టలేదు. ఈ వైఫల్యాలన్నింటిపైనా కేంద్ర నిఘా విభాగం అధికారులు దిల్లీకి సమగ్ర నివేదిక పంపించారు. అలాగే సీఈసీ కూడా విచారణ జరిపించింది.ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన మర్నాడే మాచర్లలో తెలుగుదేశం కార్యకర్త ఇర్ల సురేష్‌ కారును వైఎస్సార్సీపీ నాయకులు దహనం చేశారు. ఈ ఘటనపై ఎన్నికల సంఘం ఎస్పీ రవిశంకర్‌రెడ్డిని పిలిపించి ప్రశ్నించింది. వీటన్నింటి నేపథ్యంలో ఆయనపై వేటు పడింది.

ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి :వైఎస్సార్సీపీ అనుకూల, వారి అరాచకాలకు కొమ్ముకాసే అధికారిగా ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి గుర్తింపు పొందారు. గతంలో సీఎం జగన్‌ భద్రత విభాగంలో పనిచేసిన పరమేశ్వర్‌రెడ్డి 2022 ఏప్రిల్‌ నుంచి జనవరి వరకూ తిరుపతి ఎస్పీగా బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలో చంద్రగిరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కరరెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డిలతో సన్నిహితంగా ఉంటూ, వారి అరాచకాలకు కొమ్ముకాస్తూ ప్రతిపక్షాలను వేధించేవారు. ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ప్రాంతీయ సమన్వయకర్తగా చెవిరెడ్డి భాస్కరరెడ్డి నియమితుడైన రెండో రోజే పరమేశ్వర్‌రెడ్డి ప్రకాశం ఎస్పీగా నియమితులయ్యారు. తనకు సన్నిహితుడైన, అన్ని విధాలుగా అనుకూలుడైన పరమేశ్వర్‌రెడ్డిని చెవిరెడ్డే ప్రకాశం జిల్లాకు తీసుకొచ్చారనే ప్రచారముంది.

గతేడాది మార్చిలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తిరుపతి కేంద్రంగా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. నిరక్షరాస్యులు సైతం పట్టభద్రులమంటూ దొంగ ఓట్లు వేశారు. ఆ సమయంలో పరమేశ్వర్‌రెడ్డే ఎస్పీగా ఉన్నా వాటిని నిలువరించలేదు. బాధ్యులపై చర్యలు తీసుకోలేదు. చంద్రగిరి నియోజకవర్గంలో ప్రతిపక్షాల ఓట్ల తొలగింపునకు నకిలీ ఫాం-7 దరఖాస్తులు చేసిన వారిపై ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇటీవల పది కేసులు నమోదయ్యాయి. ఆయా కేసుల్లో నిందితులందరూ వైఎస్సార్సీపీవారే. కానీ వారిలో ఒక్కరంటే ఒక్కరినీ ఈయన అరెస్టు చేయించలేదు. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల సమయంలో చోటు చేసుకున్న దొంగ ఓట్ల వ్యవహారంపై నమోదైన కేసులను నీరుగార్చేశారు. అధికార పార్టీ నాయకులను కాపాడారు.

ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన వెంటనే ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం గడికోట పంచాయతీకి చెందిన తెలుగుదేశం నాయకుడు పాముల మునయ్యను వైఎస్సార్సీపీ నాయకులు హతమార్చారు. ఈ రాజకీయ హత్యపై సీరియస్‌ అయిన ఎన్నికల సంఘం ఆయన్ను పిలిపించి ముందు జాగ్రత్త చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది. శ్రీకాళహస్తి సీఐగా పని చేసిన అంజూయాదవ్‌ జనసేన నాయకుడు సాయిపై చేయి చేసుకున్న వ్యవహారంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యల వల్లే రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య తలెత్తిదంటూ రాజకీయ నాయకుడిలా పరమేశ్వర్‌రెడ్డి ప్రకటన ఇచ్చారు. రాష్ట్రంలో గంజాయి వినియోగం, సాగు బాగా పెరిగిందంటూ తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ విమర్శలకు కౌంటర్‌ ఇస్తూ మాట్లాడారు.

ప్రజాగళం సభకు సంబంధించి ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ విధులకు ఇన్‌ఛార్జిగా వ్యవహరించిన ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి సరిగ్గా పర్యవేక్షించలేదు. ఫలితంగా వేల మంది జనం ట్రాఫిక్‌లో చిక్కుకుపోయి సభకు చేరుకోలేకపోయారు. వైఎస్సార్సీపీ కుట్రలో భాగస్వామ్యమై ఆయన ఇలా వ్యవహరించారని ప్రతిపక్షాలు ఫిర్యాదు చేశాయి. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఏర్పాటుచేసిన చెక్‌పోస్టుల్లోనూ తగినంతమంది సిబ్బందిని నియమించలేదు. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ నాయకులు ప్రలోభాలతో ఎరవేస్తున్నా, తాయిలాలు పంచుతున్నా కనీస చర్యలు తీసుకోలేదు.

కృష్ణా జిల్లా ఎస్పీ పల్లె జాషువా : పల్లె జాషువా అత్యంత వివాదాస్పదమైన అధికారిగా గుర్తింపు పొందారు. గతంలో కృష్ణా జిల్లా ఎస్పీగా పనిచేసే సమయంలో గన్నవరం, గుడివాడ నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ అరాచకాలకు కొమ్ముకాశారు. ఆయా నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ నాయకులు చేసిన దాడుల్లో ప్రతిపక్ష నాయకులు బాధితులుగా మారగా వారిపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, హత్యాయత్నం వంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేయించారు. మచిలీపట్నం నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పేర్ని నాని, ఆయన కుమారుడు కిట్టూతో అంటకాగారు. ఇలాంటి అధికారికి గత జనవరిలో చిత్తూరు జిల్లా ఎస్పీగా కీలక బాధ్యతలు అప్పగించారు. అక్కడ విధుల్లో చేరినప్పటినుంచి వైఎస్సార్సీపీ కార్యకర్త మాదిరిగా పని చేశారు.

తెలుగుదేశం నాయకులపై విచ్చలవిడిగా అక్రమ కేసులు పెట్టారు. రౌడీషీట్లు తెరిచారు. బైండోవర్లు చేశారు. కుప్పం, పుంగనూరు నియోజకవర్గాల్లో తెలుగుదేశం కార్యకర్తలే లక్ష్యంగా వైఎస్సార్సీపీ శ్రేణులు దాడులకు తెగబడుతుంటే బాధ్యులకే వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. చిత్తూరు జిల్లాలో అరాచకం సృష్టిస్తూ, ప్రభుత్వంలో నంబరు-2గా చెలామణి అవుతున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జాషువాను ఏరికోరి చిత్తూరు జిల్లాలో ఎస్పీగా నియమించుకున్నారు. మొన్న జనవరిలో చిత్తూరు ఎస్పీగా వెళ్లిన జాషువాపై ఎన్నికల సంఘం ఇప్పుడు వేటు వేసింది.

కడప ఎస్పీ అన్బురాజన్‌ :వైఎస్సార్సీపీఅధికారం చేపట్టాక నాలుగేళ్లపాటు ముఖ్యమంత్రి సొంత జిల్లా కడప ఎస్పీగా అన్బురాజన్‌ పనిచేశారు. అవినాష్‌రెడ్డి కనుసన్నల్లో నడిచారు. వైఎస్సార్సీపీకు కొమ్ముకాయటమే విధి నిర్వహణ అన్నట్లుగా వ్యవహరించారు. అధికార పార్టీ నాయకుల ప్రత్యర్థులకు పోలీసు మార్కు వేధింపుల రుచి చూపించారు. మాజీ మంత్రి వివేకా హత్య కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మూడో సిట్‌కు అధిపతిగా వ్యవహరించిన అన్బురాజన్‌ అసలు నిందితులను తప్పించేందుకు ప్రయత్నించారన్న ఫిర్యాదులున్నాయి. ఈ కేసు దర్యాప్తును సీబీఐ మొదలుపెట్టాక వారిని ముప్పుతిప్పలు పెట్టారు. ఈ హత్య కేసులో నిందితుడి ఫిర్యాదు ఆధారంగా ఏకంగా సీబీఐ దర్యాప్తు అధికారి రామ్‌సింగ్‌పైనే కేసు పెట్టారు. రామ్‌సింగ్‌ను అవినాష్‌రెడ్డి కోర్టులోనే బెదిరించినా ఆయనపై చర్యలు తీసుకోలేదు. ఈయన వల్లే వివేకా హత్య కేసు విచారణను పక్క రాష్ట్రానికి బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలివ్వాల్సి వచ్చింది.

గతేడాది సెప్టెంబరు 17న అనంతపురం ఎస్పీగా బదిలీపై వెళ్లిన అన్బురాజన్‌ ఆ జిల్లాలో ప్రతిపక్షాల నేతలపై ఉక్కుపాదం మోపారు. ముఖ్యంగా చిన్నపాటి ఆందోళన చేసినా, నిరసన తెలిపినా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలపై ఇబ్బడిముబ్బడిగా కేసులు నమోదు చేయించారు.

ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చాకముఖ్యమంత్రి జగన్‌ ఇటీవల అనంతపురం జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనగా, ఆయన బస్సుయాత్ర కోసం ముందు రోజుంతా సెక్యూరిటీ రిహార్సల్‌ నిర్వహించారు. రూట్‌ చెకప్‌ పేరుతో ఎస్పీ స్వామిభక్తి చాటుకున్నారనే ప్రచారం పోలీసు శాఖలోనే ఉంది. జెడ్‌ప్లస్‌ భద్రత ఉన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు అంతకుముందు జిల్లాలో పర్యటించగా, అరకొరగా సిబ్బందిని పంపించారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి రాత్రి పదింటి తర్వాత కూడా ముఖ్యమంత్రి జగన్‌ అనంతపురం జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించినప్పటికీ అడ్డుకోలేదు. పోలీసు బదిలీల్లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల సిఫార్సులకే ప్రాధాన్యమిచ్చారు. అనంతపురం నగరం, రాప్తాడు తదితర ప్రాంతాల్లో సీఎం జగన్‌ సొంత సామాజికవర్గానికి చెందిన కొందరు పోలీసు అధికారులపై పెద్దఎత్తున ఆరోపణలున్నా బదిలీ చేయలేదు.

నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్‌రెడ్డి :నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్‌రెడ్డి వైఎస్సార్సీపీకు అనుకూలంగా పనిచేశారు. తెలుగుదేశం సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి నారాయణ లక్ష్యంగా పలుమార్లు పోలీసులతో దాడులు చేయించి వేధించారు. తిరుమలేశ్వర్‌రెడ్డి మామ వైఎస్సార్సీపీలో క్రియాశీలంగా ఉంటూ విజయసాయిరెడ్డితో కలిసి ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈయన రోజూ ఎస్పీ కార్యాలయానికి వస్తున్నట్లు ఎన్నికల సంఘానికి ఇటీవల ఫిర్యాదులందాయి. సర్వేపల్లి నియోజకవర్గంలో క్వార్ట్జ్‌ అక్రమ తవ్వకాలపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా కనీస చర్యలు తీసుకోలేదు. ఫిబ్రవరి 9న ఔషధ నియంత్రణ అధికారుల పేరుతో నెల్లూరులోని నారాయణ వైద్య కళాశాల, నారాయణ నివాసంలో తనిఖీలు చేసి చివరకు ఏం లేవని తేల్చి చెప్పారు. ఈ సమయంలో పెద్దఎత్తున పోలీసులు హడావుడి చేసి రోగులను ఇబ్బందిపెట్టారు.

మార్చి 4న మరోసారి నారాయణ అనుచరులు, ఆయన విద్యాసంస్థల్లో పనిచేసే వారి ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించారు. రాంజీనగర్‌లో ఉంటున్న మాజీ జడ్పీటీసీ ముప్పాళ్ల విజేతారెడ్డి ఇంటికి సుమారు 20 మంది పోలీసులు ఉదయం ఆరింటికి వెళ్లారు. మరో పది మంది ఆమె ఉంటున్న అపార్టుమెంట్‌ను చుట్టుముట్టారు. ఇంట్లో వస్తువులు, బీరువాలు ఒకటికి రెండుసార్లు తనిఖీలు చేశారు. చివరకు విలేకర్ల సమావేశం నిర్వహించి నారాయణ విద్యాసంస్థలకు సంబంధించి బస్సుల కొనుగోలులో పన్ను ఎగవేతకు సంబంధించి తనిఖీలు చేశామని చెప్పారు. అయితే నారాయణ అనుచరుల ఇళ్లలో తనిఖీలు ఎందుకు చేశారనే దానికి సమాధానం చెప్పలేదు. ప్రధాని నరేంద్రమోదీ పాల్గొన్న ప్రజాగళం సభకు సంబంధించి సభాప్రాంగణంలో గ్యాలరీలకు బాధ్యుడిగా నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్‌రెడ్డి ఆ విధులను గాలికొదిలేశారు. దీనిపై ఫిర్యాదులందటంతో ఆయనపై వేటు పడింది.

గుంటూరు రేంజి ఐజీ జి.పాలరాజు :ప్రధాని మోదీ పాల్గొన్న ప్రజాగళం సభ భద్రత ఏర్పాట్లలో అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు గుంటూరు రేంజి ఐజీ జి.పాలరాజు. అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి వారు చెప్పినట్టు పనిచేశారు. ఇటీవల ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టిన ఇన్‌స్పెక్టర్ల బదిలీల్లోనూ వైఎస్సార్సీపీ నాయకుల సిఫార్సులకే ప్రాధాన్యమిచ్చారు. వారు కోరుకున్న వారిని కోరుకున్నచోట నియమించారు. రేంజ్‌ పరిధిలో ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలపై పెద్ద ఎత్తున అక్రమ కేసులు బనాయిస్తున్నా అడ్డుకోలేదు. తెలుగుదేశం నాయకులు ఇచ్చిన ఫిర్యాదులను పట్టించుకోలేదు.

నెల్లూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల ఎస్పీలు పేట్రేగిపోతున్నా నిలువరించలేదు. ‘ప్రధాని సభలో భద్రతా వైఫల్యాలకు డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి, నిఘా విభాగాధిపతి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులతో పాటు గుంటూరు ఐజీ పాలరాజు కారణమని, వారిపై చర్యలు తీసుకోవాలంటూ గత నెల 18న బీజేపీ, తెలుగుదేశం, జనసేన నాయకులు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. ఈ అంశాలను తీవ్రంగా పరిగణించిన కేంద్ర ఎన్నికల సంఘం పాలరాజుపై వేటు వేసింది.

ప్రజాగళం సభకు వెళ్లాడని టీడీపీ కార్యకర్తపై వైసీపీ కార్యకర్తలు దాడి- ఓటమి భయంతోనే దాడి చేశారన్న అచ్చెన్నాయుడు

ABOUT THE AUTHOR

...view details