ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి - కలెక్టర్లు, ఎస్పీలకు ఎన్నికల సంఘం ఆదేశాలు - కలెక్టర్లకు సీఈసీ సూచనలు

Central Election Commission Instructions: ఎన్నికల ప్రక్రియలో చేపట్టాల్సిన అంశాలపై కేంద్ర ఎన్నికల సంఘం జిల్లాల ఎన్నికల అధికారులైన కలెక్టర్లు, ఎస్పీలకు ప్రత్యేక సూచనలు జారీచేసింది. నగదు, అక్రమ మద్యం రవాణా, ఉచితాల పంపిణీ వంటి అంశాలపై నిఘా పెట్టాల్సిందిగా సూచనలు ఇచ్చింది. ప్రజలు ఎన్నికల అక్రమాలపై సీ-విజిల్‌ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని, ఫిర్యాదు అందిన వంద నిమిషాల్లోపు చర్యలు ఉంటాయని ఈసీ పేర్కొంది.

Central_Election_Commission_Instructions
Central_Election_Commission_Instructions

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 2, 2024, 8:59 PM IST

వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి - కలెక్టర్లు, ఎస్పీలకు ఎన్నికల సంఘం ఆదేశాలు

Central Election Commission Instructions: సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతోపాటు ఐటీ, కస్టమ్స్‌ లాంటి కేంద్ర, రాష్ట్రాల ఎన్ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలకు ఈసీ ప్రత్యేకమైన సూచనలు జారీచేసింది. ఎలక్షన్‌ సీజర్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ అమలును పటిష్ఠంగా నిర్వహించడంతోపాటు నగదు అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాల్సిందిగా ఆదేశించింది. ఎన్నికల సమయంలో మద్యం, నగదు, ఉచితాల పంపిణీ, మాదకద్రవ్యాల సరఫరా వంటి వాటిపై కఠినంగా వ్యవహరించాల్సిందిగా సూచించింది.

రాష్ట్రాల సరిహద్దులు దాటి వచ్చే అక్రమ మద్యం విషయంలోనూ నిశిత దృష్టి పెట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఆయా ప్రాంతాల్లోని మద్యం కింగ్‌ పిన్‌ల పైనా నిఘా ఉంచాలని సూచించింది. నగదు చలామణితోపాటు ఆన్‌లైన్‌లో నగదు బదిలీల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలని ఆదేశించింది. ఆన్‌లైన్‌ వాలెట్‌లను భర్తీ చేయడం, క్యాష్‌ ట్రాన్స్‌ఫర్‌లు వంటివాటిపై నిఘా పెట్టాలని నిర్దేశించింది. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సూచించిన పనివేళల్లో మాత్రమే నగదు రవాణా వాహనాలను అనుమతించాలని పేర్కొంది. ప్రత్యేకించి విమానాశ్రయాలు, ఎయిర్‌స్ట్రిప్‌లు, హెలిపాడ్‌ల వద్ద కూడా సంబంధిత కేంద్ర ఏజెన్సీలతో నిఘా పెట్టాలని స్పష్టం చేసింది.

'ఓటు వేసేందుకు ఆధార్ తప్పనిసరి కాదు'- కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ

నిఘా ఉంచాలి: అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు మాత్రమే 50 లీఫ్‌లెట్స్‌ ఉన్న 4 వ్యక్తిగతం కాని చెక్‌ పుస్తకాలు మంజూరు చేయవచ్చని బ్యాంకులకు ఈసీ సూచించింది. రాజకీయ పార్టీలు ఉచితాల కోసం పంచిపెట్టే సున్నితమైన వస్తువులకు సంబంధించి కొనుగోళ్లపైనా దృష్టి పెట్టాలని సూచించింది. రాష్ట్రాల్లో వేర్వేరు చోట్ల ఉండే గోదాములపైనా నిఘా ఉంచాలని ఆదేశించింది. పోలీసు, ఎక్సైజ్‌, రవాణా విభాగాలతో సమన్వయం చేసుకొని నిఘా పెట్టాలని సూచించింది.

తక్షణమే చర్యలు చేపట్టాలి: అన్ని రాజకీయ పార్టీలకూ సమాన అవకాశాలు ఇచ్చేలా ఎన్నికల వాతావరణాన్ని కల్పించాలని, పక్షపాతం వహించే అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశించింది. ఓటర్ల జాబితాలకు సంబంధించిన అంశాల్లోనూ జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. రాజకీయ పార్టీలు ఓటర్ల జాబితాపై చేసే ఫిర్యాదుల విషయంలో విచారణ చేసి వాటి పరిష్కారపై వివరాలు తెలియచేయాలని ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియలో దురుద్దేశపూర్వకమైన వ్యవహారాలపై తక్షణమే చర్యలు చేపట్టాలని ఈసీ పేర్కొంది.

దేశంలో 97 కోట్ల మంది ఓటర్లు- కొత్తగా లిస్ట్​లోకి 2 కోట్ల మంది యువత

వాటికి జీపీఎస్ ఉండేలా చూడాలి: ఎన్నికల ప్రక్రియలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల తరలింపులో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఈసీ స్పష్టం చేసింది. ఈవీఎం​లను కేవలం అధికారిక వాహనాల్లోనే తరలించాలని, వాటికి జీపీఎస్ ఉండేలా చూడాలని ఆదేశాలిచ్చింది. పోలింగ్‌ ఏజెంట్లకు సంబంధించిన అంశాల్లో ఎలా వ్యవహరించాలో ప్రిసైడింగ్‌ అధికారులకు ముందే శిక్షణ ఇవ్వాల్సిందిగా జిల్లాల ఎన్నికల అధికారులకు సూచించింది.

క్యూ మేనేజ్‌మెంట్‌ యాప్‌లో తెలుసుకునేలా: ప్రతి ఓటరుకు ఫోటోతో కూడిన గుర్తింపు కార్డు పంపిణీ జరిగేలా, అలాగే ఓటరు సమాచార చీటీ అందేలా చూడాలని స్పష్టం చేసింది. ఈసీ నిర్దేశించిన ఎన్నికల అబ్జర్వర్ల ఫోన్‌ నంబర్లను ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించింది. సామాజిక మాధ్యమాల్లో వచ్చే తప్పుడు వార్తల విషయంలో తక్షణం చర్యలు చేపట్టాలని ఈసీ స్పష్టం చేసింది. ఓటర్ల లైన్లకు సంబంధించిన సమాచారాన్ని పోలింగ్‌ స్టేషన్‌ క్యూ మేనేజ్‌మెంట్‌ యాప్‌లో తెలుసుకునేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది.

వంద నిమిషాల్లోనే చర్యలు:ప్రజలు పోలింగ్‌కు సంబంధించిన సమాచారాన్ని ఓటర్‌ హెల్ప్‌లైన్‌ యాప్‌ ద్వారా తెలుసుకోవచ్చని ఈసీ తెలిపింది. సీ-విజిల్‌ యాప్‌ ద్వారా ఎన్నికల అక్రమాలను ఈసీకి ఫిర్యాదు చేయొచ్చని పేర్కొంది. ఫిర్యాదు అందిన 100 నిమిషాల్లోనే చర్యలు తీసుకుంటామని ఈసీ పేర్కొంది. సీ-విజిల్‌ యాప్‌ ద్వారా చేసే ఫిర్యాదులకు పూర్తి గోప్యత ఉంటుందని స్పష్టం చేసింది. సువిధ పోర్టల్‌ ద్వారా నామినేషన్లు, అఫిడవిట్లకు సంబంధించిన సమాచారం అభ్యర్థులకు తెలుస్తుందని ఈసీ తెలిపింది. సభలు, ర్యాలీలకు సంబంధించిన అనుమతులనూ సువిధ పోర్టల్ ద్వారా పొందొచ్చని ఎన్నికల సంఘం వెల్లడించింది.

'ఎన్నికల ప్రచారాల్లో చిన్నారులను ఉపయోగించవద్దు'- పార్టీలకు ఈసీ ఆదేశాలు

ABOUT THE AUTHOR

...view details