CBI court verdict on Emar case: ఎమ్మార్ కేసులో డిశ్చార్జి పిటిషన్లపై సీబీఐ కోర్టు తీర్పు వెల్లడించింది. ఏపీ సీఎం జగన్ సన్నిహితుడు ఎన్.సునీల్ రెడ్డి సహా కేసు నుంచి తొలగించాలన్న నిందితుల అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది. విశ్రాంత ఐఏఎస్ బీపీ ఆచార్యపై ఐపీసీ సెక్షన్లు తొలగించిన కోర్టు,అవినీతి నిరోధక చట్టానికి సంబంధించిన అభియోగాలపై విచారణ కొనసాగుతుందని స్పష్టం చేసింది. వైసీపీ మాజీ ఎంపీ కోనేరు ప్రసాద్ మరణించడంతో ఆయనపై విచారణ ముగించింది. బదిలీ అయిన సీబీఐ కోర్టు జడ్జి సీహెచ్.రమేష్ బాబు నేడు చివరి రోజున 11 ఏళ్లుగా కొనసాగుతున్న డిశ్చార్జి పిటిషన్లపై తీర్పు వెల్లడించారు.
ఎమ్మార్ కేసులో డిశ్చార్జి పిటిషన్లపై పదకొండేళ్ల తర్వాత సీబీఐ కోర్టు తీర్పు వెల్లడించింది. ఎమ్మార్ కేసు నుంచి తొలగించాలన్న పలువురు నిందితుల అభ్యర్థనను తోసిపుచ్చి డిశ్చార్జి పిటిషన్లను కొట్టివేసింది. ఎమ్మార్ ప్రాజెక్టు ఒప్పందాలు, వాటా విలువ, విల్లాల విక్రయాల్లో అక్రమాలు జరిగాయని తేల్చిన సీబీఐ 2013లో చార్జిషీట్ దాఖలు చేసింది. ఏపీఐఐసీ అప్పటి ఎండీ బీపీ ఆచార్య, ఎన్. సునీల్ రెడ్డి, కోనేరు రాజేంద్రప్రసాద్, ఎల్వీ సుబ్రహ్మణ్యం, కె.విశ్వేశ్వరరావు, కోనేరు మధు, టి.రంగారావు, శ్రవణ్ గుప్తా, జి.వి.విజయరాఘవ, శ్రీకాంత్ జోషితో పాటు ఎమ్మార్ ప్రాపర్టీస్, ఎమ్మార్ హిల్స్, ఎమ్మార్ ఎంజీఎఫ్, స్టైలిష్ హోమ్స్, బౌల్డర్ హిల్స్ కంపెనీలను నిందితులుగా పేర్కొంది. మనీలాండరింగ్ అంశాలపై విచారణ జరిపిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ జగన్ సన్నిహితులు ఎన్. సునీల్ రెడ్డి, ఇందూ శ్యాంప్రసాద్ రెడ్డి, కోనేరు ప్రదీప్ తదితరులకు చెందిన 167 కోట్ల రూపాయల ఆస్తులను జప్తు చేసింది. తుమ్మల రంగారావు అప్రూవర్ గా మారడంతో సాక్షిగా మార్చారు. ఎల్వీ సుబ్రహ్మణ్యం, కోనేరు మధుపై సీబీఐ కేసును హైకోర్టు కొట్టివేసింది. పలువురు నిందితులు 2013లో డిశ్చార్జి పిటిషన్లు వేయగా.. అప్పటి నుంచి ఆరుగురు జడ్జిలు బదిలీ కావడం, తదితర కారణాల వల్ల కొలిక్కి రాలేదు. సుదీర్ఘంగా వాదనలు విన్న సీబీఐ కోర్టు జడ్జి సీహెచ్.రమేష్ బాబు బదిలీ కావడంతో, ఇవాళ చివరి రోజున ఎమ్మార్ కేసు డిశ్చార్జి పిటిషన్లపై తీర్పు వెల్లడించారు.