Cases Registered on Posani Krishna Murali and Sri Reddy: సినీ నటుడు, వైఎస్సార్సీపీ నాయకుడు పోసాని కృష్ణమురళి, సినీ నటి శ్రీరెడ్డిపై పలు పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుపై అసభ్య వ్యాఖ్యలు చేసిన పోసాని కృష్ణమురళిపై పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ టీడీపీ నాయకులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పాలకొండ టీడీపీ నేతలు బొగాది వెంకటరమణ, అనాపు జవరాజు, కూటమి కార్యకర్తలు ఎస్‌ఐకి ఫిర్యాదు అందజేశారు. టీటీడీ ఛైర్మన్‌ను అభ్యంతకర పదజాలంతో దూషించిన పోసాని కృష్ణమురళిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
అదేవిధంగా కర్నూలు మూడవ పట్టణ పోలీసు స్టేషన్‌లోనూ పోసాని కృష్ణమురళిపై తెలుగుదేశం పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోసాని కృష్ణమురళిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌పై అనుచిత వాఖ్యలు చేయడంతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని వారు తెలిపారు.
సినీ నటుడు పోసాని కృష్ణ మురళిపై శ్రీకాకుళం జిల్లా పార్లమెంట్ పార్టీ టీడీపీ అధ్యక్షుడు కలమట వెంకటరమణమూర్తి సైతం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో టీడీపీ నాయకుడు నారా లోకేశ్, టీడీపీ నాయకులపై దుర్భాషలాడిన నేపథ్యంలో పోసానిపై పాతపట్నంలో పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుగా మాట్లాడిన వారిపై కేసులు నమోదు చేసి, తగు చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.
అవినాష్‌రెడ్డి పీఏ రాఘవరెడ్డి ఎక్కడ? - జల్లెడ పడుతున్న పులివెందుల పోలీసులు
CASES ON SRI REDDY: సినీ నటి శ్రీరెడ్డిపై కృష్ణా జిల్లా గుడివాడ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. చంద్రబాబు, పవన్, అనితలపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర రీతిలో పోస్టులు పెట్టారంటూ మచిలీపట్నం టీడీపీ సోషల్ మీడియా కన్వీనర్ అసిలేటి నిర్మల ఫిర్యాదు చేశారు. నిర్మల ఫిర్యాదు మేరకు శ్రీరెడ్డిపై గుడివాడ పోలీసులు కేసు నమోదు చేశారు.
మరోవైపు శ్రీరెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర తెలుగు మహిళ ఉపాధ్యక్షురాలు కొణతాల రత్నకుమారి అనకాపల్లి పట్టణ పోలీసు స్టేషన్‌లోనూ ఫిర్యాదు చేశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, అనితలపై ఆమె ప్రవర్తించిన తీరు జుగుప్సాకరంగా ఉందంటూ సీఐకి ఫిర్యాదు పత్రం అందజేశారు.
విశాఖ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లోనూ శ్రీరెడ్డి మీద కేసు నమోదైంది. శ్రీ రెడ్డిపై విశాఖ దక్షిణ నియోజకవర్గ తెలుగు మహిళలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనితతో పాటు అనుచితంగా వాఖ్యలు చేస్తూ, యూట్యూబ్‌లో వీడియో చేసిన శ్రీరెడ్డిపై కేసు నమోదు చేయాలని కోరుతూ ఫిర్యాదు చేశారు.
తప్పు చేశాను క్షమించండి మహాప్రభో! - కాళ్ల బేరానికి వచ్చిన నటి
Atrocity Case on Varra Ravinder Reddy: ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరుడు వర్రా రవీందర్ రెడ్డిపై మరో అట్రాసిటీ కేసు నమోదైంది. అన్నమయ్య జిల్లా నందలూరు పోలీస్ స్టేషన్లో వర్రా రవీందర్ రెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డిలపై ఐటీ యాక్టు, బీఎన్ఎస్ యాక్టు, ఎస్సీఎస్టీ అట్రాసిటీ యాక్టు కింద కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటికే పులివెందుల పోలీస్ స్టేషన్లో ఈ ముగ్గురిపై కేసులు నమోదు కాగా, ఏ-1గా ఉన్న వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. తాజాగా నందలూరు పోలీస్ స్టేషన్లో కూడా కేసులు నమోదు అయ్యాయి. సిద్ధవటం మండలానికి చెందిన దళితుడైన వెంకటాద్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అట్రాసిటీ కేసులు నమోదు చేశారు.
2023 సెప్టెంబరులో పవన్ కల్యాణ్, వారి కుటుంబ సభ్యులపైన వర్రా రవీందర్ రెడ్డి అనే వ్యక్తి అసభ్యకరమైన పోస్టులను సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. వాటిని తొలగించాలని అడిగినందుకు కులం పేరుతో దూషించి, బెదిరించాడని వెంకటాద్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో పవన్ కల్యాణ్, కుటుంబ సభ్యులపై పెట్టిన పోస్టులను తొలగించాలంటే 2 లక్షల రూపాయలు ఇవ్వాలని వర్రా బెదిరించినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సామాజిక మాధ్యమాల పోస్టింగ్ కేసు - వైఎస్ అవినాష్ రెడ్డి మెడకు ఉచ్చు!