Cases on Varra Ravinder Reddy: సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వర్రా రవీందర్‌రెడ్డిపై రాష్ట్ర వ్యాప్తంగా వరుసగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా వర్రా రవీందర్ రెడ్డిని కడప జైలు నుంచి పీటీ వారంట్పైన తీసుకెళ్లిన పోలీసులు ప్రొద్దుటూరు కోర్టులో హాజరు పరిచారు. వర్రా రవీందర్ రెడ్డిపై ప్రొద్దుటూరులో కూడా కేసు నమోదు కావడంతో ఈ మేరకు తీసుకెళ్లారు. తెలుగుదేశం పార్టీ అగ్రనేతలపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన పోస్టులు పెట్టినట్లు ప్రొద్దుటూరు వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. బీఎన్ఎస్ యాక్ట్ కింద కేసు నమోదైంది.
రాష్ట్ర వ్యాప్తంగా 40 కేసులు: ఈనెల 8వ తేదీన పులివెందుల పోలీస్ స్టేషన్లో నమోదైన అట్రాసిటీ కేసులో వర్రా కడప జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇతనిపై వైఎస్సార్ జిల్లా వ్యాప్తంగా పది కేసులు నమోదు కాగా, రాష్ట్ర వ్యాప్తంగా 40 కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. వర్రా కేసులో పలువురు అనుమానితులను విచారిస్తున్న పోలీసులు, తాజాగా నెల్లూరు, భీమవరం ప్రాంతాలకు చెందిన విష్ణువర్ధన్ రెడ్డి, జయరాంలను అదుపులోకి తీసుకుని విచారించారు. వీరిద్దరికీ సోమవారం 41-ఏ నోటీసులు ఇవ్వనున్నారు.
సజ్జల భార్గవ్‌రెడ్డికి 41-ఏ నోటీసులు: వైఎస్సార్సీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ్‌రెడ్డికి పోలీసులు 41-ఏ నోటీసులు జారీ చేశారు. విజయవాడ వెళ్లిన పులివెందుల పోలీసులు భార్గవ్ తల్లికి నోటీసులు అందించారు. పులివెందులలో జగన్ బంధువు అర్జున్‌రెడ్డికి సైతం 41-ఏ నోటీసులు ఇచ్చారు. పులివెందులలో అర్జున్‌రెడ్డి ఇంటికి నోటీసులు అంటించి వచ్చారు. ఈ నెల 8వ తేదీన ఐటీ, బీఎన్‌ఎస్, అట్రాసిటీ చట్టాల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇందులో ఏ-1గా వర్రా రవీందర్‌రెడ్డి, ఏ-2గా సజ్జల భార్గవ్‌రెడ్డి, ఏ-3గా అర్జున్‌రెడ్డి ఉన్నారు. సోమవారం విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. వర్రా రవీందర్‌రెడ్డి కేసులో మరో 15 మందికి కూడా నోటీసులు జారీ చేశారు.