Case Against Harish Rao : హైదరాబాద్‌లోని పంజాగుట్ట పీఎస్‌లో బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావుపై కేసు నమోదు అయింది. హరీశ్‌తో పాటు అప్పటి టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావుపైనా కూడా కేసు నమోదైంది. హరీశ్‌రావుపై రియల్ ఎస్టేట్ డీలర్ చక్రధర్ గౌడ్ ఫిర్యాదు చేశారు. బాచుపల్లికి చెందిన చక్రధర్‌గౌడ్ ఫిర్యాదుతో హరీశ్‌రావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. అక్రమ కేసులు పెట్టి వేధించారని చక్రధర్ గౌడ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే తన ఫోన్ ట్యాప్ చేసినట్లు ఆయన ఫిర్యాదులో తెలిపారు. 120(బి), 386, 409,506 సెక్షన్ల కింద, అలాగే రెడ్‌విత్ 34, ఐటీ యాక్ట్ కింద హరీశ్‌రావుపై పంజాగుట్ట ఠాణాలో కేసు నమోదు అయింది.
అసలేం జరిగింది : సిద్దిపేటకు చెందిన గదగోని చక్రధర్‌గౌడ్ హైదరాబాద్ నగరశివారు నిజాంపేటలో నివాసముంటున్నారు. 2008లో తాను స్థిరాస్తి వ్యాపారం ప్రారంభించానని 2019లో తాను నిజాంపేటకు మకాం మార్చానని తెలిపారు. 2021మార్చిలో పంజాగుట్ట నాగార్జున సర్కిల్‌లో ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతులను సేంద్రీయ వ్యవసాయం వైపుకు మళ్లించి వారికి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఏర్పాటు చేశానని అన్నారు.
2022లో సిద్దిపేట బస్టాండ్ సమీపంలో కొండ భూదేవి గార్డెన్ పేరుతో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆత్మహత్యకు పాల్పడిన వంద మంది రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్ష చెప్పున కోటి రూపాయల ఆర్థిక సహాయం చేయాలని భావించినట్లు తెలిపారు. ఇందుకోసం అప్పటి గవర్నర్‌ను ముఖ్య అతిథిగా పిలవగా స్థానిక పోలీసు అధికారులు అనుమతి ఇవ్వలేదని పేర్కొన్నారు.
అప్పటి నుంచి హరీశ్ రావు నాపై కక్ష కట్టారు : గతేడాది మార్చిలో రైతు కుటుంబాలకు చెందిన 150మంది భర్తలు కోల్పోయిన వితంతులకు లక్ష రూపాయల చొప్పున నగదును పంపిణీ చేశానని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యేతో సహా ఏ ఇతర రాజకీయ నేతలను ఆహ్వానించలేదన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాల ద్వారా తనకు మంచి పేరు వస్తుందనే అక్కసుతో స్థానిక ఎమ్మెల్యే అప్పటి మంత్రి అయిన హరీశ్ రావు తనపై కక్ష పెంచుకున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా తానొక చిన్న తరహా పరిశ్రమలు సైతం ఏర్పాటు చేసి బాధిత రైతు కుటుంబాలను ఆదుకునేందుకు ప్రయత్నం చేశానని అప్పటి నుంచి హరీశ్‌రావు అతని అనుచరుల నుంచి బెదిరింపులు ప్రారంభమయ్యాయని వివరించారు. ఇలాంటి కార్యక్రమాలను ఆపివేయకుంటే చంపివేస్తామని బెదిరించారని పేర్కొన్నారు. అగ్గిపెట్ట మచ్చ పేరుతో ఓ అగ్గిపెట్టెల పరిశ్రమను ప్రారంభిస్తే దానికి అనుమతులు లేవని అరెస్టు చేయించి జైలుకు పంపారని తెలిపారు.
గుర్తు తెలియని నెంబర్ల నుంచి ఫోన్ కాల్స్ : జైలు నుంచి పది రోజుల తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాయని అప్పటి నుంచి గుర్తు తెలియని ఫోన్ నెంబర్ల నుంచి తనకు సంక్షిప్త సందేశాలు వస్తున్నాయని అందులో తనను చంపేస్తానని హెచ్చరించారని చక్రధర్ గౌడ్ పేర్కొన్నారు. ఈ డబ్బులన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయని ఒకసారి వచ్చి తమను కలవాలని ఆ సంక్షిప్త సందేశాల్లో ఉన్నట్లు తెలిపారు. అయినా తన సేవా కార్యక్రమాలను యథావిధిగా కొనసాగించానని వెల్లడించారు.
ఈ ఏడాది మార్చిలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ సమక్షంలో తాను బీజేపీలో చేరానని తెలిపారు. అయితే పంజాగుట్టలోని తన కార్యాలయంలో మఫ్టిలో వచ్చిన పోలీసులు సోదాలు నిర్వహించారని పేర్కొన్నారు. తనను కస్టడిలోకి తీసుకుని టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధా కిషన్ రావు ఎదుట హాజరు పర్చారని తనపై హరీష్‌రావు అగ్రహంగా ఉన్నారని వెంటనే బీఆర్‌ఎస్ పార్టీలో చేరాలని రాధాకిషన్ రావు ఒత్తిడి చేసినట్లు వెల్లడించారు.
నా ఫోన్ ట్యాప్ చేశారు : అంతేకాకుండా తమ మాట వినకుంటే తన చాప్టర్ క్లోజ్ చేస్తామని హెచ్చరించినట్లు తెలిపారు. తనను హైదరాబాద్ సీసీఎస్ ఠాణాకు తీసుకువెళ్లి మరో రెండు కేసులు నమోదు చేశారని చెప్పారు. తాను ఉపయోగించిన ఫోన్‌ను స్వాధీనం చేసుకుని జైలుకు తరలించారని బెయిల్ పై విడుదలైన తర్వాత నుంచి తన ఫోన్ ట్యాప్ అయినట్లు, ఆపిల్ సంస్థ నుంచి మెయిల్స్ వచ్చాయని వెల్లడించారు. సిద్దిపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు బీజేపీ నుంచి టికెట్ రాకపోవడంతో బహుజన సమాజ్ పార్టీ ( బీఎస్పీ) నుంచి పోటీ చేశానని చెప్పారు.
ఎన్నికల ప్రచార సమయంలో తన కదలికలను హరీశ్‌రావు ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకునే వారని తనతోపాటు తన కుటుంబసభ్యులు, మిత్రుల కదలికలపై కూడా నిఘా ఉంచారని పేర్కొన్నారు. తన ఫోన్ నెంబర్‌తోపాటు తన భార్య ఫోన్ నెంబర్ కూడా ట్యాప్ చేశారని ఫిర్యాదులో వివరించారు. తన మంత్రి పదవిని అడ్డుపెట్టుకుని తనను ఇబ్బందులు గురిచేశారని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపారు. తన ఫోన్ ట్యాప్ చేయడంతోపాటు బెదిరింపులకు పాల్పడిన హరీష్‌రావు, రాధా కిషన్‌రావులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని గదగొని చక్రధర్ గౌడ్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.