Cars Were Heavily Damaged in Flood Disaster At Vijayawada:విజయవాడలో వరద బీభత్సానికి కార్లు పెద్ద సంఖ్యలో దెబ్బతిన్నాయి. కృష్ణమ్మ మహోగ్రరూపం, బుడమేరులో ఊహించని వరదకు ఇంటి సెల్లార్లోనే కాకుండా రోడ్డుపక్క పార్కు చేసిన కార్లు సైతం తలకిందులయ్యాయి. వరద తగ్గుముఖం పట్టడంతో దెబ్బతిన్న కార్లను షోరూమ్‌ల వద్దకు తీసుకొచ్చి సర్వీసింగ్ చేయించేందుకు యజమానులు నానాయాతన పడుతున్నారు. ఒక్కో కారుకు కనిష్టంగా 70 వేలు నుంచి లక్ష రూపాయలపైగా ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. 12 లక్షల రూపాయల నుంచి కోటి రూపాయల వరకు కొనుగోలు చేసిన కార్లలో కొన్నింటికి కనీస రీసేల్ ధర కూడా వచ్చేలా లేదని బాధితులు గగ్గోలు పెడుతున్నారు.
వరదలో కొట్టుకుపోయిన వాహనాలు - బయటకు తీసేందుకు భారీగా డబ్బులు డిమాండ్ - MONEY DEMAND AT ITHAVARAM
విజయవాడలోని వరద ప్రభావ ప్రాంతాల్లో ఎటుచూసినా వాహనాలు రోడ్లపై చెల్లాచెదురయ్యాయి. నీటి ప్రవాహానికి పార్కింగ్ చేసిన వాహనాలు సైతం కొట్టుకుపోయాయి. మరికొన్ని కాల్వల్లో బోర్లాపడ్డాయి. ఇంకొన్ని తల్లకిందులై నీటమునిగిపోయాయి. నీటి ఉద్ధృతి తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొంటున్న తరుణంలో వాహనదారులు కార్లను షోరూమ్‌లకు పంపుతున్నారు. పాత, కొత్త అనే తేడా లేకుండా వేలాది కార్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మరమ్మతులకు సైతం భారీగా ఖర్చు అవుతుందని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. విజయవాడ చుట్టుపక్కల శివారు ప్రాంతాల్లో టాటా, హుందాయ్ ఇతర కార్ల కంపెనీల గోడౌన్లు ఉన్నాయి. మిగిలిన చోట్ల ఉన్న కార్ల షోరూమ్‌లలో వరద నీరు చేరింది. సింగ్ నగర్, గొల్లపూడి, భవానీపురం ప్రాంతాల్లో వేల సంఖ్యలో కార్లు నీటిలో మునిగాయి. కార్ల నష్టాన్ని అంచనా వేయలేని రీతిలో ఉన్నాయి.