Cane Trees in Mulugu District :వృక్షాలు మానవాళి మనుగడకు మూలం. వాటిని కాపాడుకోకపోతే మన ఉనికిని మనమే నాశనం చేసుకున్న వారిమవుతాం. కానీ, ప్రస్తుతం చెట్లు తగ్గిపోతున్నాయి. ఈరోజు కనిపించని అడవులు పాతికేళ్ల తర్వాత ఉంటాయా అంటే చెప్పలేని పరిస్థితి. అడవులు అంతరించిపోతే వాతావరణ సమతుల్యత దెబ్బతింటుంది. ఇప్పటికే కీలకమైన వృక్ష సంపద కనుమరుగవుతోంది. అందులోనూ అరుదైన చెట్లపై స్మగ్లర్ల కన్ను పడి వాటి ఉనికిని కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే క్రమంలో ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని పాలంపేట శివారులో రామప్ప ఆలయం తూర్పు ద్వార సమీపంలో ఏపుగా పెరిగే అరుదైన వెదురు జాతికి చెందిన కేన్ మొక్కలు పూర్తిగా కనుమరుగయ్యే దశకు చేరుకున్నాయి.
కేరళ, అసోం తర్వాత తెలంగాణలోని పాలంపేట శివారు, పాకాల సరస్సు వద్ద మాత్రమే పెరిగే అరుదైన జీవవైవిధ్య కేన్ మొక్కలు మానవాళికే గాక పక్షులకు ఎంతో మేలు చేస్తాయి. ఇది అరకేసీ కుటుంబానికి చెందినది. ఈ మొక్కల కాండం ముళ్లతో ఉంటుంది. దీని నుంచి వచ్చే కలపను వివిధ గృహోపకరణాలకు వినియోగిస్తారు. ముఖ్యంగా సోఫాలు, కుర్చీలు, వాకింగ్ స్టిక్స్, ఫోటో ఫ్రేమ్‌లు ఇలా రకరకాల వస్తువులు తయారు చేయడానికి వాడతారు.
కేన్ మొక్కలు పర్యావరణహితం కావడంతో వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. మొక్కలు పెరిగే ప్రాంతం రామప్ప చెరువు కట్ట కింది భాగం కావడంతో ఏడాది పొడవునా ఇక్కడి నేలలో తేమ ఉంటుంది. ఒళ్లంతా ముళ్లు ఉండే కేన్‌మొక్కలు విస్తరించి ఉన్న ప్రాంతంలోకి మనుషులే కాదు ఇతర జంతువులు వెళ్లడం కష్టం. అందువల్లే ఇక్కడ అరుదైన తెల్లమద్ది వృక్షాలు ఉన్నాయి.
కేన్‌చెట్ల మధ్య ఉన్న ఇతర వృక్షాలపై వేలసంఖ్యలో గబ్బిలాలు నివసిస్తూ ఉంటాయి. వాటితోపాటు మొత్తం 120 జాతుల పక్షులు ఇక్కడ ఆవాసం ఏర్పరుచుకున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అందుకు గుర్తుగా అరుదైన జీవవైవిధ్య ప్రాంతంగా ఇక్కడ బోర్డులు ఏర్పాటు చేశారు. కానీ, అటవీశాఖ నిర్లక్ష్యం కారణంగా కేన్‌వృక్షాలు తగ్గిపోతున్నాయి. ఫలితంగా జీవవైవిధ్యం సైతం ప్రమాదంలో పడుతోంది.
Endangered Cane Trees in Mulugu : సాప తీగ బరిగగా పిలుచుకునే కేన్ మొక్కలు జీవవైవిధ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే ఇవి పెరిగే పాలంపేట శివారు ప్రాంతాన్ని 1974లో అటవీశాఖ జీవవైవిద్య, పరిరక్షణ ప్రాంతంగా గుర్తించింది. ఈ మొక్కలపై పరిశోధనలు చేయడానికి అనేక ప్రాంతాల నుంచి వృక్ష శాస్త్ర నిపుణులు, విద్యార్థులు పాలంపేటకు వచ్చేవారు. అలా ఒకసారి పరిశోధనలకు వచ్చిన ఓ శాస్త్రవేత్తల బృందం కేరళ తర్వాత పాలంపేటలో మాత్రమే ఈ మొక్కలు ఉన్నాయని గుర్తించారు. దాదాపు 60ఎకరాల్లో ఉన్న ఈ మొక్కలు ఔషధ గుణాలు కలిగినవని తేల్చారు. గతంలో ఇదే ప్రాంతంలో ఉండే కొన్ని కుటుంబాలు ఈ వెదురుతోనే చేతికర్రలు, ఊయల వంటి తయారు చేసి ఉపాధి పొందేవారు. కొన్నేళ్లుగా వారు వలస వెళ్లడంతో వీటిని పట్టించుకునే వారు కరవయ్యారు.