Canada Education Students Facing Problems: అమెరికాకు చదువుకోవడానికి వెళ్దామంటే స్టడీ వీసాలు రావడం కష్టంగా ఉంది. ఫీజులూ ఎక్కువే ఉన్నాయి. ఎక్కువ మంది ఆ దేశానికే వెళ్తుండటంతో అందరికీ ఉద్యోగాలూ దొరకని పరిస్థితి. కెనడాకు దరఖాస్తు చేయడమే ఆలస్యం వీసాలు వస్తున్నాయి. చదువుకుంటూనే అధికారికంగా పార్ట్‌టైమ్ ఉద్యోగం చేసుకోవడానికి వీలుంది. యూఎస్‌ఏతో పోల్చుకుంటే ఇక్కడ 30 శాతం ఫీజులు తక్కువ. ఏడాదిలోనే చదువు పూర్తి చేయవచ్చు. ఇక పర్మనెంట్ రెసిడెన్స్(పీఆర్) ఒకటి రెండురోజుల్లోనే వస్తుంది.
దీంతో 2021 నుంచి ఇప్పటి వరకు లక్షల సంఖ్యలో కెనడా వెళ్లిన భారతీయ విద్యార్థులు ఇప్పుడు విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సైతం పెద్ద ఎత్తున ఆ దేశానికి వెళ్లారు. జీవన వ్యయం భారీగా పెరగడం ఉద్యోగాలు దొరకకపోవడంతో నానా కష్టాలు పడుతున్నారు. కెరీర్‌ను ఉన్నతంగా మలచుకోవచ్చన్న ఆశతో కెనడా వెళ్లిన విద్యార్థులు ఉద్యోగాలు వచ్చి తమ కష్టాలు ఎప్పుడు తీరతాయా? అని ఎదురుచూస్తున్నారు.
విద్యార్థులకు తగ్గిన ఉద్యోగావకాశాలు : అమెరికా నుంచి భారతీయ విద్యార్థులతో పాటు మొత్తం 14 దేశాల వారిని తమ దేశానికి రప్పించుకునే ఉద్దేశంతో త్వరితగతిన స్టడీ వీసాలు ఇచ్చేందుకు స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్(ఎస్‌డీఎస్) పథకాన్ని కెనడా 2018లో ప్రవేశపెట్టింది. దీనివల్ల ఇలా దరఖాస్తు చేయడంతో అలా వీసా వచ్చి భారీ సంఖ్యలో కెనడాకు వెళ్లారు. తాజాగా ఈ పథకాన్ని కెనడా రద్దు చేసింది.
ట్యూషన్ ఫీజులు 25 శాతం పెంపు :దీంతో కెనడాలో చదవాలనుకునే భారతీయ విద్యార్థులు రెగ్యులర్ స్టడీ పర్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వీసాల జారీ కూడా ఆలస్యం కావచ్చని తెలుస్తోంది. మరోవైపు విద్యాసంస్థలు ట్యూషన్ ఫీజులను దాదాపు 25 శాతం పెంచాయి. భారత్, కెనడాల మధ్య దౌత్య సంబంధాలు సున్నితంగా మారడం విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో చదువుకోవడానికి కెనడా వెళ్లాలనుకునే వారు ఇతర దేశాల వైపు చూసే అవకాశం ఉందని నిపుణులు తెలియజేస్తున్నారు. 2025 జనవరిలో ప్రారంభమయ్యే ఫాల్ సీజన్‌లో ప్రవేశాలు భారీగా తగ్గే అవకాశాలు ఉన్నాయి.