తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన భూ కేటాయింపు వ్యవహారంలో జోక్యం చేసుకోలేం : హైకోర్టు

2001 - 2006 వరకు జరిగిన భూకేటాయింపులో జోక్యం చేసుకోలేమన్న హైకోర్టు - 4 నెలల్లో స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ

By ETV Bharat Telangana Team

Published : 7 hours ago

GOVT LAND ISSUES
HIGH COURT ON LAND ALLACATION (ETV Bharat)

High Court On Govt lands : ఉమ్మడి రాష్ట్రంలో 2001 నుంచి 2006 వరకు జరిగిన భూకేటాయింపు వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. పారిశ్రామిక, ఐటీ రంగ అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం ప్రోత్సాహాకాలు కల్పించడంతో పాటు రాయితీ మీద భూకేటాయింపులు జరిపిందని తెలిపింది. అయితే ఇందూ టెక్ జోన్, బ్రాహ్మణి పరిశ్రమలతో సహా నిర్మాణం ప్రారంభించని పలు కంపెనీలకు చెందిన భూములను 4 నెలల్లో స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

2001 నుంచి 2006 వరకు ఎలాంటి ప్రకటన లేకుండా, వేలం నిర్వహించకుండా నామినేషన్ పద్ధతిపై కారు చౌకగా విక్రయం, లీజులకు 4156 ఎకరాల భూమిని కంపెనీలు, వ్యక్తులకు కేటాయించడాన్ని సవాలు చేస్తూ చత్రి అనే స్వచ్ఛంద సంస్థ 2007లో హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె. శ్రీనివాసరావులతో కూడిన ధర్మాసనం సుదీర్ఘ విచారణ చేపట్టి 72 పేజీల తీర్పు వెలువరించింది.

2001 నుంచి 2006 దాకా సాంకేతిక రంగం అభివృద్ధి, పరిశ్రమల ఏర్పాటుతో ఆర్ధిక ప్రగతి సాధించడానికి ప్రభుత్వం పలు విధానాలను రూపొందించిందని పేర్కొంది. చివరి కేటాయింపు జరిగిన ఏడాది తరువాత పిటిషన్ దాఖలు చేశారని, ఈ పిటిషన్ పెండింగ్‌లో ఉండగా పలు పరిశ్రమలు ఏర్పాటయ్యాయని తెలిపింది. అంతేగాకుండా వేల మంది నిరుద్యోగులకు ఉపాధి లభించిందని న్యాయస్థానం పేర్కొంది. పిటీషనర్ కోరినట్లుగా ప్రస్తుతం ఉన్న మార్కెట్ ధర ప్రకారం సొమ్ము వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేస్తే అది ప్రభుత్వం రూపొందించిన విధాన నిర్ణయాలకు విరుద్ధమని, అందువల్ల అలాంటి ఆదేశాలివ్వలేమని తేల్చి చెప్పింది.

భూమిని వెనక్కి తీసుకోవాల్సిందే: పరిశ్రమలు ఏర్పాటు చేయని కంపెనీల నుంచి భూమిని స్వాధీనం చేసుకోలేదన్న పిటిషనర్ వాదన మాత్రం సమర్ధనీయమంది. భూకేటాయింపులు జరిగినా నిర్మాణాలు ప్రారంభించని ఇందూటెక్ జోన్, బ్రాహ్మణి ఇన్ఫ్రాటెక్‌ లిమిటెడ్, స్టారేగేజ్ ప్రాపర్టీస్, అనంత టెక్నాలజీ, జెటీ హోల్డింగ్‌లకు కేటాయించిన భూమిని 4 నెలల్లో రద్దు చేయాలని ఆదేశించింది.

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు - సింగిల్ బెంచ్ తీర్పును అప్పీల్​ చేసిన అసెంబ్లీ కార్యదర్శి - HC ON MLA Disqualification Petition

ప్రభుత్వ ఆస్తుల కేటాయింపునకు సంబంధించిన విధానం పారదర్శకంగా ఉండాలని, ఇలాంటి ప్రభుత్వ విధానాలపై న్యాయసమీక్షకు సంబంధించి సుప్రీం కోర్టు వెలువరించిన పలు తీర్పులను ధర్మాసనం ప్రస్తావించింది. పారిశ్రామిక అభివృద్ధి నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం 1973లో ఏపీఐఐసీని ఏర్పాటు చేసిందని తెలిపింది. పథకాలు, ప్రాజెక్టులు, కార్యక్రమాలు చేపట్టడానికి, పౌరులకు సౌకర్యవంతమైన, పారదర్శకమైన సేవలు అందించడానికి కమ్యూనికేషన్ రంగాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిందని తెలిపింది.

విస్తృత స్థాయిలో ఉపాధి కల్పించడంలో భాగంగా పరిశ్రమలను ఆకర్షించడమే రాష్ట్ర ప్రభుత్వ విధానంలోని ప్రధాన ఉద్దేశమని పేర్కొంది. ఐటీ రంగానికి ప్రోత్సాహకాలు కల్పించడంలో అర్హతలు, విధివిధానాలు, దరఖాస్తులు, వాటి పరిశీలనా విధానం, షరతులు తదితరాలతో ప్రభుత్వ విధానానికి రూపకల్పన జరిగిందని తెలిపింది. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటరు ప్రకారం భూకేటాయింపులకు సంబంధించి 2000లోనే కమిటీని ఏర్పాటు చేసిందని తెలిపింది.

ఐటీ రంగం వృద్ధి: అప్పటి ప్రభుత్వ విధానాలు ఐటీ రంగానికి ఊతం ఇచ్చాయని, రాష్ట్రంలో ఐటీ రంగం 2004-05లో 64.05 వృద్ధి సాధించగా, జాతీయ సగటు 34 శాతం మాత్రమే ఉందని తెలిపింది. 2007-08లో పరిశ్రమల ఎగుమతి రూ. 8270 కోట్ల రూపాయలతో 41 శాతం ఉండగా జాతీయ సగటు 33.88 మాత్రమేని తెలిపింది. ఐటీ రంగానికి సంబంధించి 1997 నుంచి 2007-08 దాకా 1584 యూనిట్లు ఏర్పాటుకాగా, రూ.26,122 కోట్ల ఎగుమతులు, 10,101 కోట్ల రూపాయల పెట్టుబుడులు, 2.39 లక్షల ఉద్యోగాలు కల్పించినట్లు కౌంటరు ద్వారా వెల్లడైందని తెలిపింది.

2002-05, 2005-10 మధ్య ఐటీ పాలసీ వల్ల హైటెక్ సిటీ, సాఫ్ట్‌వేర్ యూనిట్స్ మాదాపూర్‌లో బహుళ జాతీయ సంస్థలు ఏర్పాటయ్యాయని తెలిపింది. భూకేటాయింపుల్లో దురుద్దేశాలు, వివక్ష ఉన్నట్లు పిటీషనర్ చెప్పలేదని, ఇవి లేకుండా ప్రభుత్వ నిర్ణయాలు ఏకపక్షమని చెప్పలేమని తెలిపింది. అందువల్ల పారిశ్రామిక అభివృద్ధి, ఉద్యోగాల కల్పన, ఆదాయం నిమిత్తం రాయితీ మీద భూకేటాయింపులో ప్రభుత్వ విధానదంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరంలేదదని తెలిపింది.

భూకేటాయింపులు జరిగిన పలు కంపెనీలు 2014 విభజన తరువాత ఏపీలో కొనసాగుతున్నాయని, వాటిలో జోక్యం చేసుకోలేమని ధర్మాసనం తెలిపింది. విప్రో, ఇన్ఫోసిస్, ల్యాంకో, హనీవెల్, తదితరాలు 50 నుంచి 100 కోట్ల రూపాయల పెట్టుబడులు, 3 వేల మందికి ఉపాధి లభించిందని తెలిపింది. ఇలా పలు బహుళజాతి సంస్థలు వేల కోట్ల పెట్టుబడి పెట్టడంతో పాటు వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాయని ధర్మాసనం తెలిపింది. ప్రభుత్వం విధానాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ భూకేటాయింపులపై చర్యలు తీసుకోంటోందని తెలిపింది. భూకేటాయింపులకు సంబంధించి ప్రభుత్వ విధానాల్లో జోక్యం చేసుకోలేమంటూ పిటిషన్‌పై విచారణను మూసివేసింది.

'గ్రూప్​-1 పాత నోటిఫికేషన్ రద్దు చేయకుండా - కొత్త నోటిఫికేషన్ చెల్లదు' - PETITIONS ON TG GROUP1 NOTIFICATION

రామాంతపూర్ పెద్దచెరువు ఎఫ్​టీఎల్​​ను 6నెలల్లో నిర్ధారించండి - రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం - HC On Ramanthapur Pedda Cheruvu

ABOUT THE AUTHOR

...view details