Garment Seller Select for DSC : వారిది పెద్ద కుటుంబం. అతడు పదో తరగతి వరకు చదవుకోవడమే గగనమయ్యింది. తల్లి కూరగాయల విక్రయం, తండ్రేమో వారసంతలు, వీధుల్లో దుస్తుల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని నడిపేవాడు. వారి కష్టాన్ని చూసి ఆయువకుడు చలించిపోయాడు. కుటుంబానికి దన్నుగా నిలవాలనుకున్నాడు. పదో తరగతి పాస్ కాగానే చదువు మధ్యలోనే ఆపేశాడు. తమ్ముడు, ముగ్గురు చెల్లెళ్లకు పెద్దన్నగా మారారు.
తాను కూడా తండ్రిలాగే బైక్‌పై వెళ్లి వారసంతలు, గ్రామాల్లో తిరుగుతూ దుస్తులు విక్రయించాడు. పదేళ్ల తరువాత దూరవిద్య ద్వారా డిగ్రీ, పీజీ, బీఈడీ పూర్తి చేశారు. ఇటీవల నిర్వహించిన ఉపాధ్యాయ ఎంపిక పరీక్షల్లో పట్టుదలతో చదివి సర్కారు ఉద్యోగాలు సాధించారు మంచిర్యాల జిల్లాకు చెందిన చెలిమెల రాజు. ఆయన ప్రస్తుతం విడుదల చేసిన డీఎస్సీ ఫలితాల్లో తెలుగు స్కూల్ అసిస్టెంట్ విభాగంలో మూడో ర్యాంకు సాధించారు.
పదేళ్లు ఆపేసి, ఆపై ప్రయత్నించి : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం వెంకట్రావ్‌పేట గ్రామానికి చెందిన రాయమల్లు, లక్ష్మి దంపతుల పెద్ద కుమారుడు రాజు. అతడి తమ్ముడు ప్రస్తుతం వాణిజ్య పన్నుల శాఖలో డీసీటీఓగా కరీంనగర్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్నాడు. అన్నదమ్ములిద్దరరూ కలిసి ముగ్గురు చెల్లెళ్లకు వివాహాలు చేశారు. రాజు తండ్రి అయిదేళ్ల క్రితం మరణించగా అతనే ఇంటికి పెద్దదిక్కయ్యారు. కాగా తన పదో తరగతిని 1998లోనే పూర్తి చేశారు. ఆర్థిక ఇబ్బందులు, తల్లిదండ్రులకు ఆసరాగా ఉండాలనే ఉద్దేశంతో చదువును పక్కనపెట్టారు. ఇంటికి చేదోడుగా ఉంటూనే ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే ఆలోచనలో పడ్డారు. ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలని నిర్ణయించుకున్నాడు.
2008-2011లో దూరవిద్యలో డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం బీఈడీ, పీజీ పూర్తిచేశాడు. గురుకులాల్లో ఉద్యోగ ప్రకటన వెలువడటంతో బాగా చదివి పీజీటీ తెలుగు ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. అక్కడ పనిచేస్తూనే డీఎస్సీకి సిద్ధమయ్యారు. స్కూల్ అసిస్టెంట్(తెలుగు) విభాగంలో జిల్లాలో రెండో ర్యాంకు సాధించాడు. అలాగే భాషా పండితుడిగా(తెలుగు) విభాగంలో జిల్లాలో మూడో ర్యాంకు సాధించాడు. పట్టుదలతో ప్రయత్నిస్తే ఏదైనా సాధించలేనిదంటూ లేదని నిరూపించారు రాజు. చదువుకు విరామం వచ్చిందని, నిరుత్సాహపడకుండా ఆలస్యమైనా తన లక్ష్యానికి చేరుకున్నాడు.
మరో అభ్యర్థి నాలుగు ఉద్యోగాలతో సత్తా : ఓ అభ్యర్థి ఏకంగా డీఎస్సీ-2024 ఫలితాల జాబితాలో వేర్వేరు విభాగాలలో నాలుగు ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికయ్యాడు. మావల మండలం బట్టిసావర్గాం పంచాయతీ దుబ్బగూడకు చెందిన నాయీబ్రాహ్మణ కుటుంబానికి చెందిన కాందేకర్ హన్మాండ్లు-లలిత దంపతుల కుమారుడు శివాజీ ఎస్‌ఏ తెలుగులో 15వ ర్యాంకు, స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ సైన్సు)లో రెండో ర్యాంకు, భాషా పండిత(ఎల్‌పీ) కేటగిరిలో 32వ ర్యాంకు, ఎస్జీటీ విభాగంలో 70వ ర్యాంకు సాధించారు.
ఈ విషయాన్ని గ్రహించిన విద్యాశాఖ అధికారులు ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలకు ఎంపికైన వారిని శనివారం నాడు డైట్ కళాశాలకు పిలిపించి వారి నుంచి ఏ ఉద్యోగానికి తొలి ప్రాధాన్యం ఇస్తున్నారో అభ్యర్థన పత్రాన్ని తీసుకున్నారు. నాలుగింటిలో ఎస్‌ఏ ఫిజికల్ సైన్సు పోస్టుకు శివాజీ తొలి ప్రాధాన్యం ఇస్తూ ఆ పత్రాన్ని సమర్పించారు. శివాజీ డిగ్రీ తర్వాత ఎంఎస్సీ(కెమిస్ట్రీ), ఎంఎ(తెలుగు), బీఎడ్, డీఎడ్‌తో పాటు భాషా పండిత కోర్సులు పూర్తి చేశారు.