Garuda Vahanam Seva in Tirumala : భక్తులకు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారి గరుడ వాహన సేవ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తిరుమల గిరులు భక్తులతో కిక్కిరిసిపోయాయి. గరుడ వాహన సేవను వీక్షించేందుకు భక్త జనం భారీగా తిరుమలకు తరలివచ్చారు. మాడ వీధుల్లోని 231 గ్యాలరీలు పూర్తిగా నిండిపోయాయి. దీంతో శిలా తోరణం కూడలి నుంచి క్యూలైన్లోకి ప్రవేశించాలని టీటీడీ అధికారులు కోరుతున్నారు. భక్తులకు నిరంతరాయంగా అన్న ప్రసాదాలు, మజ్జిగ, పాలును టీటీడీ పంపిణీ చేస్తోంది. గోవింద నామస్మరణతో తిరుమల మారుమోగుతోంది.
400లకు పైగా ఆర్టీసీ బస్సులు : తిరుమలలో గరుడోత్సవంలో భాగంగా నేటి సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు శ్రీ మలయప్పస్వామి మాడవీధుల్లో విహరించనున్నారు. గరుడ వాహన సేవను సుమారు 3.5 లక్షల మంది భక్తులు తిలకించనున్నారు. మాడవీధుల్లోని 231 గ్యాలరీల్లో సుమారు రెండు లక్షల మంది వీక్షించేలా ఏర్పాట్లు అన్ని పూర్తి చేశారు. మరోవైపు, గరుడ వాహన సేవకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసి, 400లకు పైగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసింది. ఈ బస్సులు 3 వేల ట్రిప్పులు నడిచేందుకు వీలుగా అధికారులు ఏర్పాట్లు చేశారు.
గరుడ సేవకు విస్తృత ఏర్పాట్లు : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రధానమైన గరుడ వాహన సేవకు విస్తృత ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని భక్తులకు మెరుగైన సేవలు అందించేలా సూక్ష్మ స్థాయిలో ప్రణాళికలు రూపొందించామని పేర్కొన్నారు. వకుళామాత, వెంగమాంబ కేంద్రాల నుంచి అన్న ప్రసాదాల పంపిణీ నిరంతరం జరిగేలా చర్యలు చేపట్టామన్నారు. మాడ వీధుల్లోని గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులతో పాటు తిరుమలకు చేరుకొంటున్న భక్తులు గరుడ వాహన సేవ వీక్షించేందుకు తగిన సౌకర్యాలు కల్పించామని వివరించారు.