Wedding Arrangements :పచ్చని పందిళ్లు, ముత్యాల తలంబ్రాలు, పెద్దల దీవెనలు, మహిళల సందడిలతో ఒక్కటవుతున్న జంటలు. ఇంకో రెండు రోజుల్లో ఏ ఊరూవాడా చూసినా ఇవే దృశ్యాలు కనిపిస్తాయి. అంతే కాదండోయ్ గృహ ప్రవేశాలు, ఇతర శుభకార్యాలకు విస్తృతంగా మంచి ముహూర్తాలు పెట్టుకునే అవకాశం ఉంది. అప్పుడే చాలా మంది సన్నాహకాలు కూడా మొదలు పెట్టేశారు. ఇవాళ (శుక్రవారం) నుంచి మాఘమాసం, మంచి రోజులు ప్రారంభం కానున్నాయి. దీంతో పెళ్లి వేడుకలో ముందడుగైన నిశ్చయ తాంబూలాలతో శుభకార్యాలు ప్రారంభం కానున్నాయి.
వివాహాలకు జనవరి 31 నుంచి మార్చి వరకు 11 శుభ ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. ఈసారి రాష్ట్రవ్యాప్తంగా లక్షల వివాహాలు జరగనున్నాయని అంచనా. గతేడాది డిసెంబరు 27 నుంచి మంచి ముహూర్తాలు లేకపోవడంతో వివాహాది శుభకార్యాలకు అవకాశం లేకుండాపోయింది. ఇవాళ (జనవరి 31న) గృహ ప్రవేశాలకు మంచి సమయం. ఇది కూడా 25 రోజుల తర్వాత వచ్చింది. అలాగే ఫిబ్రవరి 2వ తేదీ నుంచి పెళ్లిళ్లకు కలిసి వస్తుందని పురోహితులు చెబుతున్నారు.
ఈ తేదీల్లో మంచి ముహూర్తాలు : (పురోహితులు చెప్పిన మాటల ప్రకారం)
- మాఘ మాసంలో జనవరి 31వ తేదీన ఉదయం, రాత్రి రెండు ముహూర్తాలు.
- ఫిబ్రవరి 2, 7, 8, 13, 15, 16, 19, 20, 21, 23 తేదీల్లో మూడు సమయాల్లో ముహూర్తాలు.
- 22, 23 తేదీల్లో రెండేసి ముహూర్తాలు ఉన్నాయి.
- మార్చి 1, 2, 6, 7, 12 తేదీల్లో మంచి ముహూర్తాలు.
- అలాగే ఉగాది పండుగ తర్వాత ఏప్రిల్ 14, 16, 18, 19, 20, 21, 25, 29, 30 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయి.
- మే 1, 5, 6, 8, 15, 17, 18 తేదీల్లో మంచి ముహూర్తాలు.
- జూన్ 1, 2, 4, 7 తేదీల్లో పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి.