తెలంగాణ

telangana

ETV Bharat / state

జీఎస్టీ చెల్లించాలంటూ వేధింపులు - తట్టుకోలేక వ్యాపారి ఆత్మహత్య - BUSINESSMAN SUICIDE CASE

తన జీఎస్టీ రిజిస్ట్రేషన్‌ నెంబరుతో లావాదేవీలు జరిపి మోసం చేసిన సీఏ - మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న వ్యాపారి​

BUSINESSMAN SUICIDE
సూసైడ్​ చేసుకున్న వ్యాపారి మల్లికార్జున్ (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 3, 2025, 1:04 PM IST

A Business Man Suicide : హైదరాబాద్​ గండిపేటలో గురువారం (జనవరి 2) ఓ వ్యాపారి ఒంటిపై పెట్రోల్​ పోసుకొని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేపింది. రూ.64 లక్షలు జీఎస్టీ చెల్లించాలంటూ ఆ శాఖ అధికారుల నుంచి ఒత్తిడి పెరగడంతో తీవ్ర మనస్తాపానికి గురై సూసైడ్​ చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు, బిజినెస్​ పార్ట్​నర్​ ఆరోపిస్తున్నారు. మృతుడి జీఎస్టీ నంబరుతో మరొకరు ఇతర వ్యాపార లావాదేవీలు చేశారని, అందుకు సంబంధించి పన్ను కట్టాల్సి రావడంతో మనోవేదనతో ఈ దారుణానికి పాల్పడ్డట్లు చెబుతున్నారు. అసలు నిజంగానే జీఎస్టీ అధికారుల నుంచి ఫోన్‌ వచ్చిందా? లేక సైబర్‌ నేరగాళ్లు ఫోన్లు చేసి వేధించారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

చార్టర్డ్‌ అకౌంటెంట్‌ వల్లే :హైదరాబాద్‌ లంగర్‌హౌస్‌ కిషన్‌గూడ ప్రాంతానికి చెందిన మల్లిఖార్జున్ గతంలో ఎయిర్‌పోర్టు, హోటళ్లలో పని చేసేవాడు. అతడికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు. ఇటీవల తన స్నేహితుడు మల్లేశ్‌తో కలిసి బండ్లగూడలో చిప్స్‌ తయారీ వ్యాపారం ప్రారంభించాడు. ఇందుకోసం జీఎస్టీ కింద రిజిస్ట్రేషన్‌ చేయించాడు. ఇందుకు కర్మన్‌ఘాట్‌కు చెందిన ఓ చార్టర్డ్​ అకౌంటెంట్‌ సహకారం తీసుకున్నాడు. జీఎస్టీ రిజిస్ట్రేషన్‌ సమయంలో కేవలం చిప్స్‌ వ్యాపారమని నమోదైనా, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఇసుక, కంకర వ్యాపారం చేసిన లావాదేవీలు జరిగినట్లు మల్లిఖార్జున్‌ తెలుసుకున్నాడు.

జీఎస్టీ అధికారుల నుంచి ఫోన్లు! : సీఏ తరచూ ఫోన్‌ చేసి ఓటీపీలు అడిగేవాడని, ఇసుక, కంకర వ్యాపారంతో తనకు సంబంధం లేదని కుటుంబసభ్యులకు చెప్పుకుంటూ మృతుడు వాపోయారు. గత కొన్ని రోజులుగా రూ.64 లక్షల పన్ను చెల్లించాలని జీఎస్టీ అధికారుల నుంచి ఫోన్లు వస్తున్నాయని, ఇంత సొమ్ము తానెలా కట్టగలనని తన సోదరుడి చెప్పినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. జీఎస్టీ కట్టమంటూ ఫోన్లు చేశారని, నోటీసులు వచ్చినప్పుడు చూద్దామని అనవసరంగా ఆందోళనకు గురికావద్దని సోదరుడు శ్రీనివాస్ మల్లికార్జున్​కు సర్దిచెప్పారు. ఈ విషయాన్ని మల్లికార్జున్​ మాత్రం అంత తేలిగ్గా తీసుకోలేదు.

ఒంటిపై పెట్రోలు పోసుకుని : మల్లిఖార్జున్​కు పన్ను చెల్లించాలని ఫోన్ల ఒత్తిడి పెరగడంతో గురువారం (జనవరి 2) ఉదయం ఇంటి నుంచి వెళ్లిపోయారు. మధ్యాహ్న సమయంలో తన భార్య సునీతకు ఫోన్‌ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఫోన్​ చేసి చెప్పాడు. దీంతో భార్య సునీత ఆందోళనకు గురై ఇతర కుటుంబ సభ్యులకు చెప్పగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్‌ నెంబరు ఆధారంగా గుర్తించగా నార్సింగి పోలీస్‌స్టేషన్‌ పరిధి గండిపేటలో ఉన్నట్లు తెలుసుకుని అక్కడికి వెళ్లారు. గండిపేటలో ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకునే సమయంలో ఆర్తనాదాలను స్థానికులు విన్నారు.

జీఎస్టీ నెంబరు వాడటం వల్లే : వెంటనే గమనించి మంటలు ఆర్పారు. అప్పటికే మల్లికార్జున్ శరీరం 80 శాతం దాకా కాలిపోయి గాయాలయ్యాయి. ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశారు. సీఏ తన సోదరుడి జీఎస్టీ రిజిస్ట్రేషన్‌ నెంబరుతో అనధికారిక లావాదేవీలు నిర్వహించడం వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి సోదరుడు శ్రీనివాస్ వెల్లడించారు. కర్మన్‌ఘాట్‌లో ఉండే సీఏ కుమార్‌ వల్లే ఇదంతా జరిగిందని ఆయన ఆరోపించారు. ఈ ఘటనపై అంత్యక్రియల తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేస్తామని వివరించారు.

'నేను చనిపోతా - లేదు నేనే చనిపోతా' - సూసైడ్​పై ఆ ఇద్దరి మధ్య వాట్సాప్ చాటింగ్!

ఆ పరిచయమే బలితీసుకుందా? - వీడని ఎస్సై, కానిస్టేబుల్, ఆపరేటర్ డెత్ మిస్టరీ

ABOUT THE AUTHOR

...view details