Heavy Floods in Vijayawada :గతంలో ఎన్నడూ లేని విధంగా విజయవాడను వరద ముంచెత్తడంతో నగరవాసులు మూడురోజులుగా నీటిలోనే నానుతున్నారు. విజయవాడలో రామవరప్పాడు వంతెన కింద హోంమంత్రి ఉండే కాలనీ జలదిగ్బంధమైంది. అనిత నివాసాన్నీ వరద నీరు చుట్టుముట్టింది. తన పిల్లల్ని ఓ ట్రాక్టర్ ఎక్కించి సురక్షిత ప్రాంతానికి హోంమంత్రి తరలించారు. మంత్రి ఇంటి వద్దకు చేరుకున్న రెస్క్యూ టీమ్‌ను తన ఇంటి వద్దకంటే ముంపు ప్రాంతాల్లో ముందు సహాయ చర్యలు ముమ్మరం చేయాలని అనిత ఆదేశించారు. కాలనీలో ఇతర కుటుంబాలను రక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాటు చేశారు.
కృష్ణా నది ఉద్ధృతితో ప్రకాశం బ్యారేజీ దిగువ ప్రాంతాలు నీటమునిగాయి. యనమల కుదురు వద్ద రక్షణ గోడ పూర్తైన చోట నుంచి దిగువ ప్రాంతమంతా నీట మునిగింది. రామలింగేశ్వర నగర్, పుట్టరోడ్డు, శివపార్వతీ నగర్, సాయినగర్ కాలనీ కాలనీల్లో నాలుగు అడుగుల మేర వరద నీరు ఇళ్లను ముంచెత్తింది. పెద పులిపాక, శ్రీనగర్ కాలనీ వరకు 5 కిలోమీటర్ల మేర పలు కాలనీలు జలమయమయ్యాయి. ఆయా ప్రాంతాల్లో నిర్మించిన అపార్టుమెంట్లు, ఇళ్లలోని పెద్దఎత్తున వరదనీరు చేరింది.
Govt Distributing Food For Flood Victims Vijayawada :నిన్నటి వరకు సింగ్ నగర్ ప్రాంతానికి పరిమితమైన వరద ఉద్ధృతి క్రమంగా కృష్ణలంక, రామలింగేశ్వర నగర్, యనమలకుదురు ప్రాంతాలకు విస్తరించింది. వందల ఇళ్లు నీట మునిగాయి. వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రభుత్వ యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది. మంత్రి సవిత, ఎమ్మెల్యే బోడె ప్రసాద్ స్వయంగా సహాయ చర్యల్లో పాల్గొన్నారు.
చిట్టినగర్ జంక్షన్ నుంచి పాల ఫ్యాక్టరీ వరకు రోడ్లు, ఇళ్లన్నీ జలమయమయ్యాయి. వరద బాధితులకు ఆహార పొట్లాలు అందించేందుకు కళ్యాణమండపంలో ఏర్పాట్లు చేపట్టారు .12 వేల మందికి పైగా సరిపడా ఆహారాన్ని తయారు చేసి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ద్వారా అందిస్తున్నారు . కొందరు స్థానికులు ఆహార పొట్లాలు, మంచినీళ్లు, పాల ప్యాకెట్లు ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేస్తున్నారు. అజిత్ సింగ్ నగర్ కేంద్రంగా పెద్దఎత్తున సహాయ చర్యలను మంత్రులు పర్యవేక్షిస్తున్నారు.