Hardware Engineer Bag 52 lakhs Package in Telangana : ఈ యువతి తల్లిదండ్రులకు వ్యవసాయం గురించి తప్ప ఇంకేమి తెలియదు. దీంతో ఇంటర్ పూర్తికాగానే తెలిసిన వారి సలహాతో ఇంజినీరింగ్ కాలేజీలో చేరిపోయింది. తీరా బీటెక్ పూర్తయ్యాక అందరిలా సాఫ్ట్‌వేర్ రంగంవైపు వెళ్లేందుకు ఇష్టపడలేదు. హార్డ్‌వేర్ రంగంలో రాణించాలనే ఆశతో గేట్‌కు సన్నద్ధమైంది. మొదటిసారి విఫలమైనా రెండో ప్రయత్నంలో ఆలిండియా 36వ ర్యాంకు సాధించి నచ్చిన ఐఐటీలో ఎంటెక్ చదివింది. ప్రాంగణ నియామకాల్లో ఎన్విడియా అనే బహుళజాతి సంస్థలో భారీ వేతనంతో కలల కొలువును ఒడిసిపట్టింది.
స్పష్టమైన లక్ష్యం ఏర్పరచుకుని ప్రణాళికతో కృషి చేస్తే విజయం మీదే అంటోంది కరీంనగర్ జిల్లాలోని గోపాలరావుపేటకు చెందిన ఆశ్రిత. ఈమె తల్లిదండ్రులు నిత్యం వ్యవసాయ పనుల్లోనే తలమునకలయ్యేవారు. ఇది చదవాలి అని చెప్పేందుకు వారు ఉన్నత చదువులు చదవలేదు. అయినా ముందంజలో ఉండేందుకు నిత్యం కష్టపడేది ఆశ్రిత. అందరిలాగే ఆడుతూ పాడుతూ ఇంటర్ వరకూ చదివాక తర్వాత ఏం చదవాలని అయోమయంలో పడింది. చివరకు సన్నిహితుల సలహాతో ఊరికి సమీపంలోని జ్యోతిష్మతి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్‌లో చేరింది.
గేట్ పరీక్షలో ఆలిండియా 36వ ర్యాంకు :సాఫ్ట్‌వేర్ ఉద్యోగంపై ఆసక్తి లేకపోవడంతో ఐఐటీ కాలేజీలో ఎంటెక్ సీటు సంపాదించాలనే లక్ష్యంతో గేట్‌కు సన్నద్ధం కావాలనుకుంది ఆశ్రిత. స్నేహితుల ద్వారా ఉచితంగా శిక్షణ అందిస్తున్న చింతల రమేశ్ గురించి తెలుసుకుని 2020లో కరీంనగర్‌లోని రిగా అకాడమీలో చేరింది. 2021లో గేట్ పరీక్షలో 3 వేల ర్యాంకు సాధించింది. టాప్ ఐఐటీలో వీఎల్‌ఎస్‌ఐలో స్పెషలైజేషన్ కోర్సు చేయాలనే కోరికతో గేట్ పరీక్షకు మళ్లీ సన్నద్ధమైంది. ఏడాది సాధన తర్వాత 2022 గేట్ ఫలితాల్లో ఏకంగా ఆలిండియా 36వ ర్యాంకు సొంతం చేసుకుంది.