KTR Strongly Criticized The Prajavani Program :సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న మేడ్చల్ జిల్లాకు చెందిన రేణుక అనే మహిళ జీతం సరిగా రావటం లేదని ప్రజావాణిలో ఫిర్యాదు చేసిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. అయితే ఫిర్యాదు చేయడంతో సంబంధిత ఏజెన్సీ ఆమెను ఉద్యోగంలోంచి తొలగించిందని వెల్లడించారు. ఈ ప్రభుత్వానికి ఆర్భాటం ఎక్కువ, పరిష్కారం తక్కువ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ఇది ప్రజాపాలన కాదు, ఇది ప్రతీకార పాలన అని కేటీఆర్ విమర్శించారు. ఇప్పటివరకు మీ ప్రభుత్వంలో ఎంతమంది పేదలకు ప్రజాదర్బార్ వల్ల సమస్యలు పరిష్కారం అయ్యాయో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రేణుకను ఉద్యోగంలోంచి తొలగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు.
ఓటుకు నోటు కేసులో నేటికీ సీఎం రేవంత్‌రెడ్డి బెయిల్‌పైనే : బీఆర్ఎస్, బీజేపీ పొత్తు గురించి కాంగ్రెస్ పార్టీ నాయకులు పనికిమాలిన ప్రకటనలు చేస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఆక్షేపించారు. తాజా పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ విమర్శలపై ఘాటుగా స్పందించారు. 2015 డిసెంబరులో ఈడీ కేసులో సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు బెయిల్ మంజూరైందని దయచేసి గమనించండంటూ పోస్టులో పేర్కొన్నారు.
ఇటీవల ఎన్నికల్లో భారత కూటమిలో భాగమైన ఆప్ నేత మనీశ్ సిసోడియాకు వారం రోజుల క్రితం బెయిల్ మంజూరైందని ప్రస్తావించారు. ఓటుకు నోటు కుంభకోణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 2015 నుంచి బెయిల్‌పై ఉన్నారని గుర్తు చేశారు. ఇవన్నీ ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే జరిగాయని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్‌లు భాగస్వామ్య పక్షాలు అని, ఆపై ఉదాహరణలు బట్టి మనం ఊహించాలా? అని సూటిగా ప్రశ్నించారు.