BRS On Seeds Shortage in Telangana : వానాకాలం పంట సాగుకు రైతులు సంసిద్దమవుతున్నతరుణంలో అధికారుల నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడచూసినా విత్తనాల కోసం అన్నదాత అరిగోస పడుతున్నాడు. డిమాండ్ మేరకు విత్తనాలు అందుబాటులో లేకపోవడంతో ఆందోళనకు దిగారు. పోలీసులు వారిని నియంత్రించే క్రమంలో కాస్త తోపులాటకు దారితీసింది.
అధికారుల ముందస్తు ప్రణాళిక లోపించడంతో సరిపడా విత్తనాలు లభ్యం కావడం లేదని రైతులు వాపోతున్నారు. ఈ విత్తనాల కోసం ఉదయం నుంచి ఎండలోనే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.విత్తన యాజమాన్యాలతో చర్చలు జరుపుతున్నామని త్వరలో రైతులందరికి తాము కోరుకున్న విత్తనాలను సరఫరా చేస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ తోపులాట వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దీనిపై బీఆర్ఎస్ నేతలు స్పందిస్తున్నారు.
KTR Slams Congress Over Farmers Problems :బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందిస్తూ, రైతులు విత్తనాలు అడిగితే వారిపై పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారని మండిపడ్డారు. రైతులపై పోలీసుల లాఠీ ఛార్జ్‌ను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. కర్షకులపై దాడికి తెగబడ్డ ప్రభుత్వం వారికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతులపై దాడులు జరుగుతుంటే ముఖ్యమంత్రి దిల్లీలో పర్యటించడం సిగ్గుచేటని అన్నారు. రాజకీయాలు పక్కన బెట్టి సీఎం రేవంత్ రైతుల గురించి పట్టించుకోవాలని వ్యాఖ్యానించారు.
"ఐదు నెలల్లోనే రాష్ట్రం వ్యవసాయ సంక్షోభంలో కూరుకుపోవడం ముమ్మాటికి ప్రభుత్వ పరిపాలన వైఫల్యమే. రాష్ట్రంలో రైతన్నల సమస్యల పైన ముఖ్యమంత్రి వెంటనే ఒక ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించాలి. రైతన్నలపై లాఠీఛార్జ్ చేసిన అధికారుల పైన కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలి. రైతన్నలపై ప్రభుత్వ దాడులు బీఆర్ఎస్ ఉపేక్షించదు. విత్తనాల కోసం బారులు తీరిన రైతన్నలపై లాఠీచార్జ్ అత్యంత దారుణం, ఇది రైతన్నలపై ప్రభుత్వ దాడి. అన్నదాతలకు మేం అండగా ఉంటాం. అవసరమైతే పార్టీ తరపున విస్తృతమైన నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తాం." అని కేటీఆర్ అన్నారు.