BRS MLAs are Arrested :సబితా ఇంద్రారెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ నేతల ఆందోళన ఇవాళ కూడా కొనసాగింది. ఇవాళ కూడా అసెంబ్లీలో గులాబీ నేతలు సీఎం తీరుపై నిరసనకు దిగారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్ల బ్యాడ్జీలతో శాసనసభకు వచ్చారు. ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పాల్సిందే అని డిమాండ్ చేస్తూ కేటీఆర్ నాయకత్వంలో అసెంబ్లీలో పోడియం వద్ద ఆందోళన చేపట్టారు. తరువాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం ఛాంబర్ ముందు బైఠాయించారు. ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పేవరకు ఆందోళన విరమించేది లేదని తేల్చిచెప్పారు.
దీంతో నిరసన తెలుపుతున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను మార్షల్స్ బలవంతంగా బయటకు తీసుకొచ్చారు. బయట వారిని అరెస్ట్ చేసిన చేసిన తరువాత, పోలీస్ వాహనంలోనే వారిని తెలంగాణ భవన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ సభ్యులు మండిపడ్డారు. అక్కలను నమ్ముకుంటే బతుకు బస్టాండ్ అవుతుందని సీఎం నికృష్టంగా మాట్లాడారని కేటీఆర్ మండిపడ్డారు. మహిళలను నమ్ముకుంటే ముంచుతారని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లడటం శోచనీయమన్నారు. ఈ ముఖ్యమంత్రి అన్‌ఫిట్ ముఖ్యమంత్రి అని కేటీఆర్ విమర్శించారు. మరోవైపు సభాపతి నల్ల డ్రెస్‌తో రావడంపై హరీష్‌రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమకు మద్దతుగా నల్ల డ్రస్‌తో వచ్చిన స్పీకర్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.