BRS MLA Harish Rao about KCR on Kaleshwaram :గత ప్రభుత్వాల హయాంలో 30 ఏళ్లలో పూర్తికాని ప్రాజెక్ట్‌లను, కేసీఆర్ పాలనలో నాలుగేళ్లలోనే పూర్తి చేశామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలిపారు. రాష్ట్రంలో నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని, సిద్దిపేటలోని చిన్న కోడూరు మండలంలో మాత్రం వేసవిలో కూడా చెరువులో నీళ్లు ఉన్నాయంటే దానికి కారణం కాళేశ్వరం, కేసీఆరే అని ఆయన అన్నారు. ఇవాళ సిద్దిపేటలో పర్యటించిన ఆయన, గణేశ్ నగర్ హనుమాన్ దేవాలయం వద్ద శ్రీరామ కల్యాణ మండపం ప్రారంభించారు. అనంతరం చిన్న కోడూరు మండల కేంద్రంలో గౌడ కమ్యూనిటీ హల్‌ను స్థానిక జడ్పీ ఛైర్మన్ రోజా శర్మతో కలిసి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో పెద్ద కోడూరులో ఉచిత కుట్టు మిషన్లను పంపిణీ చేశారు.
ఈ సందర్బంగా మాజీ మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. ఆంజనేయ స్వామి, తనకు ప్రజలకు సేవ చేసే శక్తి ఇచ్చారని, మానవుడు ఎంత సంపాదించినా దేవుని సన్నిధిలోనే మనశ్శాంతి దొరుకుతుందని హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట గణేశ్ నగర్ హనుమాన్ దేవాలయం దినదిన అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. హనుమాన్ మాల వేసిన స్వాములకు సేవ చేయడం, దేవునికి సేవ చేయడమే అని ఆయన తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో గౌడ కమ్యూనిటీకి చెట్ల పన్ను రద్దు చేశామన్న ఆయన, వైన్స్ టెండర్లలో గీత కార్మికులకు రిజర్వేషన్లు తెచ్చిన ఘనత కేసీఆర్‌కు దక్కిందన్నారు. 20 లక్షల రూపాయలతో గౌడ కమ్యూనిటీ భవనం ప్రారంభం చేశామని చెప్పారు.
'బోర్లు, మోటార్లు కాలిపోతున్నాయి. పొలాలు కూడా మేకలు పశువుల మేతకు అయిందన్న వార్తలు చూస్తున్నాం. కానీ మన చిన్న కోడూరులో మాత్రం పచ్చటి పొలాలు కనిపిస్తున్నాయంటే అది కేసీఆర్ కృషి. కాళేశ్వరం వల్లే చిన్న కోడూరు చెరువులో ఎండాకాలంలో కూడా నీళ్లు ఉన్నాయి. తెలంగాణ రావడం వల్ల, కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం వల్ల నీటి ప్రాజెక్టులు పూర్తి చేసుకున్నాం.'- హరీశ్‌రావు, మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే