BRS Leaders Visit Kaleshwaram Project Today :భారత్ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం నేడు మేడిగడ్డ పర్యటనకు వెళ్లనుంది. గోదావరిలో ఉన్న నీటిని ఎత్తిపోసి రైతులకు నీరు ఇచ్చే అవకాశం ఉన్నా ప్రభుత్వం ఇవ్వడం లేదని బీఆర్ఎస్ అంటోంది. జలాశయాలకు నీటిని మళ్లించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకే ఈ పర్యటన చేపడుతున్నట్లు పేర్కొంది. నేడు బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాళేశ్వరం ప్రాజెక్టుకు బయలుదేరుతారు.
సాయంత్రం కరీంనగర్‌లోని దిగువ మానేరు డ్యాంను బీఆర్ఎస్ బృందం పరిశీలిస్తుంది. రాత్రికి రామగుండంలో బస చేస్తారు. మరలా శుక్రవారం ఉదయం 10 గంటలకు కన్నేపల్లి వద్ద ఉన్న లక్ష్మీ పంప్ హౌస్‌ను బీఆర్ఎస్ బృందం పరిశీలిస్తుంది. ఆ తర్వాత అక్కడి నుంచి మేడిగడ్డకు వెళ్లి ఆనకట్టను సందర్శిస్తారు. మేడిగడ్డ ఆనకట్ట పరిస్థిత, అక్కడ ప్రవాహం, పంప్ హౌస్ వద్ద నీటిమట్టం, ఎత్తిపోసేందుకు ఉన్న అవకాశాలు, తదితరాల గురించి పరిశీలిస్తారు.