Harish Rao Comments On CM Revanth :వరద బాధితులకు సాయం చేయడంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. తాము(బీఆర్ఎస్ నాయకులు) వరద బాధితులకు సాయం చేయడానికి వెళ్తే తమపై దాడి చేసి కేసులు నమోదు చేస్తున్నారని కాంగ్రెస్‌పై మండిపడ్డారు. సీఎం తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరన్న హరీశ్‌రావు తమకు వస్తున్న స్పందన చూసే కాంగ్రెస్ నేతలు దాడులు చేస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది :బీఆర్ఎసీ ఎంపీ, ఎమ్మెల్యేల నెల వేతనాన్ని వరద బాధితుల సహాయార్థం సీఎం సహాయనిధికి అందజేస్తున్నట్లు హరీశ్‌రావు తెలిపారు. వరద బాధితులకు ఉడతాభక్తిగా సాయం చేస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలో ప్రజాపాలన కాదు రాక్షస పాలన నడుస్తుందని విమర్శించారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు వద్ద వరద బాధితులకు సరుకులు పంపే వాహనాలను హరీశ్‌రావు జెండా ఊపి ప్రారంభించారు. బాధితులకు కనీసం అన్నం, నీళ్లు కూడా ఇవ్వలేకపోయారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.
Harish Rao On Students :మరోవైపు రాష్ట్రంలో విద్యార్థుల సమస్యలపై ఎక్స్ వేదికగా హరీశ్ రావు ట్వీట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు విద్యార్థుల పాలిట శాపంగా పరిణమించాయని ఆక్షేపించారు. ఉపాధ్యాయ దినోత్సవం రోజున తమ గురువులను సన్మానించుకునే సంబరాల్లో మునిగి తేలాల్సిన విద్యార్థులను రేవంత్ ప్రభుత్వం చదువులు మానేసి ధర్నాలకు దిగేలా చేయడం దురదృష్టకరం అని విమర్శించారు. తమ గురువులకు మద్ధతుగా గురుకుల విద్యార్థులు పిడికిలి బిగించడం అభినందనీయమన్నారు.