BRS Ex MP Vinod Kumar on Budget : రాష్ట్రానికి చెందిన ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి నీటిపారుదల ప్రాజెక్టులకు జాతీయ హోదా తీసుకు రావడంతో పాటు వెనకబడిన జిల్లాలకు నిధులు కేటాయించేలా చేయాలని బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ వినోద్ కుమార్ తెలిపారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభానికి ఒక రోజు మాత్రమే సమయం ఉందని, బీజేపీ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణలు ఈరోజు, రేపు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావాలని కోరారు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన ఇరిగేషన్ ప్రాజెక్టులకు జాతీయ హోదా, ఖాజీపేట్‌లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, వెనుకబడిన జిల్లాలకు నిధులు, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి నవోదయ విద్యాలయాలు రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు ఏర్పాటు చేయాలని కేంద్రంపై రాష్ట్ర ఎంపీలు ఒత్తిడి తేవాలన్నారు.
"ఈ నెల 23న కేంద్ర ప్రభుత్వం తొలిసారి బడ్జెట్ ప్రవేశపెడుతుంది. దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే వచ్చే ఐదు సంవత్సరాలు మోదీ పరిపాలనకు పునాది వేసేది ఈ బడ్జెట్టే. ఈసారి మిత్రపక్షాల సాకారంతో కేంద్ర ప్రభుత్వం నడుస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ నుంచి ఎన్నికైన బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి, రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్ట్‌లను సాధించుకోవాలి." -వినోద్ కుమార్, మాజీ ఎంపీ
ఈసారి టీడీపీపై ఆధారపడి మోదీ ప్రభుత్వం నడపాల్సి వస్తుంది :కాంగ్రెస్ 8మంది ఎంపీలు కూడా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి తెలంగాణకు రావల్సిన నిధులు, ప్రాజెక్టులను సాధించుకోవాలని తెలిపారు. ఈసారి తెలుగుదేశం పార్టీపై ఆధారపడి మోదీ కేంద్ర ప్రభుత్వం నడపాల్సి వస్తుందన్నారు.