KCR Focus On BRS Party Activities :గులాబీ అధినేత కేసీఆర్ డిసెంబర్ నెలలో తన తదుపరి కార్యాచరణ ప్రారంభించే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్ సర్కార్ ఏడాది పూర్తి చేసుకున్న తర్వాత వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. తనను కలుస్తున్న నేతలకు బీఆర్ఎస్ అధ్యక్షుడు ఈ మేరకు సంకేతాలు ఇస్తున్నారు. వివిధ అంశాలు, ప్రజల సమస్యలపై పార్టీ తరపున ఇలాగే వినిపించాలని సమయం చూసుకుని ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాలన్న భావనతో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది.
క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆరా తీస్తూ :లోక్సభ ఎన్నికల్లో పార్టీ ఓటమి అనంతరం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజల్లోకి రాలేదు. శాసనసభ సమావేశాల సమయంలోనూ కేవలం బడ్జెట్ రోజు మాత్రమే హాజరయ్యారు. అనంతరం పార్టీ కార్యకలాపాల్లోనూ ఆయన పెద్దగా పాల్గొనలేదు. బడ్జెట్ సమావేశాల సమయంలో తెలంగాణ భవన్‌లో జరిగిన పార్టీ శాసనసభా పక్ష సమావేశంలో పాల్గొన్న ఆయన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. ఆ తర్వాత ఎలాంటి సమావేశాల్లో పాల్గొనలేదు. తనను కలిసేందుకు వచ్చిన నేతలతో సమావేశమై పార్టీ గురించి, క్షేత్రస్థాయి పరిస్థితుల గురించి ఆరా తీస్తూ వస్తున్నారు.
జిల్లాలు, నియోజకవర్గాల వారీగా పలువురు నేతలు కేసీఆర్‌ను కలిసిన సమయంలో వారితో వివిధ అంశాలపై చర్చిస్తున్నారు. అయితే కేసీఆర్ ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనకపోవడంతో రాజకీయ ప్రత్యర్థులు విమర్శల వర్షం గుప్పిస్తున్నారు. ప్రజలు ప్రధాన ప్రతిపక్ష పాత్ర ఇస్తే అసెంబ్లీకి కూడా రావడం లేదని ఎద్దేవా చేస్తున్నారు. రుణమాఫీ, హైడ్రా కూల్చివేతలు, మూసీ, భారీ వర్షాలు, వరదల సమయంలోనూ కేసీఆర్ బహిరంగంగా స్పందించలేదు.
ప్రజల్లో ఉండాలని సూచిస్తూ :తనను కలిసిన నేతలతో రుణమాఫీ, హైడ్రా కూల్చివేతలు, ప్రజల వివిధ సమస్యలు, నాయకుల ఫిరాయింపులు, తదితరాల గురించి కేసీఆర్ చర్చిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను ఆరా తీస్తూనే నేతలకు తగిన సూచనలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, హామీల అమలు సహా ఇతర అంశాలపై తన అభిప్రాయాలను వారికి చెబుతున్నారు. నేతలు ప్రజల్లో ఉండాలని వారి కష్టసుఖాల్లో భాగం పంచుకోవాలని సూచిస్తున్నారు. సమస్యల ఆధారంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో పాటు వాటి పరిష్కారం కోసం కృషి చేయాలని వారికి చెప్తూ వస్తున్నారు.
ప్రభుత్వ వైఫల్యాలపై బాగానే స్పందిస్తున్నారు :కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలన్న భావనతో కేసీఆర్ మొదటి నుంచి ఉన్నారు. ఇదే విషయాన్ని కొన్ని సందర్భాల్లో బహిరంగంగా కూడా చెప్పారు. అయితే, సర్కార్ వైఖరి కారణంగానే తాము మాట్లాడాల్సి వస్తోందని కూడా అప్పట్లో అన్నారు. ప్రజాసమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలపై నేతలు బాగానే స్పందిస్తున్నారని కొనసాగించాలని నేతలతో గులాబీ అధినేత అంటున్నారని సమాచారం. దూకుడుగా వెళ్లాల్సిన అవసరం లేదని ప్రజల ఆధారంగా ముందుకెళ్లాలని సూచించినట్లు సమాచారం.
డిసెంబర్ తర్వాత ప్రజల్లోకి వెళ్లే అవకాశం :జిల్లా కేంద్రాలు, జిల్లాల్లో పార్టీ కార్యక్రమాల్లో కొంత వేగం పెంచాలని స్థానిక సమస్యలపై సత్వరమే స్పందించాలని నేతలతో కేసీఆర్ అన్నట్లు తెలిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకుంటే ఇంకా చాలా అంశాలపై స్పష్టత వస్తుందని అప్పుడు సమస్యల ఆధారంగా ప్రజల్లోకి వెళ్తే బాగుంటుందని కేసీఆర్ వారితో అన్నట్లు సమాచారం. పరిస్థితులను బట్టి కార్యాచరణ తీసుకుందామని చెప్పినట్లు తెలిసింది. డిసెంబర్ ఏడో తేదీతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువుతీరి ఏడాది అవుతుంది. ఆ తర్వాత కేసీఆర్ ఓ కార్యాచరణతో ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉందని నేతలు చెప్తున్నారు.
పార్టీని పటిష్టం చేసే దిశగా బీఆర్ఎస్ అడుగులు - ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాలపైనే ప్రధాన ఫోకస్ - BRS ON MLAs DEFECTED CONSTITUENCIES