TDP, BJP, Janasena Leaders Friendly Gathering in Pulivendula :వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో బీజేపీ, టీడీపీ జనసేన పార్టీలు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు వంగల శశిభూషణ్ రెడ్డి, పులివెందుల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీటెక్ రవి, జనసేన బాధ్యుడు హరితో పాటుగా మూడు పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ అక్రమాలతో పాటుగా ఎన్నికల్లో ఆ పార్టీని ఎదుర్కోవడంపై నేతలు తమ అభిప్రాయాలను వెల్లడించారు.
ఇళ్ల నిర్మాణంలో అవకతవకలు:రాష్ట్రంలో నెలకొన్న దుష్టపరిపాలనను అంతమెుందించడానికి మూడు పార్టీల నేతలు చర్చించినట్లు బీటెక్ రవి (BTech Ravi) తెలిపారు. సీఎం జగన్కు ఓటుతో బుద్ది చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఇక్కడ 8 వేల ఇళ్లు నిర్మిస్తే, అందులో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. కేంద్రం ఇచ్చే సంక్షేమ పథకాలను సీఎం జగన్ తాను ఇస్తున్నట్లుగా చెప్పుకుంటున్నారని బీటెక్ రవి విమర్శించారు. ఎన్నికలు రానున్న నేపథ్యంలో పులివెందులలో మెడికల్ కళాశాలను సీఎం హడావిడిగా ప్రారంభించారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ అనుమతులు లేకుండానే మెడికల్ కళాశాలను ప్రారంభించారని ఆరోపించారు. మెడికల్ కళాశాలకు అనుమతులు వచ్చి ఉంటే వాటిని మీడియాకు చూపించాలని తాము ప్రశ్నించామన్నారు. ఇదే అంశంపై మున్సిపల్ చైర్మన్ స్పందించారని, తాము ప్రారంభించింది మెడికల్ కాలేజీ కాదు, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అని చెబుతారని బీటెక్ రవి ఎద్దేవా చేశారు.