BJP MLC AVN Reddy letter to Congress Govt on DSC : తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన డీఎస్సీ-2024 ఫలితాల్లో విజయం సాధించిన అభ్యర్థులందరికీ బీజేపీ శాసనమండలి పక్షనేత ఏ.వీ.ఎన్.రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. పరీక్ష పూర్తి అయిన తర్వాత, అతి తక్కువ సమయంలోనే ఎటువంటి లోపాలు లేకుండా ఫలితాలు ప్రకటించిన ప్రభుత్వానికి, అందుకు సహకరించిన ప్రభుత్వ యంత్రాంగానికి ధన్యవాదాలు తెలిపారు. ఫలితాలు ప్రకటించిన మరుసటి రోజు నుంచి అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలనకు ఆదేశాలు జారీ చేయడం, ఈ నెల 9వ తేదీన విజయం సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సమాయత్తం కావడం చాలా సంతోషకరమైన విషయం అని కొనియాడారు.
అందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభినందనీయులని ఏ.వీ.ఎన్.రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అతి తక్కువ సమయంలోనే నియామక ప్రక్రియ పూర్తి చేయబోతున్నందున తాను విద్యాశాఖాధికారులకు కొన్ని సూచనలు చేస్తున్నానన్నారు. అభ్యర్థులు సమర్పించే ధ్రువపత్రాల పరిశీలన పూర్తిగా పారదర్శకంగా ఉండాలని కోరారు. అన్ని జిల్లాల స్పెషల్ ఎడ్యుకేషన్‌కు సంబంధించిన జాబితాలు కూడా విడుదల చేసి, వెరిఫికేషన్ పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. అదే విధంగా, ధ్రువపత్రాల పరిశీలన తర్వాత, మొదట స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాల 1:1 నిష్పత్తిలో జాబితా విడుదల చేసిన తర్వాతనే, మరుసటి రోజు ఎస్జీటీ 1:1 నిష్పత్తిలో జాబితాను విడుదల చేసినట్లయితే, అభ్యర్థులకు సరైన సమ న్యాయం జరుగుతుందని సూచించారు.